Rajinikanth: రజినీ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? చివరి సినిమా ప్రచారంలో నిజమెంత?

రజినీ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2002లో వచ్చిన బాబా మూవీనే తన చివరి సినిమా అని అప్పట్లో రజినీ స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. మంచి హిట్ మూవీతో తన కెరీర్ ముగించాలనుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 19, 2023 | 03:18 PMLast Updated on: May 19, 2023 | 3:18 PM

Is Rajinikanth Planning Retirement After Movie With Lokesh Kanagaraj

Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి భారతీయ సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న వెండితెర ఇలవేల్పు. ఈ సినీ దిగ్గజం త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్నది లేటెస్ట్ ప్రచారం. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత?
1975లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు రజినీ. విలన్ వేషాలు, చిన్న పాత్రలు వేస్తూ నేడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు. దక్షిణాదిన తిరుగులేని సూపర్ స్టార్‌గా నిలిచారు. ఇప్పటివరకు దాదాపు 170 చిత్రాలు చేశారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఒక సినిమా చిత్రీకరణ దశలో ఉండగా, మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. యువ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. తమిళ యువ దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. రజినీ తన చివరి చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో రజినీ చేయబోయే ఈ సినిమా ఆయన చివరి చిత్రం అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇది రజినీకి 171వ చిత్రం అవుతుంది. ఈ అంశంపై ఇటు రజినీ.. అటు లోకేష్.. ఎవరూ స్పందించలేదు. కానీ రజినీ చివరి చిత్రంపై ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
లోకేష్‌తో చివరి మూవీ..
ప్రస్తుతం రజినీ వయసు 72 ఏళ్లు. ఇమేజ్ పరంగా ఆయనకు ఇంకా స్టార్‌డమ్ ఉంది. సరైన సినిమా పడితే రికార్డులు నెలకొల్పగల సత్తా ఆయన సొంతం. అయితే, వయసుతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. రజినీ కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ మధ్యలో కూడా అనారోగ్యానికి గురైన సందర్భాలున్నాయి. అందుకే ఈ వయసులో ఎక్కువ రిస్క్ తీసుకుని సినిమాలు చేసే బదులు.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి విశ్రాంతి తీసుకోవడమే బెటర్ అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక మంచి సినిమాతో కెరీర్‌ను ముగించాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం వరుసగా సక్సెస్‌ఫుల్ మూవీస్ తీస్తున్న యువ దర్శకుడు లోకే‌ష్‌ను పిలిచి మాట్లాడారు. తనతో ఒక సినిమా చేయమని రజినీ అడిగారు. అది తన చివరి చిత్రం అవుతుందని, మంచి సినిమా తీయాలని రజినీ కోరారు. దీనికి లోకేష్ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో రజినీ-లోకేష్ కాంబోలో సినిమా రాబోతుంది. లోకేష్ గతంలో ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీశారు. వీరి కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే రజినీ చివరి సినిమా అవుతుందేమో అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. తమ అభిమాన నటుడు మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Rajinikanth
గతంలో కూడా ఇలాగే
రజినీ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2002లో వచ్చిన బాబా మూవీనే తన చివరి సినిమా అని అప్పట్లో రజినీ స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. మంచి హిట్ మూవీతో తన కెరీర్ ముగించాలనుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. కానీ, బాబా సినిమా ఫ్లాపైంది. బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో అటు సక్సెస్‌ఫుల్ మూవీతో కెరీర్ ముగించాలనుకోవడం, సినిమాతో నష్టపోయిన వారికి తిరిగి డబ్బులు చెల్లించాల్సిన కారణంతో రజినీ మళ్లీ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రముఖి, శివాజీ, రోబో వంటి బ్లాక్‌బస్టర్స్ తీస్తూ రజినీ తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రజినీ చివరి సినిమా అంటూ ప్రచారం మొదలైంది. ఈ విషయంలో రజినీ లేదా లోకేష్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అంతవరకు ఈ ప్రచారం సాగుతూనే ఉంటుంది.