ఏదో పెద్దమనిషి అని పిలిస్తే.. ఇలాగేనా చేసేది హరీష్ శంకర్ గారు.. మరీ అలా అనేస్తారా..?
మనం ఏదైనా ఫంక్షన్ చేశామనుకోండి.. ఏదో పెద్ద మనిషి కదా అని కొందరిని పిలుస్తుంటాం. వాళ్లు వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తే బాగుంటుంది..

మనం ఏదైనా ఫంక్షన్ చేశామనుకోండి.. ఏదో పెద్ద మనిషి కదా అని కొందరిని పిలుస్తుంటాం. వాళ్లు వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తే బాగుంటుంది.. కానీ మన మీదే తిరిగి అక్షింతలు వేసి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు హరీష్ శంకర్ విషయంలో కొందరు ఇదే ఫీలవుతున్నారు. అరే స్టార్ డైరెక్టర్.. పైగా ప్రస్తుతం కాస్త ఖాళీగా ఉన్నాడు.. తమ సినిమాల ఫంక్షన్స్ కు పిలిస్తే కొద్దో గొప్పో హెల్ప్ అవుతుంది కదా అని ఆయనను పిలుస్తుంటే.. వచ్చినవాడు ఊరికే ఉండకుండా ఆ సినిమా మీదే సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్దాం.. అది మలయాళ సినిమా 2018 తెలుగు వర్షన్ ట్రైలర్ లాంచ్..! టోవీనో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది సినిమా. ఆ ట్రైలర్ లాంచ్ లో.. ఒక జర్నలిస్ట్ మన దర్శకులు ఎందుకు ఇలాంటి సినిమాలు చేయలేకపోతున్నారు అంటూ అడిగాడు..
దాంతో పాటు తెలుగు, మలయాళం అంటూ కాస్త విడదీసినట్టు మాట్లాడాడు. అప్పుడు వెంటనే పక్కనే ఉన్న హరీష్ శంకర్ మైక్ తీసుకుని.. మన సినిమాలు కూడా పక్క భాషల్లోకి వెళ్తున్నాయి కదా మరి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారా అంటూ తనదైన శైలిలో పంచులు వేశాడు. కట్ చేస్తే.. ప్రస్తుతానికి వద్దాం. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు తరచూ వెళ్తున్నాడు హరీష్. ఆ మధ్య ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ మాట్లాడుతూ మనం మన తెలుగు సినిమాలు చూడకపోయినా కూడా పక్క భాషల సినిమాలను ఎగబడి మరీ చూస్తాం వెళ్లి ఈ సినిమాను కూడా చూడండి అంటూ కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ స్పీచ్ బాగా వైరల్ అయింది. తన మిస్టర్ బచ్చన్ సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుల మీద సెటైర్లు వేశాడు అంటూ హరీష్ శంకర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగానే జరిగాయి.
ఇక తాజాగా జింఖానా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు ఈ దర్శకుడు. ఇందులో ప్రేమలు హీరో నెస్లన్ నటించాడు. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా వేడుకలో కూడా సేమ్ టు సేమ్ అవే కామెంట్స్ రిపీట్ చేశాడు హరీష్ శంకర్. మన ప్రేక్షకులు ఎప్పుడు పక్క భాష సినిమాలను ఎగబడి చూస్తారు.. ఇప్పుడు కూడా అదే చేయండి అంటూ మరోసారి కామెంట్ చేశాడు. గతంలో ఇలాంటి కామెంట్ తాను చేసినప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆడుకున్నారని.. అయినా కూడా తాను మళ్ళీ అదే అంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు హరీష్. మనోడి వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. భాషా బేధం లేదు.. సినిమాకు లాంగ్వేజ్ లేదు అంటూ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతాడు.. మళ్లీ వెంటనే మన సినిమాల కంటే పక్క సినిమాలనే ఎక్కువ చూస్తారు మన ఆడియన్స్ అంటూ మన మీద మళ్ళీ సెటైర్లు వేస్తాడు. అసలు హరీష్ స్టాండ్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు.