‘పెద్ది’ లుక్.. పద్దతి మార్చుకున్న రామ్ చరణ్.. ఒక్కొక్కరినీ లెక్కేసి మరీ కొడుతున్నాడు..!
మీరు గమనించారో లేదో తెలియదు గానీ కొన్నేళ్లుగా రామ్ చరణ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన కెరీర్ మాత్రమే కాదు.. మనిషిగానూ చాలా మారిపోయాడు మెగా వారసుడు.

మీరు గమనించారో లేదో తెలియదు గానీ కొన్నేళ్లుగా రామ్ చరణ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన కెరీర్ మాత్రమే కాదు.. మనిషిగానూ చాలా మారిపోయాడు మెగా వారసుడు. ఒకప్పుడు అగ్రెషన్ ఇప్పుడు ఆయన దగ్గర లేదు. ఆటిట్యూడ్ అనే పదాన్నే దగ్గరికి రానీయట్లేదు మగధీరుడు. ఇక నటుడిగా ఈయన రేంజ్ మామూలుగా లేదిప్పుడు. హిట్ ప్లాపులు అనేవి కామన్.. కానీ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. అందులోనూ రామ్ చరణ్‌పై ముందు నుంచి కూడా నటన రాదు అంటూ చాలా వరకు రుద్దే ప్రయత్నం చేసారు. దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మెగా హీరో. అందుకే రంగస్థలం నుంచే తన స్టైల్ మార్చుకున్నాడు. చరణ్ ఫాలో అవుతున్న తీరు చూసి ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు. ఇప్పుడది పీక్స్‌కు వెళ్లిపోయింది.. కనీసం ఎవరూ తన నటనను వేలెత్తి చూపించలేనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు మెగా వారసుడు. 2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.
మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మగధీర అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లోనే ఈ సినిమా 75 కోట్ల షేర్ వసూలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ కలలో కూడా చూడని వసూళ్లను రెండో సినిమాతోనే చేసి చూపించాడు చరణ్. ఆ వెంటనే రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. అయితే ఎన్ని విజయాలు అందుకున్నా.. కన్సిస్టెంట్‌గా 50 కోట్ల షేర్ అందుకున్నా కూడా చరణ్ నటనపై విమర్శలు మాత్రం తప్పలేదు. ఈయనకు నటన రాదు.. చిరంజీవి కొడుకు కాబట్టి సర్వై అవుతున్నాడంటూ చాలా కామెంట్స్ వచ్చేవి. దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు కాబట్టే చరణ్‌లో గట్టి మార్పు మొదలైంది. ఆ మార్పు పేరు రంగస్థలం. దాని తర్వాత రామ్ చరణ్ నటనను విమర్శించే ధైర్యం ఎవరూ చేయలేదు. అప్పటి వరకు దర్శకులంతా రామ్ చరణ్‌లోని హీరోను మాత్రమే చూస్తే.. సుకుమార్ మాత్రమే తన రంగస్థలంలో నుటడిని చూసాడు. సిట్టిబాబుగా ఆ సినిమాలో నట విశ్వరూపం చూపించారు రామ్ చరణ్. ఆ తర్వాత వినయ విధేయ రామతో కమర్షియల్ ప్రయత్నం చేసి ఫ్లాప్ ఇచ్చాడు చరణ్. కానీ వెంటనే ట్రిపుల్ ఆర్‌లో మరోసారి రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పోటీ పడీ నటించారు.
ట్రిపుల్ ఆర్ కథ రాసిన విజయేంద్రప్రసాద్ సైతం తనకు రామ్ చరణ్ నటనే నచ్చిందని చెప్పారంటే .. అందులో చరణ్ నటన ఎంత బాగుందో అర్థమవుతుంది. మొన్నటికి మొన్న సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్‌లోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు గానీ అందులో అప్పన్న పాత్రకు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ఆ కారెక్టర్‌ను చరణ్ పోషించిన తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. అందుకే గేమ్ ఛేంజర్ విడుదలయ్యాక అప్పన్న పాత్రపై లెటర్ రూపంలో తన ప్రేమ చూపించాడు చరణ్. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో చరణ్ నటన చూసి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. రంగస్థలం తర్వాత ప్రతీ సినిమాలోనూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నాడు చరణ్. తాజాగా బుచ్చిబాబుతో చేస్తున్న పెద్దిలోనూ రా అండ్ రస్టిక్ పాత్రనే చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో..? నెక్ట్స్ సుకుమార్‌తోనూ రూటెడ్ పాత్రనే చేయబోతున్నాడు. మొత్తానికి నటుడిగా సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నాడు చరణ్.https://www.instagram.com/alwaysramcharan/p/DHsGEBNvycm/?hl=en