HanuMan Teaser: టీజర్ హిట్టైందని సినిమాను వాయిదా వేశారు.. ఇదేం ట్విస్ట్..?
చిన్న సినిమాగా, పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కింది హనుమాన్. అయితే, టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో సినిమా గ్రాఫిక్స్ ఉన్నాయనేంతగా టీజర్ సంచలనం సృష్టించింది.
HanuMan Teaser: సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడూ విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సక్సెస్ కూడా ఇబ్బంది పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు నిర్మాతలకు. తన సినిమా ఘన విజయం సాధించినందుకు గతంలో ఒక నిర్మాత బాధపడగా.. టీజర్ సూపర్ హిట్టైందని ఇప్పుడు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు మరో నిర్మాత. ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లోనే జరగడం విశేషం. నిర్మాత దిల్ రాజు సారథ్యంలో విడుదలై, ఘన విజయం సాధించిన చిత్రం బలగం.
రెండు కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పాతిక కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అయితే, సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు దిల్ రాజు ఒకరకంగా బాధపడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇంత హిట్ అవుతుందని తెలీక.. నాలుగా వారాలకే ఓటీటీలో వచ్చేలా డీల్ సెట్ చేసుకున్నాడు. దీంతో ఒక పక్క థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా ఆడుతున్నప్పుడే బలగం ఓటీటీలోకి వచ్చేసింది. అయినప్పటికీ ఆ సినిమా తర్వాత కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. ఒకవేళ ఓటీటీలోకి రాకుండా ఉండి ఉంటే.. బలగం థియేటర్లలోనే వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేసేదని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. దీంతో బలగం భారీ సక్సెస్ సాధించినా.. నిర్మాతకు ఎక్కడో అసంతృప్తినే ఇచ్చింది. ఇప్పుడు మరో సక్సెస్ ఇంకో నిర్మాతను ఇబ్బంది పెడుతోంది. ఆ సినిమా హనుమాన్. చిన్న సినిమాగా, పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కింది హనుమాన్. అయితే, టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
అంతర్జాతీయ స్థాయిలో సినిమా గ్రాఫిక్స్ ఉన్నాయనేంతగా టీజర్ సంచలనం సృష్టించింది. దీంతో చిత్ర నిర్మాత సహా యూనిట్ అంతా ఆనందపడాల్సింది పోయి కంగారు పడాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకుంటేనే సినిమా హిట్ అవుతుంది. వాళ్ల అంచనాలు ఏమాత్రం తప్పినా పరాజయం తప్పదు. అందుకే పెరిగిన అంచనాలు అందుకునేలా సినిమాను మరింత నాణ్యతగా రూపొందిస్తున్నారు. దీనికోసం ఏకంగా సినిమా విడుదల తేదీని వాయిదావేశారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 12న హనుమాన్ విడుదల కావాల్సి ఉంది. అయితే, గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని మరింత క్వాలిటీతో రూపొందించేందుకు నిర్మాత మరికొంత సమయం తీసుకోవాలి అనుకున్నారు. దీనికోసం సినిమాను ఆగష్టుకు వాయిదా వేశారు. హనుమాన్ మూవీని కూడా ఇతర భాషల్లో పుష్ప, కార్తికేయ-2లాగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.