Happy Birthday to Jr.NTR : హ్యాపీ బర్త్ డే మ్యాన్ ఆఫ్ మాసెస్
కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. మొదట జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ కు ఏ మాత్రం తీసిపోడని ఎప్పుడో నిరూపించుకున్నాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా రక్తి కట్టించడంలో తన తర్వాతే ఇంకెవరైనా అని ప్రేక్షకుల చేతా అనిపించుకున్నాడు. ఇక ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు
స్టోరీ ఏదైనా తారక్ ఒక్కసారి కేరెక్టర్లోకి వెళ్లాడంటే యాక్షన్లో పర్ ఫెక్షన్, డైలాగ్స్ లో ఎమోషన్, మూమెంట్స్ లో ఒక రకమైన రిథమ్ ఉండి తీరాల్సిందే. రూపంలో తాత పోలికలే కాదు… అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. తనకు నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా డైలాగ్స్ కూడా ఒకరేంజ్ లో చెప్పి.. తొడకొట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ .. మాస్ ఆడియన్స్ ఈ పేరును ఒక మంత్రంలా జపిస్తారు. తారక్ ఒక సినిమా చేస్తున్నాడంటే అది థియేటర్లకు వచ్చేంతవరకూ దాని కోసం తపిస్తారు. తను డైలాగ్ కొడితే విజిల్స్ కొడతారు .. డాన్స్ చేస్తే క్లాప్స్ కొడతారు. ఏ మాత్రం కథ బాగున్నా వసూళ్లు పెంచేస్తారు .. హిట్టు పట్టుకెళ్లి తారక్ ఇంట్లో పెట్టేస్తారు. ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ కి అంతటి అభిమానం .ఒక్క సినిమాతోనో .. ఒక్క పాత్ర తోనో ఎన్టీఆర్ ఇంతటి క్రేజ్ ను సంపాదించుకోలేదు. దాని వెనుక తారక్ కఠోర కృషి .. పట్టుదల .. కార్యదీక్ష కనిపిస్తాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పసితనంలోనే రాముడయ్యాడు. ‘నిన్ను చూడాలని’ వెండితెర తహతహలాడుతోంటే.. పసితనపు ఛాయలు వీడకుండానే ఆదిగా అదరగొట్టిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ అతను. ‘సింహాద్రి’గా సింహగర్జన చేసి తెలుగు సినిమా బాక్సాఫీస్ కు సునామీని చూపించిన ప్రతిభావంతుడు. వరుస విజయాలతో సరికొత్త స్ట్రాటజీ చూపిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ఈ తరంలో దొరికిన నటనా ఆణిముత్యం. ఎన్టీఆర్ తరపు హీరోల్లో అతన్లా అన్ని రసాలనూ పండించే హీరో మరొకరు లేరు అంటే అతిశయోక్తేం కాదు.
హీరోల కొడుకులు కూడా హీరోలయిన తర్వాత.. ఆ హీరోల మనవలు కూడా హీరోలే అవుతోన్న తొలి సందర్భంలో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అంతకు ముందే బాల నటుడుగా బాలరామాయణం అనే సినిమా చేసి ఔరా అనిపించాడు. నందమూరి తారకరామారావుకు తగ్గ మనవడుగా ‘బాలరామాయణం’లోనే అనిపించుకున్నాడు. రాబోయే కాలానికి కాబోయే స్టార్ గా అప్పుడే ఆశీర్వాదాలు అందుకున్నాడు. అది ‘ఆది’గా వచ్చి ఇప్పుడు టాప్ స్టార్ గా ఎదిగిన వరకూ అతని నట ప్రస్థానమంతా అత్యంత ప్రతిభావంతంగానే సాగింది.
వారసత్వం ఎంట్రీ కార్డ్. తర్వాత టాలెంటే ఫైనల్. నిన్ను చూడాలనితో రామోజీ రావు తారక్ ను హీరోగా పరిచయం చేశాడు. సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇతను హీరో ఏంటీ, వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అన్నారు. ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం.. మరీ లేతగా కనిపించడం.. ఆ కథలో ఏ కొత్తదనం లేకపోవడంతో పాటు సినిమా ఆడకపోవడం వంటి కారణాలన్నీ ఈ విమర్శలకు కారణం. అసలు అతను హీరోగా కంటిన్యూ కావాలా వద్దా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.
