సినిమా వాళ్లైనా చిల్లర పంచాయితీలేనా…? ఛీ కొడుతున్న సమాజం
ఆస్తులు, డబ్బు తగాదాలు ఏ కుటుంబంలో అయినా సర్వసాధారణంగా జరిగేవే. ఈ విషయాలను ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటారు అనే దానిపైన ఆ సమస్యల పరిష్కారం అనేది ఆధారపడి ఉంటుంది. ఆవేశాలను అదుపు చేసుకుని ఆలోచనతో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ఆస్తులు, డబ్బు తగాదాలు ఏ కుటుంబంలో అయినా సర్వసాధారణంగా జరిగేవే. ఈ విషయాలను ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటారు అనే దానిపైన ఆ సమస్యల పరిష్కారం అనేది ఆధారపడి ఉంటుంది. ఆవేశాలను అదుపు చేసుకుని ఆలోచనతో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా బజారుకెక్కితే అది ఖచ్చితంగా సమాజంలో చెడు సంకేతాలను పంపిస్తుంది. గత రెండు మూడు రోజుల నుంచి మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తున్న సాధారణ ప్రజలు ఇప్పుడు సినిమా పరిశ్రమను చాలా చులకనగా చూస్తున్నారు.
ప్రతి ఇంట్లో ఉండే ఆస్థి తగాదాలు సినిమా పరిశ్రమలో ఉండవు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. సినిమా వాళ్లు సమాజానికి ఆదర్శంగా డైలాగులు చెప్తారు… కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉండవనే అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలను చూస్తున్న సాధారణ ప్రజలు ఆస్తుల కోసం ఎవరైనా ఎంతవరకైనా తెగిస్తారు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. సినిమా వాళ్ళు సినిమాల్లో డైలాగులు చెప్పటం మాత్రమే అని నిజ జీవితంలో వాటిని అనుసరించే అవకాశం లేదనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో కూడా నెలకొంది.
మోహన్ బాబు మంగళవారం సాయంత్రం మీడియాపై వేసిన చిందులు చూసిన చాలా మంది అసలు ఆయన మోహన్ బాబేనా… అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. ఇక సినిమాలలో హీరోలుగా చేసిన అతని ఇద్దరు కొడుకులు చూసి కూడా ప్రజలు షాక్ అవుతున్నారు. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మంచు మనోజ్ అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అతను కూడా రోడ్డు మీదకు రావడం చూసి అతనిపై పాజిటివ్ అభిప్రాయం కలిగిన వారు కూడా తీసి పడేస్తున్నారు.
సమాజ పరిస్థితులను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్న మోహన్ బాబు… తన ఇద్దరు కొడుకులను కనీసం అదుపు చేయలేకపోయారని… ఆ సమస్యను నాలుగు గోడల మధ్య లేదంటే, పెద్ద మనుషుల మధ్య పెట్టి పరిష్కరించుకోలేక ఇలా మీడియా ముందుకు వచ్చి కుటుంబ పరువునే కాదు సినిమా పరిశ్రమ ఖ్యాతిని కూడా పలచన చేశారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మోహన్ బాబు తాను విడుదల చేసిన ఆడియోలో అలాగే మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులపై నేపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు.
మీడియా కావాలనే తమ కుటుంబ సమస్యను పెద్దగా చేసి చూపిస్తుందంటూ మాట్లాడారు. తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. చివరికి మీడియా తప్పుగా రాస్తుందంటూ ఫైరయ్యారు. తన కొడుకు తనపై దాడి చేశారని చెప్పింది కూడా మోహన్ బాబే. చివరకు తన కొడుకు తనపై దాడి చేయలేదు అంటూ విడుదల చేసిన ఆడియోలో చెప్పడం చూసి మీడియా కూడా షాక్ అయింది. ఏది ఎలా ఉన్నా మోహన్ బాబు కుటుంబం కారణంగా ఇప్పుడు సినిమా పరువు మొత్తం పోయిందని, ఇతర భాషల్లో కూడా తెలుగు సినిమా చులకన అయిందంటూ… పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వ్యక్తం చేస్తున్నారు.