Pushpa 2: సుకుమార్ ఇంట్లో సోదాలతో కలకలం.. డైరెక్టర్‌ను ఐటీ టార్గెట్ చేసిందా ?
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయ్. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా .. పుష్ప2తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. ఐతే జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.
సుకుమార్ ఇంటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగాయ్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారు 7వందల కోట్ల రూపాయలు అనేక రూపాల్లో డబ్బు సమకూర్చుకొని జీఎస్టీ కట్టలేదనే ఆరోపణలు ఉన్నాయ్. దీంోత అటు డైరెక్టర్, ఇటు నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై సోదాలు నిర్వహించినట్లు టాక్. అధికారులు కీలక పత్రాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది.
సుకుమార్, మైత్రిమూవీ కాంబినేషన్‌లోనే పుష్ప2 తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్‌లోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు జరిగాయ్. డీఎస్టీ డిపార్ట్‌మెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు కొందరు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. జీఎస్టీ నిబంధనలను అతిక్రమించడం, తప్పుడు సమాచారంతో ఐటీ రిటర్న్ పెట్టడం వంటి ఆరోపణలతో గతంలో మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయ్.
మైత్రీ మూవీ మేకర్స్ ఆదాయ వనరులపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తాన్ని ఐటీ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన ఐటీ సోదాలు.. గత డిసెంబర్‌లో జరిగిన రైడ్స్‌కు కొనసాగింపు అని టాక్. మరి ఈ సోదాల్లో తప్పుడు లెక్కలు ఏమైనా అధికారులు గుర్తించారా.. లేదంటే అంతా సవ్యంగానే ఉందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
2015లో మొదలైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా.. పుష్ప ది రూల్ సినిమాను నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కూడా ప్రాజెక్టులు చేస్తోంది.