విమర్శలను తిప్పి కొట్టాలంటే పనితోనే చూపించాలి. ఆ పని వెంటనే చేశాడు ఎన్టీఆర్. నిజానికి అప్పటికి అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అయితేనేం ప్రతిభ ఉంది. అందుకే ఓ కొత్త దర్శకుడు అతన్ని నమ్మాడు. అతను రాజమౌళి. ఆ సినిమా ‘స్టూడెంట్ నెంబర్ వన్’. ఇద్దరికీ అది ఛాలెజింగ్ టాస్క్.. ఆ ఛాలెంజ్ లో ఈ ఇద్దరూ డిస్టింక్షన్ లో పాసయ్యారు. కట్ చేస్తే ఇప్పుడీ ఇద్దరూ వారివారి స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. ఆ స్నేహం కూడా చెరగలేదు. కొన్ని కథలు అలా కలిసొస్తాయి. అయితే దీని తర్వాత చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ‘సుబ్బు’ దెబ్బ కొట్టింది.
జూనియర్ ఎన్టీఆర్.. పెద్దాయన వారసుడిగా వచ్చాడు. సాధారణ సినిమాలు చేస్తే సరిపోదు. హిట్లు మాత్రమే కాదు.. ఏం హిట్టు కొట్టాడ్రా అనే పేరు కావాలి. ఈ సారి మరో కొత్త దర్శకుడు వచ్చాడు. సరిగ్గా పంతొమ్మిదేళ్లు మాత్రమే ఉన్న ఈ బుడ్డోడిని నమ్మి అతి పెద్ద సినిమా చేశాడు. ఇది అప్పటికి తారక్ కెపాసిటీకి అస్సలు సరిపోయే కథ కాదు. కానీ చేశాడు. ఎందుకంటే అతను ఎన్టీవోడి వారసుడు కదా. అదే ఆది. ‘ఆది’తో అతను తొడగొడితే బాక్సాఫీస్ ఉలిక్కి పడింది. 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఆది’.. 22కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 121కేంద్రాల్లో లో 50రోజులు, 96కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అప్పటికి ‘నరసింహనాయుడు’ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ‘ఆది’ చరిత్ర సృష్టించింది. సరిగ్గా మీసాలు కూడా రాని 19యేళ్ల కుర్రాడు చేసిన గర్జన ఇది.
ఆది’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టినా.. వయసు చిన్నది కావడం.. వచ్చిన ఇమేజ్ ను కరెక్ట్ గా బ్యాలన్స్ చేయగల అనుభవం ఉన్న పెద్దలు లేకపోవడంతో తర్వాత రెండు సాధారణ సినిమాలు చేశాడు. ‘అల్లరి రాముడు, నాగ’. ‘అల్లరి రాముడు’లో తాతగారి పాటను రీమిక్స్ చేశాడు. ‘నాగ’లో స్టూడెంట్ లీడర్ గా కొత్త ప్రయత్నం చేసినా.. ‘ఆది’ వంటి పవర్ ఫుల్ సినిమా ముందు ఈ రెండూ తేలిపోయాయి. మళ్లీ రాజమౌళి రంగంలోకి దిగాడు. విజయేంద్ర ప్రసాద్ కథ. ఈ కథలోని వెయిట్ కూ ఎన్టీఆర్ స్టామినా సరిపోదనుకున్నారు. కానీ అతని నటన చూసిన తర్వాత అప్పటి వరకూ అతన్ని లైట్ తీసుకున్న టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా తమ స్టార్డమ్ ను తడుముకున్నారంటే అతిశయోక్తి కాదు. ‘సింహాద్రి’గా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఇది. ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ లోకి వెళ్లిపోయాడు. అంత చిన్న వయసులో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ‘సింహాద్రి’ తర్వాత టాలీవుడ్ నెంబర్ గేమ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది.
