కల్కి 2’ కథ లీక్.. కంగారులో చెప్పేసిన నాగ్ అశ్విన్.. సీక్వెల్ ఏం ప్లాన్ చేసాడ్రోయ్..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కి ఎంత ప్రత్యేకం అనేది చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 తర్వాత మరోసారి రెబల్ స్టార్‌ను 1000 కోట్ల సింహాసనంపై కూర్చోబెట్టిన సినిమా ఇది. అందుకే కల్కి అంటే వాళ్లకు ప్రాణం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 05:20 PMLast Updated on: Mar 19, 2025 | 5:20 PM

Kalki 2s Story Leaked Nag Ashwin Said In Kangaroo What Are You Planning For The Sequel

ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కి ఎంత ప్రత్యేకం అనేది చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 తర్వాత మరోసారి రెబల్ స్టార్‌ను 1000 కోట్ల సింహాసనంపై కూర్చోబెట్టిన సినిమా ఇది. అందుకే కల్కి అంటే వాళ్లకు ప్రాణం. కల్కి 2 కోసం కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీ కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. పైగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఎవరికి వాళ్లు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు.. మరోవైపు దీపికా పదుకొనే అమ్మ కాబోతుంది. ఇవన్నీ మళ్లీ సెట్ అవ్వాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఇదే విషయాన్ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చెప్పుకొచ్చాడు. కల్కి సినిమాను కేవలం ఒక్క సినిమాగా మాత్రమే కాదు.. దాన్ని ఓ సినిమాటిక్ యూనివర్స్‌గా తీసుకొస్తున్నాడు నాగీ. అందులో మొదటి భాగమే కల్కి.

ఇంకా ఇందులో చాలా భాగాలున్నాయని ఇప్పటికే చెప్పాడీయన. కల్కి 2 షూటింగ్ 2025, డిసెంబర్ తర్వాత మొదలు కావొచ్చన్నాడు నాగ్ అశ్విన్. తాజాగా ఈయన ఎవడే సుబ్రమణ్యం పదేళ్ల వేడుకలో కనిపించాడు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ముందు అనుకున్న ప్లాన్ అయితే.. కల్కి 2ను 2025 డిసెంబర్‌లో మొదలుపెట్టి.. 2026 డిసెంబర్ నాటికి విడుదల చేయాలని..! కానీ ఇప్పుడు ప్రభాస్ ఉన్న బిజీ చూస్తుంటే.. ఇది జరిగేలా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని చెప్పాడు నాగ్ అశ్విన్. డిసెంబర్ నుంచి షూట్ మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తాం కానీ అది అవ్వొచ్చిన మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్‌తో పాటు ఫౌజీ, స్పిరిట్ సినిమాలకు కమిటయ్యాడు. ఇవన్నీ పూర్తైన తర్వాతే కల్కి 2 సెట్స్‌పైకి వస్తుంది. ఆ తర్వాత సలార్ 2 కూడా సిద్ధంగా ఉంది. ఇక కల్కి 2 కథ గురించి చెప్తూ.. మొదటి భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపించినప్పటికీ.. సెకండ్ పార్ట్‌లో మాత్రం చాలా సేపు ఉంటుందని.. ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు నాగీ.

అంతేకాదు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. వీటన్నింటికంటే మరో మేజర్ అప్‌డేట్ ఒకటి చెప్పాడు నాగ్ అశ్విన్. కల్కి ఫస్ట్ పార్ట్ మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు పరిచయంతో అయిపోతుంది. కానీ కల్కి 2 మాత్రం పూర్తిగా కర్ణుడు, ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ పోషించిన భైరవ చుట్టూ తిరుగుతుందని కథ లీక్ చేసాడు నాగీ. మేజర్ కథ అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే ఉంటుందని.. వీళ్ళ మధ్యలో సుప్రీమ్ యస్కిన్‌తో పాటు అశ్వద్ధామ, అర్జునుడు ఎలా వస్తారనేది మేజర్ స్టోరీ అన్నాడు నాగ్ అశ్విన్. ఈ ప్లానింగ్ చూస్తుంటే ఈసారి 1000 కోట్లు కాదు.. ఏకంగా 2000 కోట్లకు టెండర్ పెట్టినట్లే అర్థమవుతుంది. అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.