కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో.. దక్షిణాది సినిమాల హవానే కనిపించింది. కార్తికేయ-2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ 2.. ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1, ఉత్తమ నటిగా నిత్యా మీనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ అవార్డుల్లో సాయిపల్లవికి అన్యాయం చేశారంటూ... ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ హీరోయిన్‌కి రెండు సార్లు అన్యాయం జరిగిందంటూ... ఫ్యాన్స్ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్‌లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యమీనన్‌కు ఇద్దరికీ అవార్డులు ఇచ్చి... తమ హీరోయిన్‌కు అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం 2022 సినిమాలకు అవార్డులు ప్రకటించారు. ఆ ఏడాది నిత్యామీనన్‌తో పాటు.. సాయిపల్లవి కూడా గార్గి అనే అద్భుతమైన సినిమా చేసింది. అప్పట్లో ఈ మూవీ సౌత్‌ను ఓ ఊపు ఊపేసింది. తమిళ్, మలయాళం, తెలుగు.. అన్ని భాషల్లో ప్రేక్షకులను కదలించింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా సాయిపల్లవికి కచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని అంతా ఊహించారు. సాయిపల్లవి కూడా ఆశలు పెట్టుకుంది. ఐతే ఆమెకు అదృష్టం దక్కలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అవార్డులపై పెద్ద చర్చ పెట్టారు. ఈ స్థాయిలో సాయిపల్లవిపై చర్చ జరిగి ఉండేది కాదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఈసారి అవార్డుల్లో నిత్యామీనన్ తో పాటు.. మానసి పరేఖ్ అనే నటికి కూడా ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఇది సాయిపల్లవి అభిమానులకు మరింత కోపం తెప్పించింది. నేషనల్ అవార్డుల్లో మాత్రమే కాదు.. ఫిల్మ్‌ఫేర్‌లోనూ 2022లో సాయిపల్లవికి అన్యాయం జరిగిందన్నది అభిమానుల ఆవేదన. 2022లో శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాల్లో సాయిపల్లవి యాక్ట్ చేసింది. ఈ రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సెలక్ట్ అయ్యాయ్ కూడా ! ఐతే ఈ రెండింటికి కాదని.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఇలా ప్రతీసారి సాయిపల్లవికి అన్యాయమే జరుగుతోందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.