జాక్ రివ్యూ.. జాకీ పెట్టినా లేవదు.. సిద్ధూ ఇంకా టిల్లు మూడ్ లోనే ఉన్నాడా..?

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత సిద్ధూ నటించిన సినిమా ఇది. తన రూట్ మార్చుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు భాస్కర్. మరి ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది..? ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ విషయానికి వస్తే.. మన సిద్ధూ జొన్నలగడ్డకు చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అయిపోయి దేశాన్ని కాపాడాలని కలలు కంటుంటాడు. ఎందుకు అంటే తన చిన్నపుడు వాళ్లను అమ్మ టెర్రరిస్ట్ అటాక్‌లో చనిపోతుంది కాబట్టి.. దేశానికి ముందుండి కాపాడాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలోనే మనోడు రా ఇ:టర్వ్యూకు కూడా వెళ్తాడు కానీ రిజల్ట్ రాకముందే రంగంలోకి దిగిపోతాడు. మరోవైపు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని హైర్ చేసుకుంటాడు సిద్ధూ వాళ్ల నాన్న నరేష్. ఆ ఏజెన్సీ ఓనర్ కూతురు వైష్ణవి చైతన్య..! అప్పట్నుంచి సిద్దూను ఫాలో అవుతూ ఉంటుంది. ఈ సమయంలోనే ఇండియాపై టెర్రర్ అటాక్స్ ప్లాన్ చేస్తాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రాహుల్ దేవ్. మనోడు చనిపోయాడు అనుకుని రా డిపార్ట్‌మెంట్ నిశ్చింతగా ఉంటుంది. కానీ సిద్దూ వచ్చి వాడు బతికే ఉన్నాడని చెప్తాడు. మరోవైపు తన దగ్గర్నుంచి నలుగురు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు రాహుల్ దేవ్. వాళ్లను పట్టుకోడానికి వచ్చే రా ఆఫీసర్ ప్రకాశ్ రాజ్. అక్కడ్నుంచి కథ ఏం జరిగింది..? ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది స్క్రీన్ మీదే చూడాలి..
స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే.. కొన్ని సినిమాలు కేవలం క్యారెక్టరైజేషన్‌తోనే ఆడేస్తుంటాయి. మన డిజే టిల్లు, టిల్లు స్క్వేర్.. మొన్నొచ్చిన మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు అన్నమాట. ఇంకా చెప్పాలంటే బిజినెస్ మెన్ కూడా అలాంటి సినిమానే. కానీ అన్నిసార్లు అది వర్కవుట్ అవ్వదు కదా.. కొన్నిసార్లు కథ ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందులోనూ స్పై బ్యాక్‌డ్రాప్ తీసుకున్నపుడు కచ్చితంగా కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉండాల్సిందే. బాలీవుడ్‌లో బేబీ లాంటి సినిమాలు అలాగే ఆడాయి. మన సౌత్‌లోనూ తుపాకీ లాంటి సినిమాల్లో రా డిపార్ట్‌మెంట్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఏజెంట్ మాదిరి కామెడీ చేసిన సినిమాలు కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు సిద్ధూ కూడా జాక్ సినిమాలో ఇదే చేసాడు. ఒక టెర్రరిజం గ్రూప్.. ఇండియాపై అటాక్స్.. రా ఏజెంట్స్ వాళ్ళను అడ్డుకోవడం.. మహా అయితే ప్రతీ స్పై థ్రిల్లర్‌లోనూ మనకు కనిపించే కామన్ కథ అయితే ఇదే. కానీ దాన్నెలా స్క్రీన్ మీద చూపించాం అనేదే కదా స్క్రీన్ ప్లే. అందులో జాక్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. బేసిక్ కథ రాసుకున్న బొమ్మరిల్లు భాస్కర్.. అంతకంటే