Film Industry: భారతీయ సినీ చరిత్రలో రికార్డు.. నాలుగు రోజుల్లో అత్యధిక వసూళ్లు..!
జైలర్, గదర్-2, ఓఎంజీ2, భోళా శంకర్ చిత్రాలు కలిపి గత వారాంతంలోనే రూ.390 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ పరిశ్రమ ప్రకటించింది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి ఈ వసూళ్లపై సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇంత స్థాయిలో కలెక్షన్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశాయి.
Film Industry: వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో గత వారాంతంలో దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. జైలర్, గదర్-2, ఓఎంజీ2, భోళా శంకర్ చిత్రాలు కలిపి గత వారాంతంలోనే రూ.390 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ పరిశ్రమ ప్రకటించింది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి ఈ వసూళ్లపై సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇంత స్థాయిలో కలెక్షన్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశాయి.
ఈ నాలుగు చిత్రాలు కలిపి వివిధ భాషల్లో మూడు రోజుల్లోనే రూ.390 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేశాయి. ఆగష్టు 11, 12, 13.. మూడు రోజుల్లోనే ఈ చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ స్థాయి కలెక్షన్లు వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నాలుగు చిత్రాల్లో జైలర్ ఒక రోజు ముందుగా.. గురువారం విడుదలైంది. మిగతా చిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు కూడా ఉండటంతో మరిన్ని కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆదివారం నాటికి ఈ చిత్రాలను 2.10 కోట్ల మంది చూశారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ గణాంకాలు సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. ఇవి దేశీయంగా నమోదైన వసూళ్లే. విదేశాల్లోనూ ఈ చిత్రాలు వసూళ్ల మోత మోగిస్తున్నాయి. ఈ కలెక్షన్లు ఒక రకంగా సినీ పరిశ్రమకు ఊపునిచ్చాయి. కొంతకాలంగా సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలు రావడం, బోలెడంత కంటెంట్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులకు థియేటర్లకు రావడం తగ్గించేశారు.
అయితే, గత వారం విడుదలైన చిత్రాలు మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్లు రప్పించేలా చేస్తున్నాయి. ఓఎంజీ2, గదర్2 చిత్రాలు బాలీవుడ్‌కు ఊపునిచ్చాయి. ఇటీవలి కాలంలో పఠాన్ మినహా సినిమాలన్నీ హిట్, సూపర్ హిట్ రేంజ్‌లోనే వసూళ్లు సాధిస్తుండగా.. తాజాగా వచ్చిన రెండు చిత్రాలూ మంచి టాక్ సంపాదించుకున్నాయి. అందులోనూ గదర్2 చిత్రానికి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సన్నీ డియోల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్‌గా చెప్పుకోవచ్చు. వారాంతంలోనే నాలుగు సినిమాలకు ఈ స్థాయి వసూళ్లు రావడం.. భారతీయులకు సినిమాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ఫిలిం మేకర్స్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.