ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.. హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్

కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు... వన్డేల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీలు చేసిన మొనగాడు... కెప్టెన్ గా పలు చారిత్రక విజయాలు అందించిన సారథి...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 11:25 AMLast Updated on: Feb 11, 2025 | 11:25 AM

Hit Man Is Back

కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు… వన్డేల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీలు చేసిన మొనగాడు… కెప్టెన్ గా పలు చారిత్రక విజయాలు అందించిన సారథి… అతనెవరో కాదు భారత కెప్టెన్ రోహిత్ శర్మ… ఒక ఆటగాడి సత్తా అంచనా వేసేందుకు ఈ ఉదాహరణలు చాలు.. కానీ క్రికెట్ లో రికార్డులు కొన్నాళ్ళే గుర్తుంటాయి… ఫామ్ కంటిన్యూ చేయకుంటే అప్పటి దాకా పొగిడినవారే ఇక చాల్లే రిటైరయిపో అంటారు… ప్రస్తుతం రోహిత్ శర్మ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. కానీ హిట్ మ్యాన్ మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చాడు.. అది కూడా మామూలుగా కాదు విధ్వంసకర సెంచరీతో దుమ్మురేపాడు. నిజానికి రోహిత్ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. అయితే తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని నిరూపిస్తూ శతక్కొట్టాడు.

కటక్ లో అతని విధ్వంసం చూసిన తర్వాత హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ భారీ సిక్స్‌లతో తన పాత ఆటను చూపించాడు. బంతి గుడ్ లెంగ్త్ లో పడ్డ.. షార్ట్ లెంగ్త్ లో వచ్చినా.. బౌండరీ బాదడమే లక్ష్యంగా రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. తన ఫేవరెట్ పుల్ షాట్ తో పాటు కవర్ డ్రైవ్, లాఫ్టెడ్, స్వీప్, కట్.. ఇలా అన్ని రకాల షాట్లను పర్ ఫెక్ట్ గా ఆడాడు. కళాత్మక బ్యాటింగ్ విధ్వంసంతో ఇంగ్లండ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని టార్గెట్ పెట్టుకుని క్రీజులో నిలబడ్డాడు. సెంచరీతో విమర్శకులకు గట్టి బదులిచ్చాడు.

ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్‌లో రెండో బంతిని సిక్సర్ కొట్టి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశబ్దంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్‌తోనే అభిమానులకు అభివాదం చేశాడు. పవర్ ప్లేలోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్స్‌లు బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు, 5 ఫోర్లతో శతకం సాధించాడు. త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.

వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 32వ శతకం. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడేనని కామెంట్ చేస్తున్నారు. దాదాపు 16 నెలల తర్వాత హిట్ మ్యాన్ వన్డేల్లో సెంచరీ అందుకున్నాడు. చివరగా 2023 అక్టోబర్ 11న దిల్లీలో అఫ్గానిస్థాన్ పై వన్డే శతకం చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకూ 50 ఓవర్ల ఫార్మాట్లో హండ్రెడ్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పటి రోహిత్ లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అతను ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే స్టేడియంలోని ఫ్యాన్స్ సంబరాలు అంతా ఇంతా కాదు.