ఫ్లాష్ బ్యాక్.. చిరంజీవి కెరీర్ ను కాపాడిన మోహన్ బాబు.. ఎలాగో మీరే చూసేయండి..!

చిరంజీవి కెరీర్ ను మోహన్ బాబు కాపాడడం ఏంటి..? ఈయన మెగాస్టార్, ఆయన కలెక్షన్ కింగ్..! ఇద్దరు ఇద్దరే.. పైగా చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్ గా కూడా నటించాడు కదా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 02:45 PMLast Updated on: Mar 21, 2025 | 5:54 PM

Flashback Mohan Babu Saved Chiranjeevis Career See For Yourself How

చిరంజీవి కెరీర్ ను మోహన్ బాబు కాపాడడం ఏంటి..? ఈయన మెగాస్టార్, ఆయన కలెక్షన్ కింగ్..! ఇద్దరు ఇద్దరే.. పైగా చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్ గా కూడా నటించాడు కదా.. అలాంటి నటుడు చిరంజీవి కెరీర్ కాపాడడం ఏంటి అనుకుంటున్నారు కదా. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒకానొక సమయంలో చిరంజీవి కెరీర్ ను నిలబెట్టిన బ్లాక్ బస్టర్ సినిమా ముందు మోహన్ బాబు చేయాల్సింది. అనుకోకుండా అది అక్కడి నుంచి చిరంజీవి చేతుల్లోకి వచ్చింది. ఆ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మెగాస్టార్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. హిట్లర్. 1997లో విడుదలైన ఈ క్లాసిక్ మొదట మోహన్ బాబుకే ఆఫర్ చేశారు దర్శక నిర్మాతలు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మమ్ముట్టి నటించిన బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాకి హిట్లర్ అధికారిక తెలుగు రీమేక్.

ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యేకంటే ముందు చాలా పెద్ద కథ జరిగింది. నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్ద కొడుకు, అప్పట్లో హిట్లర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మోహన్ రాజా.. మలయాళ వెర్షన్ విడుదలకు వారం ముందే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో మలయాళ విడుదలకు కొన్ని రోజుల ముందు.. ప్రముఖ రచయిత మరుధూరి రాజాను ఈ సినిమా చూడమని మోహన్ రాజా కోరాడు. ఆ తర్వాత రాజా, అతని భార్య తమ హోటల్ గదిలో హిట్లర్ సినిమా చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత మోహన్‌ రాజాతో మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగులో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని మోహన్ బాబుతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రీమేక్ చేయాలని అనుకున్నాడు మోహన్ రాజా. కానీ అప్పుడే పినిశెట్టితో పెదరాయుడు చేయడంతో ఈ రీమేక్ ఆఫర్ తిరస్కరించాడు మోహన్ బాబు. అలా ఆ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది.

చిరు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. ఆయనే దగ్గరుండి తనకు కావాల్సిన మార్పులు చేయించాడు. తన ఇమేజ్ కు సరిపోయేలా స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు. తెలుగు వెర్షన్ లో కామెడీకి పెద్ద పీట వేశారు. ఈ సినిమాకు ఎల్బీ శ్రీరామ్ మాటలు రాశాడు. అప్పటికే మూడు నాలుగు ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి కెరీర్ కు హిట్లర్ ఊపిరి పోసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మాస్టర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా అంటూ వరస హిట్స్ కొట్టాడు. ఇక హిట్లర్ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పోషించగా.. ప్రధాన పాత్రను ప్రకాష్ రాజ్ పోషించాడు. అంతేకాకుండా, రంభ గ్లామర్ షోతో పాటు, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ కామెడీ కూడా ఈ సినిమా రేంజ్ పెంచేశాయి. అలా తెలియకుండానే చిరంజీవి కెరీర్ కు మోహన్ బాబు హెల్ప్ చేశాడు.