విశ్వంభర విషయంలో చిరంజీవి సీరియస్.. ఏం చేస్తున్నారంటూ టీంపై అసహనం..?
అసలే చిరంజీవికి టైం బాలేదిప్పుడు. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర కింగ్ లా బతికిన ఈయన.. ఇప్పుడు రేసులో కాస్త వెనకబడిపోయాడు. ఈ మధ్య చిరంజీవి సినిమాలో పెద్దగా ఆడడం లేదు.

అసలే చిరంజీవికి టైం బాలేదిప్పుడు. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర కింగ్ లా బతికిన ఈయన.. ఇప్పుడు రేసులో కాస్త వెనకబడిపోయాడు. ఈ మధ్య చిరంజీవి సినిమాలో పెద్దగా ఆడడం లేదు. అలాగని మెగాస్టార్ ను తక్కువ అంచనా వేస్తే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. అక్కడున్నది చిరంజీవి.. ఆ విషయం ఎవరు మర్చిపోకూడదు. తెలుగు సినిమాకు మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు నేర్పించిన బాద్షా ఆయన. ఒకప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే పండగ వాతావరణం ఉండేది.. కనీసం నెల రోజుల వరకు ఆ ఇంపాక్ట్ ఉండేది అంటే ఆయన రేంజ్ అర్థమైపోతుంది. అలాంటి వింటేజ్ మెగాస్టార్ సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించాయి కానీ ఎక్కడో పూర్తిస్థాయి చిరంజీవిని చూశాము అని సంతృప్తి మాత్రం అభిమానులకు కలగడం లేదు. బహుశా చిరంజీవిలో కూడా ఇదే లోటు కనిపిస్తుంది. అందుకే తనదైన సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈయన విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి కెరీర్ లో వస్తున్న సోషల్ ఫాంటసి సినిమా ఇదే. అందుకే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే టీజర్ విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇవెక్కడి అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటూ ఈ సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అందుకే సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమాను పోస్ట్ పోన్ చేసి.. కొత్త డేట్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఒకటి రెండు రోజుల షూటింగ్ తప్ప మిగిలినదంతా అయిపోయింది.
అయితే ఈ సినిమా అవుట్ పుట్ చూసి చిరంజీవి అంత సంతృప్తిగా లేడు అని టాక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. తనకు కథ చెప్పినప్పుడు వచ్చిన ఫీలింగ్.. అవుట్ పుట్ చూసినప్పుడు రాలేదు అని దర్శక నిర్మాతలపై చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే సెకండ్ హాఫ్ లో రెండు మూడు సీన్లు సపరేట్ గా రాసుకొని ఈ మధ్య మళ్లీ షూట్ చేశారు. అన్ని కుదిరితే ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో చిరంజీవికి నలుగురు చెల్లెల్లు ఉంటారని తెలుస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశ్వంభర నుంచి రిలీజ్ అయిపోవాలని చూస్తున్నాడు చిరంజీవి. దీని తర్వాత అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదికి రానుంది. జూన్ లో మొదలుపెట్టి సంక్రాంతి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంది.