షెడ్డుకొచ్చేసిన బండ్లు.. ఫేడ్ ఔట్ అవుతున్న డైరెక్టర్లు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2024 | 06:10 PMLast Updated on: Aug 15, 2024 | 6:10 PM

Fade Out Directors In Tollywood

షెడ్డుకొచ్చేసిన బండికి సౌండ్ ఎక్కువ అంటారు. హడావుడి మాత్రమే.. వేగం ఉండదు. టాలీవుడ్‌ డైరెక్టర్ల విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. డైలాగ్‌లతో ఊపేసినవాళ్లు ఒకరు.. సుమోలు గాల్లో లేపి గూస్‌పంబ్స్ తెప్పించిన వాళ్లు ఒకరు.. బాక్సాఫీస్‌ను నవ్వులతో షేక్ చేసిన వాళ్లు ఇంకొంకరు.. స్వర్గాన్ని, అద్భుతాన్ని సినిమాల్లోకి డంప్ చేసిన డైరెక్టర్ మరొకరు.. ఎవరికి క్రియేటివిటీ వారిదే.. వాళ్లు చేయి వేస్తే చాలు సినిమా హిట్ అన్నట్లు ఉండేది సీన్. కట్ చేస్తే ఆ డైరెక్టర్లంతా ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరీ జగన్నాథ్ పలకరించాడు. ఇది తీసింది జగనేనా అనే అనుమానం వచ్చేలా ఉంది మూవీ. పూరీ డైలాగ్ రాస్తే రోమాలు నిక్కబొడుకుంటాయ్ అనే పేరు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు. ఇంకా చెప్పాలి అంటే.. ఆ పూరీనే లేడు ఇప్పుడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి ట్రెండ్‌ ఏంటో పరిచయం చేసిన పూరీ.. ఇప్పుడు రొడ్డ రోత కొట్టుడు సినిమాలతో.. ఫేడ్ ఔట్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. బాహుబలి, కల్కిలు అంటూ డైరెక్టర్లు దూసుకుపోతుంటే.. పూరీ మాత్రం రొటీన్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తున్నాడు. ఓటీటీలో అందరూ చూసేసింది.. ఇప్పుడు ముందుకు పెట్టి ఏదో అలా పని కానిచ్చేశాడు. పూరీలో మ్యాటర్ అయిపోయిందా అనే డౌట్ వస్తుంది సినిమాలు చూస్తుంటే ! అప్పుడెప్పుడో ఏడేళ్ల కింద టెంపర్ అని హిట్‌ కొట్టాడు. అదీ తనది కాని కథతో ! ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో.. ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే హిట్. లైగర్‌తో కోలుకోలేని ఫ్లాప్ అందుకున్న పూరీ.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌తో చేతులెత్తేశాడు. ఇక పూరీ రెస్ట్ తీసుకుంటే బెటర్ ఏమో అని ఫ్యాన్స్ అనుకుంటున్న పరిస్థితి. పూరీ మాత్రమే కాదు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్లు అంతా.. ఇప్పుడు ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటూ.. పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు పాపం. పూరీ గురువు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేసి.. సర్కార్‌, సత్య అంటూ సెన్సేషన్‌కు సెన్సేషన్ స్పెల్లింగ్ పరిచయం చేసి ఆర్జీవీ.. ఇప్పుడు బూతు సినిమాలు చేసుకుంటున్నాడు. రాత్, బూత్, అడవి.. అరిటాకు అంటూ వర్మ పెట్టిన, పెడుతున్న టార్చర్ అంతా ఇంతా కాదు. రెస్ట్ తీసుకో బాస్.. హింసించడం ఆపెయ్ అని ఫ్యాన్స్ కూడా అంటున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు.. మనోడి పరిస్థితి ఏంటో ! ఇక మరో డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి కూడా దాదాపు అంతే. ఒకప్పుడు కామెడీతో బాక్సాఫీస్‌ను నవ్వుల్లో ముంచేశాడు. అదే ఫార్ములా బేస్ చేసుకొని.. వరుస అలాంటి సినిమాలే చేశాడు. ఆ తర్వాత బొక్కాబోర్లా పడ్డాడు. శ్రీను కెరీర్ కొన్నేళ్లుగా ఆశించిన విధంగా సాగడం లేదు. హిట్లు మీద హిట్లు వస్తున్నాయని కదా అని.. ఒకే తరహా సినిమాలు తీయడంతో… జనాలు బోర్ ఫీలై వాటిని రిజెక్ట్ చేశారు. వరుస సినిమా ఫ్లాప్స్ రావడంతో.. సైలెంట్ అయిపోయాడు శ్రీను. ప్రస్తుతం గోపించంద్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక మాస్, కమర్షియల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వీవీ వినాయక్ గురించి.. తక్కువ మాట్లాడుకోవడమే బెటర్. కొన్నేళ్లుగా వినాయక్ సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు.. ఇంటెలిజెంట్ ఫ్లాప్ తర్వాత మరో చిత్రాన్ని తీయలేదు. ఈ ట్రెండ్‌కు సెట్ కాను అని డిసైడ్ అయ్యారో.. ఎవరైనా చెప్పారో కానీ.. సినిమాలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను సేవ్ చేశాడు. ఇది వినాయక్‌లో మెచ్చుకోవాల్సిన విషయం. అటు డైరెక్టర్ శంకర్ కూడా.. ఈ మధ్య గాడి తప్పాడు. అర్థం లేని కథ.. అర్థం చేసుకోలేని డైలాగ్‌లు.. అర్థం చెప్పని సినిమా.. ఇదే ఓ సగటు సినిమా అనుకుంటున్న సమయంలో.. భారీతనానికి సోషల్‌ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసి.. హిట్‌లు కొట్టాడు శంకర్‌. జెంటిల్‌మెన్‌ నుంచి రోబో వరకు.. శంకర్‌ తీసి ప్రతీ మూవీ ఓ డైమండ్‌. రోబో తర్వాతే.. శంకర్‌లో పస తగ్గిందా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయ్‌. అసలు ముట్టుకోను అనే రీమేక్‌లు తీయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ శంకర్ స్థాయివి అయితే కాదు. ఈ మధ్యే వచ్చిన ఇండియన్ 2 అయితే.. అసలు ఇది తీసింది శంకరేనా అనే డౌట్ తీసుకొచ్చింది. భారతీయుడు ముసలోడు పెట్టిన నస అంతా ఇంతా కాదు. ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌ అంటూ.. చెర్రీ ఫ్యాన్స్‌ను భయపెడుతున్నాడు. ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన డైరెక్టర్లు.. నెమ్మదిగా ఫేడ్ ఔట్ అవుతున్న పరిస్థితి. ఎలాంటి వాళ్లు ఎలా అయిపోయారు అంటూ.. ఓ వైపు కోప్పడుతూనే.. మరోవైపు జాలిపడుతున్నారు ఫ్యాన్స్ వీళ్లను చూసి.