పాపం త్రివిక్రమ్.. ఆ డైరెక్టర్ దెబ్బకు నిద్ర కూడా పోవట్లేదుగా..!
త్రివిక్రమ్ చివరి సినిమా గుంటూరు కారం వచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే మహేష్ బాబు కూడా రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు.

త్రివిక్రమ్ చివరి సినిమా గుంటూరు కారం వచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే మహేష్ బాబు కూడా రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు. ఇక గుంటూరు కారం తర్వాత శ్రీలీల అరడజన్ సినిమాలకు కమిట్ అయింది. మీనాక్షి చౌదరి సైతం వరుస సినిమాలు చేస్తుంది. ఒక్క త్రివిక్రమ్ మాత్రమే ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు. ఈయన తర్వాత సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతుంది. కెరీర్లో మొదటిసారి బన్నీ కోసం పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు గురూజీ. పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే బన్నీతో ప్యాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ సినిమా యుద్ధానికి ఆధ్యుడిగా కొలిచే కార్తికేయ స్వామి నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడిప్పుడే త్రివిక్రమ్ కు టెన్షన్ మొదలవుతుంది. అల్లు అర్జున్ తో సినిమా కోసం మరో దర్శకుడు కూడా పోటీ పడుతున్నాడు. ఆయన ఎవరో కాదు అట్లీ. జవాన్ తర్వాత ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ దర్శకుడు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, రజనీకాంత్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ చేస్తాడని ప్రచారం జరిగినా కూడా.. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మరీ అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. కథ నచ్చితే త్రివిక్రమ్ కంటే ముందు అట్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం గురూజీకి ఇంకొన్ని రోజులు వెయిటింగ్ తప్పదు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న అసలు విషయం ఏమిటంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పూర్తి కథ సిద్ధం చేయలేదు అని..! ఆల్రెడీ పుష్ప కోసం నాలుగేళ్లు తీసుకున్న బన్నీ.. ఇకపై ఏడాదికి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. అందుకే ముందుగా తనకు నచ్చే కథ ఎవరు తీసుకొస్తే వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అల్లు వారబ్బాయి. ఈ రేసులో గురూజీని ఎలాగైనా క్రాస్ చేసి బన్నీ సినిమా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నాడు అట్లీ. మరి అది జరుగుతుందా.. తనకు హ్యాట్రిక్ విజయాలు ఇచ్చిన మాటల మాంత్రికుడిని కాదని తమిళ దర్శకుడికి అల్లు అర్జున్ అవకాశం ఇస్తాడా..?