Tollywood: టాలీవుడ్‌పై గోల్డెన్ గ్లోబ్ ప్రశంసలు.. చిరంజీవి, రాజమౌళి గురించి ఏం చెప్పారంటే

గోల్డెన్ గ్లోబ్ సంస్థ అంతర్జాతీయంగా సినిమాలకు అవార్డులు అందిస్తుంది. ఆస్కార్ తర్వాత ఈ అవార్డులకు కూడా అంతటి గుర్తింపు ఉంటుంది. అలాంటి సంస్థ తన పోర్టల్‌లో తెలుగు సినిమా గురించి ప్రస్తావించడం మన సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 19, 2023 | 05:03 PMLast Updated on: May 19, 2023 | 5:03 PM

Golden Globes Special Article On Tollywood And Rrr

Tollywood: ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి మూవీతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత ట్రిపులార్ సినిమా దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. మన నటులకు, సినిమాలకు, దర్శకులకు ప్రపంచవ్యాప్తంగా ఫిలిం మేకర్స్, ప్రేక్షకులు, విమర్శకులు, వివిధ సంస్థల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా గోల్డెన్ గ్లోబ్ సంస్థ టాలీవుడ్‌ను పొగుడుతూ ఒక ఆర్టికల్ కూడా రాసింది. ఇందులో మన తెలుగు సినిమా ప్రస్థానాన్ని వివరించింది. గోల్డెన్ గ్లోబ్ సంస్థ అంతర్జాతీయంగా సినిమాలకు అవార్డులు అందిస్తుంది. ఆస్కార్ తర్వాత ఈ అవార్డులకు కూడా అంతటి గుర్తింపు ఉంటుంది. అలాంటి సంస్థ తన పోర్టల్‌లో తెలుగు సినిమా గురించి ప్రస్తావించడం మన సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. ఎస్ఎస్ రాజమౌళి నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు పలువురి పేర్లను ఈ వ్యాసంలో ప్రస్తావించింది.
టాలీవుడ్ దూసుకెళ్తోంది. అటు కలెక్షన్లు, రికార్డుల పరంగానే కాకుండా.. మన కళాకారులకు వ్యక్తిగతంగానూ గౌరవం, అభిమానం దక్కుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ సంస్థ గోల్డెన్ గ్లోబ్ టాలీవుడ్ గురించి ఒక ప్రత్యేక వ్యాసంలో ప్రచురించడమే ఇందుకు నిదర్శనం. ఈ వ్యాసంలో.. 1921లో రఘుపతి వెంకయ్య నాయుడు రూపొందించిన ‘భీష్మ ప్రతిజ్ఞ’ సినిమాతో తెలుగు సినిమా ప్రస్థానం మొదలైనట్లు, ఆ తర్వాత 1931లో ‘భక్త ప్రహ్లాద’ తొలి టాకీ చిత్రంగా విడుదలైనట్లు తెలిపింది. ఆ సినిమాల నుంచి నేడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ట్రిపులార్ వరకు తెలుగు సినిమా ప్రస్థానం గురించి గొప్పగా చెప్పింది. హైదరాబాద్‌లో ఫిలిం స్టూడియోలు సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రాజమౌళి వంటి ప్రముఖుల గురించి చెప్పింది.

ట్రిపులార్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాజమౌళి, నటీనటులు తారక్, చరణ్ గురించి, బాహుబలి సిరీస్, ప్రభాస్ సాహో, మహేశ్ బాబు దూకుడు, అల్లు అర్జున్ అలవైకుంఠపురములో, సుకుమార్ రూపొందించిన పుష్ప వంటి అనేక సినిమాల గురించి ప్రస్తావించింది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇండియాలో తొలిసారిగా తెలుగులోనే సినిమా రూపొందించింది అనే విషయాన్ని కూడా వివరించింది. 2011లో విడుదలైన అనగనగా ఓ ధీరుడు సినిమాను డిస్నీ రూపొందించింది. గోల్డెన్ గ్లోబ్ అంచనా ప్రకారం ఇప్పుడు ఇండియాలో టాలీవుడ్ అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గత ఏడాది తెలుగు సినిమా 212 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.1754 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలిపింది. ఇండియాలోనే పెద్ద పరిశ్రమగా చెప్పుకొనే బాలీవుడ్‪ను దాటినట్లు కూడా రాసుకొచ్చింది. మన సినిమా గురించి ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా చూడాలి.

Tollywood
ట్రిపులార్‌కు అరో అరుదైన గౌరవం
ఇప్పటికే జపాన్‌లో ట్రిపులార్ డబ్బింగ్ వెర్షన్ రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వంద రోజులకుపైగా ఈ సినిమా అక్కడ ఆడుతోంది. కలెక్షన్లు అదరగొట్టింది. అంతేకాదు.. తాజాగా అనన్ అనే జపాన్ మ్యాగజైన్ ఒకటి ట్రిపులార్ హీరోల ముఖచిత్రంతో ఒక ఎడిషన్ విడుదల చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ముఖచిత్రంతో జపాన్‌లో ఒక సంచిక విడుదలవ్వడం మన తెలుగు సినిమాకు దక్కిన మరో అరుదైన గౌరవమే. అక్కడ ఎన్టీఆర్, చరణ్‌కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో చెప్పేందుకు ఇదో నిదర్శనం.