‘సింహాద్రి’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్టార్డమ్ ను ఎన్టీఆర్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది. వరుస గా ఫ్లాపులు. ఓ దశలో ఇతనేనా ‘సింహాద్రి’ చేసింది అనిపించాడు. ‘ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహా, అశోక్, రాఖి’.. ఇలా చేసిన ప్రతి సినిమా పోయింది. అన్ని సినిమాలూ సింహాద్రి కావాలనే ఆరాటం కనిపిస్తుంది. ఇవి పోవడానికి ఇదో కారణం అనుకోవచ్చు. వీటిలో ‘రాఖి’ ఫర్వాలేదనిపించినా.. ఆ టైమ్ లో ఎన్టీఆర్ మరీ లావైపోయాడు. ఇది కూడా కొంత మైనస్ గా మారింది.
వరుసగా సినిమాలు పోతున్నాయి. దీంతో ఎన్టీఆర్ కెరీర్ పై నీలినీడలు ఏర్పడ్డాయి. ఈ టైమ్ లో మళ్లీ జక్కన్న రంగంలోకి దిగాడు. అది కూడా పూర్తి కండీషన్స్ పై. ఆ కండీషన్ ముందు ఎన్టీఆర్ లావు తగ్గాలని. అందుకోసం విపరీతంగా కష్టపడ్డాడు.. కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది కదా. కానీ ఈ పర్సనాలిటీతో వచ్చిన ఫస్ట్ మూవీ ‘యమదొంగ’. తర్వాత ‘కంత్రి’. ‘యమదొంగ’కు సెట్ అయిపోయాడు అనిపించినా ‘కంత్రి’ లుక్ కొంచెం తేడా అయింది. ఇక యమదొంగ సినిమాకు ఎన్టీఆర్ డైలాగ్స్ కు ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబుతో పోటీ పడి మరీ శెభాష్ అనిపించుకున్నాడు.
‘యమదొంగ’ తర్వాత మళ్లీ ‘ఆది’ దర్శకుడుతో ‘అదుర్స్’ అనిపించాడు. అదుర్స్ లో అతని నటన చూస్తే ఈ తరపు నవరస నాయకుడు అని ఎందుకు అంటారో తెలుస్తుంది. అప్పటి వరకూ ఊరమాస్ డైలాగ్స్ చెబుతూ కాస్త రూడ్ గా ఉండే పాత్రలు చేసిన ఎన్టీఆర్ చారీగా చేసిన హడావిడీకి పడిపడి నవ్వారు. దీని తర్వాత ‘బృందావనం’లో ఫ్యామిలీ స్టార్ గా మారాడు. ఈ రెండు సినిమాలు తనలోని క్లాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించాయి.
ఎన్టీఆర్ కు ఎందుకో మొదట్నుంచీ ఓ సెంటిమెంట్ ఉంది. ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. ఆ వెంటనే అన్ని సినిమాలూ పోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓ రెండుమూడు సినిమాల తర్వాత ఆ పోవడం స్టార్ట్ అయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శక్తి వచ్చింది ఈ టైమ్ లోనే. ఊసరవెళ్లి ఫర్వాలేదు. దమ్ము ఫ్లాప్. ‘బాద్ షా’ ఓకే. ‘బాద్ షా’తో ఓవర్శీస్ మార్కెట్ స్టార్ట్ అయింది. ‘రామయ్యా వస్తావయ్యా, రభస’.. ఇలా మిక్స్ డ్ రిజల్ట్. కానీ ఏదీ బ్లాక్ బస్టర్ కాదు.
