మంచు బ్రదర్స్ మధ్య మళ్లీ వార్ తప్పదా..? ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్న సినిమాలు..!
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో మంచు వారింట జరిగిన రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా చూసింది.

మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో మంచు వారింట జరిగిన రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా చూసింది. ఇప్పటికీ ఈ ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి రాలేదు. కొడుకులిద్దరి కారణంగా మోహన్ బాబు కూడా బాగా డిప్రెస్ అయ్యాడు. కొన్ని రోజులు ఆస్పత్రి పాలయ్యాడు కూడా. ఆస్తి పంపకాలపై వచ్చిన తగాదాల నుంచి మొదలై ఈ వివాదం ఎక్కడి వరకో వెళ్లిపోయింది. మనోజ్, విష్ణు మధ్య వ్యక్తిగత దూరంతో పాటు, వృత్తిపరమైన విభేదాలు కూడా ఏర్పడ్డాయి. తన అన్న విష్ణు వల్లే తండ్రి మోహన్ బాబుకు కూడా తాను శత్రువును అయ్యాను అంటూ మంచు మనోజ్ మీడియా ముందే చెప్పుకొచ్చాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలి అంటూ మీడియాను కోరాడు ఆయన. ఇదంతా జరిగి కొన్ని రోజులైంది. ఇప్పుడంతా బాగానే ఉంది. అయితే తాజాగా మంచు వారసుల మధ్య మరోసారి పోరు తప్పేలా కనిపించడం లేదు.
ఈసారి పర్సనల్ కాదు ప్రొఫెషనల్..! ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి అని ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడని అందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం ప్రమోషనల్ పనుల్లో బిజీగా ఉన్నాడు విష్ణు. దీనికోసం హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబై అంటూ దేశమంతా తిరుగుతున్నాడు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది. సోలో రిలీజ్ డేట్ దొరికిందని చాలా రోజులుగా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు విష్ణు. దానికి తోడు సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉండడంతో కచ్చితంగా ఓపెనింగ్స్ భారీగా వస్తాయని ఆశిస్తున్నాడు. ఇలాంటి టైంలో మంచు మనోజ్ సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది అనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. ఈయన తాజాగా భైరవం అనే సినిమా చేస్తున్నాడు. నాంది, ఉగ్రం లాంటి సినిమాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దీనికి దర్శకుడు.
ఇందులో మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నిజానికి డిసెంబర్ లోనే విడుదల కావాలిసిన భైరవం అనుకోని కారణాలతో ఫిబ్రవరికి వాయిదా పడింది. అయితే అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దీన్ని సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ముందు మార్చి 14 అనుకున్న కూడా.. ఇప్పుడు ఏప్రిల్ 25 అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో చూడబోయే బిగ్గెస్ట్ క్లాష్ ఇదే అవుతుంది. ఎందుకంటే అదేరోజు మంచు విష్ణు కన్నప్ప కూడా విడుదలవుతుంది కాబట్టి. మామూలుగా అయితే మంచు బ్రదర్స్ నటిస్తున్న సినిమాలపై అంచనాల పెద్దగా ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నేపథ్యంలో.. ప్రొఫెషనల్ రైవల్రీ కూడా ఆసక్తికరంగా మారనుంది. ఒకవేళ ఇదే దూకుడు కంటిన్యూ చేసి ఇద్దరు ఒకరోజు వస్తే మాత్రం ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.