నటనలో వీర’శివాజీ’.. వాడుకోండయ్యా.. టాలీవుడ్ కు మరో సూపర్ విలన్ దొరికినట్టే..!
పొరుగింటి పుల్లకూర రుచి అని పెద్దలు ఊరికే రాలేదు. మన కళ్ళ ముందు ఉన్న నటులు మనకు కనిపించరు కానీ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి మన వాళ్లు దిగుమతి చేసుకుంటూ ఉంటారు.

పొరుగింటి పుల్లకూర రుచి అని పెద్దలు ఊరికే రాలేదు. మన కళ్ళ ముందు ఉన్న నటులు మనకు కనిపించరు కానీ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి మన వాళ్లు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అదేంటని అడిగితే క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. వాళ్లకు క్రేజ్ ఉంది అని సమాధానాలు చెప్తుంటారు. నిజం చెప్పాలంటే తెలుగులోనే ఎంతో అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్లను వాడుకోవడంలో మన దర్శకులు విఫలం అవుతున్నారు అనేది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. లెజెండ్ సినిమా వచ్చేవరకు తెలియదు జగపతిబాబులో అంతటి విలన్ దాగి ఉన్నాడని..! అఖండలో శ్రీకాంత్ విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వీళ్ళిద్దరూ తెలుగు నటులే కదా..!
తాజాగా టాలీవుడ్ లో మరొక నటుడి పేరు బాగా వినిపిస్తుంది. 30 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు.. హీరోగా దాదాపు 30 సినిమాలు చేశాడు.. అయినా కూడా అప్పుడు రాని పేరు, గుర్తింపు ఇప్పుడు ఒక్క సినిమాతో వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన ఇంకెవరో కాదు.. శివాజీ. మిస్సమ్మ లాంటి సినిమాలతో నటుడుగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు శివాజీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించాడీయన. అయితే మధ్యలో పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న శివాజీ.. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చాడు. అందులో మధ్యతరగతి తండ్రిగా అద్భుతమైన నటనతో అందరినీ మాయ చేసిన శివాజీ ఇప్పుడు.. కోర్టు సినిమాలో పరువే ప్రారంభ బతికే మంగపతి పాత్రకు ప్రాణం పోశాడు. కోర్టు సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత అందులో నటించిన ప్రతి ఒక్కరు గుర్తుండిపోతారు.
అందరికంటే కాస్త ఎక్కువగా శివాజీ గుర్తుండిపోతాడు. విలనిజంలో ఒక కొత్త యాంగిల్ చూపించాడు శివాజీ. ఇంతకు ముందు కూడా ఈయన నెగిటివ్ రోల్స్ చేశాడు కానీ మంగపతి పాత్ర చాలా డిఫరెంట్. బేసిక్ గా ఆయన విలన్ కాదు మూర్ఖుడు. ఆడపిల్లలు స్లీవ్ లెస్ వేసుకున్నా కూడా ఒప్పుకోలేని మూర్ఖుడు. ప్రాపర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ పరువు కోసం బ్రతుకు ఒక మూర్ఖుడిగా నటించడం.. పైగా చివర్లో ఆ పాత్ర మీద కాస్త జాలి కూడా కలిగేలా నటించడం చిన్న విషయం కాదు. ఈ రెండు చేసి చూపించాడు శివాజీ. కచ్చితంగా కోర్టు సినిమా చూసిన తర్వాత ఆయనకు అవకాశాలు మామూలుగా ఉండవు అనే విషయం అర్థం అవుతుంది. మన దర్శకులు వాడుకోవాలి కానీ శివాజీ నెక్స్ట్ లెవెల్ లో వీరతాండవం చేయబోతున్నాడు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. మరి ఈ మంగపతిని మనవాళ్లు వాడుకుంటారా లేదంటే ఎప్పటిలాగే వదిలేస్తే మళ్లీ పక్క భాషల్లోకి వెళ్లి ప్రతాపం చూపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకటైతే నిజం.. ఇప్పటినుంచి శివాజీ 2.0 వెర్షన్ అయితే కనిపించబోతుంది.