ఎన్టీఆర్ గొప్ప నటుడు. నోడౌట్. కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడు. ఇదీ కంప్లైంట్. దీంతో అతను రీ థాట్ లో పడ్డాడు. అదే టైమ్ లో ఆడియన్స్ టేస్ట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. వారి టేస్ట్ కు అనుగుణంగా మారకపోతే ఎన్టీఆరే కాదు.. ఏ హీరో మనుగడైనా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. దీంతో రూట్ మార్చాడు. సిక్స్ ప్యాక్ కూడా చేసి, ఈ సారి తనలోని మరో యాంగిల్.. ‘టెంపర్’ చూపించాడు. ఆడియన్స్ కు ఆ టెంపర్ నచ్చింది. క్లైమాక్స్ తో మరోసారి తానెంత గొప్ప నటుడో చూపించాడు.
‘టెంపర్’తో తనేం చేస్తే ఆడియన్స్ కు నచ్చుతుందో తెలిసివచ్చింది. అంతే పూర్తిగా మారిపోయాడు. క్లాస్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి నాన్నకు ప్రేమతో అన్నాడు. తన కెరీర్ లోనే ఫస్ట్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డం నుంచి కాస్ట్యూమ్స్ వరకూ.. పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. ఇది జనాలకు నచ్చుతుందా అనే డౌట్ ఉన్నా.. సుకుమార్ ఇచ్చిన ధైర్యంతో దూసుకుపోయాడు. ‘నాన్నకు ప్రేమతో’ బిగ్గెస్ట్ హిట్..
తర్వాత కొరటాల శివతో ‘జనతా గ్యారేజ్’. ఎప్పుడో కుదరాల్సిన కాంబినేషన్ కాస్త ఆలస్యంగా సెట్ అయ్యింది. అయినా దుమ్మురేపాడు. పైగా ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఉన్నాడు. ఆయనకు ధీటుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సెభాష్ అనిపించాడు. ‘టెంపర్’ నుంచి ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్రతి సినిమా కలెక్షన్స్ పరంగా రేంజ్ పరంగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కిస్తూనే ఉంది.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా.. లవకుశ అనౌన్స్ అయినప్పుడే అంచనాలు పెంచింది. పైగా త్రిపాత్రాభినయం. ఇంకేముందీ ఎన్టీఆర్ నట విశ్వరూపం గ్యారెంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ పాత్రలో నత్తితో నటించాడు. ఇక క్లైమాక్స్ లో అతని నటనకు కన్నీళ్లు పెట్టని వారు లేరు. మూడు పాత్రల్లో అతను చూపిన వేరియేషన్ కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు ఓ లెస్సన్. ఆ స్థాయిలో ఆట్టుకున్నాడు.
‘జై లవ కుశ’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాడు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో అన్న ప్రశ్నకు వినూత్నంగా సమాధానం చెప్పారు ఇద్దరూ. త్రివిక్రమ్.. ఎన్టీఆర్ స్టైల్ లోనే ఈ సినిమాని తీసినట్టు అనిపిస్తుంది. అయితే.. త్రివిక్రమ్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే డైలాగ్స్, కామెడీ పంచ్ లు మాత్రం గత చిత్రాలతో పోలిస్తే తగ్గాయనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ కలెక్షన్స్ కూడా 100 కోట్లకు పైగానే రాబట్టింది. సినిమా ఓపెనింగ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఏ మాస్ అభిమాని మర్చిపోలేనంత రేంజులో తీశారు. కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే. అలాంటిది మల్టీస్టారర్ అంటే ఇంకెలా ఉంటుంది. అందుకే రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిపి ‘ఆర్.ఆర్.ఆర్’ అనౌన్స్ అయినప్పుడూ అంతా ఇదే ఫీలయ్యారు. ఊహించినట్టుగానే తనకే సొంతమైన అద్భుత నటనతో దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కేవలం పాన్ ఇండియా హిట్ మాత్రమే కాదు.. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులతో అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రభంజనమే సృష్టించింది. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి ప్రశంసలు దక్కాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తోన్న సినిమా ఇది. దసరా కానుకగా అక్టోబర్ లో ‘దేవర’ రాబోతుంది. మరోవైపు.. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ గా ‘వార్ 2’ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనూ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు తారక్. మొత్తంమీద.. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడుగా ఎన్టీఆర్ ఎదగాలని కోరుకుంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతోంది