Kacha Badam Singer: కష్టాల్లో కచ్చా బాదం సింగర్.. చదువు రాదని మోసం చేశారు..!
నిజానికి ఆ కంపెనీ వాళ్లు సంతకం చేయించుకుంది సాంగ్ పాడించేందుకు కాదు.. భుబన్ బద్యాకర్ నుంచి సాంగ్‌ను కొనుక్కునేందుకు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భుబన్ బద్యాకర్ ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలు కూడా సామాన్యులను సెలబ్రెటీలను చేస్తాయి. ఇలాగే.. అప్పట్లో కచ్చా బాదం అంటూ సాంగ్ పాడిన భుబన్ బద్యాకర్ అనే పల్లీల వ్యాపారి ఫేమస్ అయ్యాడు. పాడైపోయిన సెల్‌ఫోన్లు, చైన్లు తీసుకుని.. వాటికి బదులుగా పచ్చి పల్లీలు ఇస్తూ చిరువ్యాపారం చేసేవాడు భుబన్ బద్యాకర్. కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు అప్పట్లో కచ్చా బాదం అంటూ ఓ పాట పాడాడు. ఆ పాటను ఓ నెటిజన్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లోనే ఉంది.
అయితే అగ్రిమెంట్ చదవకుండా సంతకం పెట్టిన కారణంగా భుబన్ కష్టాల్లో పడ్డాడట. తన పాటను తానే పాడుకోలేని పరిస్థితి వచ్చిందట. అప్పట్లో ఈ సాంగ్‌కు మంచి ఫేమ్ రావడంతో ఓ మ్యూజిక్ కంపెనీ భుబన్ బద్యాకర్‌ను కలిశారట. తమ కంపెనీలో సాంగ్ పాడాలంటూ 3 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారట. అయితే అగ్రిమెంట్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉండటంతో ఏమీ చదవకుండానే సంతకం చేశాడట భుబన్ బద్యాకర్.
ఇక్కడే తన కథ అడ్డం తిరిగింది. నిజానికి ఆ కంపెనీ వాళ్లు సంతకం చేయించుకుంది సాంగ్ పాడించేందుకు కాదు.. భుబన్ బద్యాకర్ నుంచి సాంగ్‌ను కొనుక్కునేందుకు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న భుబన్ బద్యాకర్ ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. తన పాట తాను పాడుకుందామన్నా.. కాపీ రైట్ సమస్య వస్తుందని బాధ పడుతున్నాడు.