తెరపైకి హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..?

ఉదయ్ కిరణ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈ జనరేషన్‌కు ఉదయ్ ఎవరో తెలియదు కానీ 90స్ కిడ్స్‌ను అడిగితే తెలుస్తుంది ఉదయ్ కిరణ్ రేంజ్ ఏంటో..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2025 | 12:30 PMLast Updated on: Mar 08, 2025 | 12:30 PM

Hat Trick Hero Uday Kirans Biopic To Hit The Screens Do You Know Who The Hero Is

ఉదయ్ కిరణ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈ జనరేషన్‌కు ఉదయ్ ఎవరో తెలియదు కానీ 90స్ కిడ్స్‌ను అడిగితే తెలుస్తుంది ఉదయ్ కిరణ్ రేంజ్ ఏంటో..? అప్పట్లో ఆయన సినిమాలు సృష్టించిన సంచలనాల గురించి చెప్పడానికి మాటలు సరిపోయేవి కావు. ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసాడు ఉదయ్ కిరణ్. కానీ ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పడిపోయాడు.. ఆ తర్వాత తట్టుకోలేక తనువు చాలించాడు. ఇప్పుడు ఈయన బయోపిక్ వస్తుందంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అవును.. మీరు వింటున్నది నిజమే. త్వరలోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా రావాల్సి ఉంది.. కానీ వాయిదా పడుతూ వస్తుంది.

అప్పట్లో దర్శకుడు తేజ కాబోయే అల్లుడు అంటూ ఉదయ్ కిరణ్ బయోపిక్ అనౌన్స్ చేసాడు కానీ ఎందుకో మళ్ళి కొన్ని కారణాల వల్ల సినిమాను ఆపేసాడు. ఆ కారణాలు ఏంటనేది అందరికీ తెలుసు కూడా..! ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలంటే అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. తేజ కాదన్నా.. తాజాగా ఓ కొత్త దర్శకుడు మరోసారి ఉదయ్ బయోపిక్‌పై ఫోకస్ చేసాడు. 2014లో ఈయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అంతా ఈ కుర్ర హీరోను మ‌రిచిపోయారంతా. కానీ ఇప్పుడు ఓ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు గుర్తు చేస్తున్నాడు. కొన్ని లఘు చిత్రాలు చేసిన అనుభవం ఉన్న ఆ దర్శకుడు.. ఓ భారీ ప్రొడక్షన్ హౌజ్‌తో కలిసి ఉద‌య్ బయోపిక్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇందులో ఓ కుర్ర హీరో నటించబోతున్నాడు. నిజానికి ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ తాను ఏ బయోపిక్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చాడు సందీప్. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్‌ని తేజ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడు.

ఆ తర్వాత నువ్వునేనుతో స్టార్‌గా మార్చాడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం లాంటి సినిమాలు ఉదయ్‌ను సూపర్ స్టార్‌గా మార్చేసాయి. అయితే ఆ తర్వాత ఉద‌య్ జీవితంలో అనుకోని కుదుపు చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం అయి క్యాన్సిల్ అవ్వ‌డం. ఆ త‌ర్వాతే ఆయ‌న కెరీర్ గాడి త‌ప్పిందంటారు అంతా. ఓ ర‌కంగా ఉద‌య్ కెరీర్ నాశ‌నం కావ‌డానికి సొంత త‌ప్పిదాలు ఎన్ని ఉన్నాయో.. చిరు కూడా అంతే కార‌ణం అంటారు. ఆ క‌థంతా ఇప్పుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. బ‌యోపిక్ చేయాల్సినంత గొప్ప సంఘ‌ట‌న‌లు ఉద‌య్ జీవితంలో ఏం జ‌ర‌గ‌లేదు. కానీ చేస్తానంటున్నాడంటే కేవ‌లం కాంట్ర‌వ‌ర్సీ కోస‌మే క‌దా..! మ‌రి ఉద‌య్ జీవితాన్ని తెర‌పై చూపించాలంటే మ‌ధ్య‌లో చిరుతో పాటు ప‌వ‌న్, అల్లు అర‌వింద్ పాత్ర‌లు కూడా చూపించాలి. మ‌రి అవ‌న్నీ చూపిస్తాడో లేదో చూడాలిక‌..!