బేసిక్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తీసాడు. వాళ్లు రా ఏజెంట్సా లేదంటే అటు ఇటు పరిగెత్తే రన్నర్సా అనేది అర్థం కాలేదు కాసేపు. మరోవైపు జులాయిలో అల్లు అర్జున్ మాదిరి రా ఏజెంట్స్ వాళ్ల కంటే ముందే హీరో అన్నీ కనిపెట్టేస్తుంటాడు. అదేంట్రా అంటే ప్యాషన్, దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు. మినిమమ్ లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఉదాహారణకు తుపాకి సినిమా చాలా మంది చూసే ఉంటారు కదా.. అందులో టెర్రరిస్టులు అందరినీ ఒకేసారి కాల్చే సీన్ ఉంటుంది.. దాన్ని మురుగదాస్ ఎంత బాగా డిజైన్ చేసాడు. కానీ అలాంటి సీన్ ఒకటి జాక్‌లో ఉంటుంది.. అదేదో పిట్టల్ని కాల్చేసినట్లు చాలా కామెడీగా డిజైన్ చేసారు సీన్. అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. కమర్షియల్ రూట్‌లోకి వచ్చాననుకున్నాడు కానీ పరమ రొటీన్ సినిమా తీసాడు బొమ్మరిల్లు భాస్కర్. ఎంత డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాంటి స్క్రీన్ ప్లేతో జాక్ సినిమాను చూడలేం. అయినా కూడా అక్కడక్కడా తన ఎనర్జీతో సినిమాను కాపాడటానికి చాలా ట్రై చేసాడు సిద్ధూ.
నటీనటుల గురించి చెప్పాలంటే.. మన జాక్ బాబు.. అదే మన సిద్ధూ జొన్నలగడ్డ ఇంకా టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. కథ మారినా.. క్యారెక్టరైజేషన్ మాత్రం అక్కడే ఆగిపోయింది. అక్కడ జరుగుతున్నది రా ఏజెన్సీ కథ అయినా కూడా.. టెర్రరిస్టుల ముందుకెళ్లి సిచ్యువేషన్‌తో సంబంధం లేకుండా సింగిల్ లైనర్స్ వేసాడు సిద్ధూ. నటన పరంగా బాగానే చేసాడు కానీ అన్నిసార్లు టిల్లుగాడు వస్తానంటే కుదరదు కదా..? వన్ లైనర్స్ కూడా కొన్నిసార్లు పేలాయి.. కొన్నిసార్లు అస్సలు పేలలేదు. ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడితో కామెడీ చేయించాడు భాస్కర్ ఇందులో. వైష్ణవి చైతన్యకు మరో కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్ పడింది. సీనియర్ నరేష్‌ను పెద్దగా యూజ్ చేసుకోలేదు. రాహుల్ దేవ్, రాజేష్ ఖట్టర్, రవిప్రకాశ్, సుబ్బరాజు లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే.. జాక్ సినిమాకు సంగీతం కాస్త బెటర్‌గా ఉండాల్సింది. ముగ్గురు సంగీత దర్శకులు పని చేసారు కానీ పెద్దగా గుర్తుంచుకునే పాటలైతే ఇవ్వలేదు. ఒక్కటి కూడా మనకు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు గుర్తుండదు. బ్యాగ్రౌండ్ స్కోర్ వరకు మాత్రం పర్లేదు. ఎడిటర్ నవీన్ నూలీ తనకు తెలిసిన టెక్నిక్స్ అన్నీ వాడాడు సినిమాను కాపాడటానికి. కానీ సినిమాలో కథ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు.. ఎంతని కత్తెర వేస్తాడు చెప్పండి..? విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్‌గా ఉంది. బివిఎస్ఎన్ ప్రసాద్ కూడా కథకు తగ్గట్లు భారీగానే ఖర్చు పెట్టాడు. అది స్క్రీన్ మీద కనిపించింది కూడా. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం తనకు వచ్చిన అవకాశం అస్సలు వాడుకోలేదు. మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు.
చివరగా చెప్పాలంటే జాక్.. వీడు కొంచెం కాదు చాలా పెద్ద క్రాక్..!