జీరో షేర్ దెబ్బకు మనిషి మాయం.. ‘మట్కా’ తర్వాత ఇన్నాళ్లకు కనిపించిన మెగా హీరో..!
ప్రతీ హీరో కెరీర్‌లోనూ ఫ్లాపులు వస్తుంటాయి. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కెరీర్ అన్న తర్వాత హిట్స్ ఎంత కామనో.. ఫ్లాపులు కూడా అంతే. కానీ ఆ ఫ్లాప్ కూడా కాస్త గౌరవంగా ఉండాలి..

ప్రతీ హీరో కెరీర్‌లోనూ ఫ్లాపులు వస్తుంటాయి. అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కెరీర్ అన్న తర్వాత హిట్స్ ఎంత కామనో.. ఫ్లాపులు కూడా అంతే. కానీ ఆ ఫ్లాప్ కూడా కాస్త గౌరవంగా ఉండాలి.. ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు గానీ కెరీర్‌ను ముంచేలా ఉండకూడదు కదా..! కానీ వరుణ్ తేజ్ విషయంలో ఇలాంటి డిజాస్టరే వచ్చింది. గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి కానీ ఏదో చెప్పడానికి ట్రై చేసాడులే అని సరిపెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ తర్వాత వచ్చిందో కళాఖండం. దాని పేరు మట్కా.. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌పై మోయలేని దెబ్బ కొట్టింది. మామూలుగా కాదు.. కనీసం కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేక.. మొదటి రోజే జీరో షేర్ తీసుకొచ్చి మెగా హీరో పరువు మొత్తం గంగలో కలిపేసింది మట్కా. అసలు ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. కెరీర్ మొదట్లో ఫిదా, తొలిప్రేమ, ఎఫ్-2 లాంటి సినిమాలతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు వరుణ్.
అలాగే కంచె, అంతరిక్షం లాంటి మంచి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసాడు. నటుడిగానే కాకుండా హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్.. గత కొన్నేళ్లుగా పూర్తిగా ట్రాక్ తప్పాడు. అసలెలాంటి కథలు ఎంచుకుంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి సినిమాలు వరుణ్ తేజ్ కెరీర్‌ను పూర్తిగా ముంచేసాయి. మరీ ముఖ్యంగా ‘మట్కా’ అయితే దారుణం. ఈ సినిమాపై దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడితే.. కనీసం కోటి రూపాయలు తీసుకురాలేకపోయింది. కనీసం థియేటర్ మెయింటైనెన్స్ కూడా వసూలు చేయలేదు మట్కా సినిమా. ఈ స్థితి నుంచి వరుణ్ తేజ్ కెరీర్ ఎలా ముందుకు వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు. అందుకే వరుణ్ తేజ్ కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు. మట్కా విడుదల తర్వాత కనీసం ఎవరికీ కనబడలేదు వరుణ్ తేజ్. చాలా రోజుల తర్వాత ఈయన నుంచి మరో సినిమా వస్తుంది. అదే ‘కొరియన్ కనకరాజు’. యువీ క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మంచి బడ్జెట్‌లోనే ఈ సినిమా మొదలైంది.
హార్రర్ కామెడీగా వస్తున్నాడు ఈ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ సరసన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ భామ రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కథకు కొరియాతో లింక్ ఉంటుంది. అదేంటనేది సినిమాలోనే చూడాలంటున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈయన కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడెప్పుడో నానితో కృష్ణార్జున యుద్దం తర్వాత నితిన్‌తో మ్యాస్ట్రో అంటూ ఓటిటి సినిమా తీసాడు. ఆ తర్వాత సంతోష్ శోభన్‌తో చేసిన లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అనే సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ ఐడియా లేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. 2025 చివర్లోనే సినిమాను విడుదల చేయనున్నారు. మరి చూడాలిక.. ఈ కొరియన్ కనకరాజు ఏం మ్యాజిక్ చేస్తాడో..?