జాక్ ట్రైలర్ రివ్యూ.. సిద్ధూ జొన్నలగడ్డ బూతులు.. వైష్ణవి చైతన్య లిప్ లాక్..!
డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మనోడి మార్కెట్ కూడా బాగానే పెరిగింది.

డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మనోడి మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఇందులో టిల్లు స్క్వేర్ ఏకంగా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో సిద్ధూ భాయ్ నెక్ట్స్ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈయన నటిస్తున్న జాక్ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇది చూసాక సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మనోడు చాలా సాఫ్ట్ డైరెక్టర్ అనుకుంటాం కానీ అప్పుడప్పుడూ ఈయనలోని క్రాక్ దర్శకుడు కూడా బయటికి వస్తుంటాడని జాక్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది.
అప్పట్లో ఒంగోలు గిత్త అంటూ పక్కా మాస్ సినిమా ఒకటి ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు భాస్కర్. కానీ మూడేళ్ళ కింద అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో పర్లేదనిపించాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇప్పుడు జాక్ అంటూ వస్తున్నాడీయన. SVCC బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ కోసమే సినిమా తీసారనే విషయం అర్థమవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కదా అని సాఫ్ట్ అనుకుంటే.. పప్పులో కాదు ఏకంగా సాంబార్‌లో మునిగిపోయినట్లే. ఎందుకంటే మనోడు పూర్తిగా సిద్ధూ స్టైల్‌లోకి వచ్చేసాడు. మరోవైపు సిద్ధూ కూడా అప్పుడప్పుడూ జాక్‌లో అలా టిల్లులా మారిపోయాడు. అంతేకాదు ట్రైలర్‌లో విచ్చలవిడిగా బూతులు మాట్లాడేసాడు సిద్ధూ భాయ్. ట్రైలర్ కాబట్టి ఎలాగూ సెన్సార్ ఉండదు.. అందుకే రెచ్చిపోయాడు. సినిమాలో మాత్రం కచ్చితంగా ఇవి మ్యూట్ అవ్వాల్సిందే.. మరోవైపు వైష్ణవి చైతన్యతో ముద్దు సీన్ కూడా ఉంది. ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద కథ చెప్తున్నారనే విషయం అర్థమవుతుంది.
టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌తో కూడిన లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రకాష్ రాజ్, సిద్దు మధ్య వచ్చే సీన్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. సీనియర్ నరేష్ కామెడీ, సిద్దు జొన్నలగడ్డ టైమింగ్, వైష్ణవి చైతన్య గ్లామర్ ఇవన్నీ సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. స్యామ్ సిఎం మ్యూజిక్ బాగానే ఉంది. జాక్ తన స్టైల్‌లో కాకుండా.. న్యూ ఏజ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమాలో సిద్ధూ రైటింగ్ కూడా కనిపిస్తుంది. పేరుకు భాస్కర్ దర్శకుడిగా కనిపిస్తున్నా.. వెనకాల ఘోస్ట్ రైటర్ కింద సిద్ధూ కూడా ఉన్నాడని డైలాగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మొత్తానికి ఇన్నాళ్లూ కాస్త సైలెంట్‌గా ఉన్న జాక్.. ట్రైలర్‌తో బాగానే సందడి చేస్తున్నాడు. మరి ఇవి కలెక్షన్స్ తీసుకొచ్చేందుకు పనికొస్తుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.