కన్నప్ప ప్రీమియర్ కాదంట.. వాళ్లకు అసలు మ్యాటర్ అర్థదమైపోయిందా..?

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు విష్ణు. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మి దీనిపైనే పెట్టానని చాలా సార్లు చెప్పాడు ఈ హీరో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2025 | 12:10 PMLast Updated on: Apr 02, 2025 | 12:10 PM

Kannappa Is Not The Premier Have They Understood The Real Matter

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు విష్ణు. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మి దీనిపైనే పెట్టానని చాలా సార్లు చెప్పాడు ఈ హీరో. ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టానంటున్నాడు. వాళ్లు చెప్తున్నట్లు 150 కోట్లు అయితే ఖర్చు పెట్టలేదు కానీ కచ్చితంగా 50 కోట్ల వరకు అయితే బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ అది నిజమైనా కూడా మంచు విష్ణుపై అంత బడ్జెట్ అంటే శక్తికి మించిన భారమే. కానీ విష్ణు మాత్రం ఈ సినిమాపై చాలా కన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. తాజాగా కన్నప్ప సినిమాకు సంబంధించిన ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో సహా వీడియోలు బయటికి రావడం సంచలనంగా మారింది. అదేంటి.. ఏప్రిల్ 25 నుంచి సినిమా వాయిదా వేసిన తర్వాత ప్రీమియర్ వేసుకోవడం ఏంటబ్బా అంటూ చాలా మంది ఆరా తీసారు. అయితే అది ప్రీమియర్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది టీం.

అసలు సినిమా ఎలా వచ్చిందో చూసుకోడానికి.. కేవలం పావు గంట ఫుటేజ్ బిగ్ స్క్రీన్ మీద వేసుకుని చూసుకున్నారు చిత్రయూనిట్. దీనికోసం ప్రసాద్ ల్యాబ్స్‌ను ఎంచుకున్నారు. మోహన్ బాబు, విష్ణుతో పాటు మరికొందరు ఈ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు మిగిలిపోయి ఉంది. పైగా డబ్బింగులు కూడా చెప్పలేదు. ఇవన్నీ ఇలాగే పెట్టుకుని అప్పుడే ప్రీమియర్ చూడటం అనేది సాధ్యం కాని పని. పైగా ఫైనల్ కాపీ రెడీ అవ్వడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. అందుకే కేవలం 15 నిమిషాల సినిమా వేసుకున్నారంతే. ఇది చూసిన తర్వాత జెన్యూన్ రివ్యూస్ తీసుకుని.. మార్చాల్సిన కంటెంట్ ఏమైనా ఉంటే మార్చాలని చూస్తున్నారు. పాజిటివ్స్ పక్కనబెట్టి ముందు సినిమాలో ఉన్న నెగిటివ్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు కన్నప్ప టీం. ఎందుకంటే కంటెంట్ విడుదలవుతున్న కొద్దీ ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మంచు విష్ణు అండ్ టీం.

ఇప్పటికిప్పుడు అర్జంట్‌గా సినిమా విడుదల చేసి చేతులు కాల్చుకునే కంటే.. కావాల్సినంత టైమ్ తీసుకుని మంచి డేట్ చూసుకుని సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు విష్ణు. అందుకే ప్రస్తుతం పని చేస్తున్న గ్రాఫిక్స్ కంపెనీలకు కూడా టెన్షన్ వద్దు అని హామీ ఇచ్చాడు మంచు విష్ణు. ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాపీ చూసుకుని.. అంతా ఓకే అన్న తర్వాతే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు విష్ణు. అంతేకాదు కన్నప్ప సినిమాకు ఇంకా బిజినెస్ జరగలేదు.. ప్రీ రిలీజ్ బిజినెస్ పక్కనబెడితే ఓటిటి కూడా ఇంకా పూర్తి కాలేదు. ట్రైలర్ వచ్చాక డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో విష్ణు తొందర పడట్లేదు. కొన్ని ఓటిటి సంస్థల నుంచి డీల్స్ వచ్చినా కూడా ప్రస్తుతానికి వద్దనుకుని తర్వాత చెప్తాం అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే విష్ణుకు సినిమాపై ఎంత నమ్మకం ఉందనేది అర్థమవుతుంది. మొత్తానికి ప్రీమియర్ షో ఇంకా పడలేదు.. కావాల్సినంత టైమ్ తీసుకుని మెల్లగా వద్దామని ఫిక్సైపోయారు కన్నప్ప టీం.