ధనుష్ దేవుడు చూస్తున్నాడు, ఇంత నీచుడువి అనుకోలేదు, నయనతార బహిరంగ లేఖ

తనకు లీగల్ నోటీసులు పంపడం పట్ల హీరో ధనుష్ పై నయనతార ఫైర్ అయ్యారు. ఈ మేరకు ధనుష్ కు మూడు పేజీల బహిరంగ లేఖ రాసి సంచలన వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2024 | 02:20 PMLast Updated on: Nov 16, 2024 | 2:20 PM

Nayanathara Letter To Danush

“ప్రియమైన మిస్టర్ ధనుష్ కె రాజా,

S/o కస్తూరి రాజా, B/o సెల్వరాఘవన్

ఎన్నో అపోహలను సరిదిద్దడానికి మీకు రాస్తున్న బహిరంగ లేఖ.

మీలాంటి సెటిల్ అయిన మంచి నటుడు, మీ నాన్నగారి సపోర్ట్ మరియు ఆశీర్వాదంతో, ఏస్ డైరెక్టర్ అయిన మీ సోదరుడు, ఇది చదివి అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలిసినట్లుగా సినిమా అనేది నాలాంటి వ్యక్తులకు మనుగడ కోసం పోరాటం. పరిశ్రమలో ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో నేను ఈ రోజు ఉన్న స్థానాన్ని అందుకోవడానికి నా మార్గంలో నేను చాలా పోరాడాల్సి వచ్చింది. ఈ విషయంలో నా కష్టానికి, పనికి, నా నీతి నిజాయితీకి ఎంతో రుణపడి ఉంటాను. నా గురించి తెలిసిన వారికి ఇది రహస్యం కాదు. ముఖ్యంగా ప్రేక్షకులు మరియు నాపై ఆదరాభిమానాలు చూపించే సినీ సోదరులకు.

నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కోసం నేను మాత్రమే కాకుండా నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. మాకు ఎదురైన అన్ని ఇబ్బందులను అధిగమించడానికి, సహకారం అందించిన వారికి, సినిమా స్నేహితులు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం. మీరు నా సినిమాలపై…. నా భర్తపై… నాపై పెంచుకున్న ప్రతీకారం కేవలం మాపై మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేసి, తమ సమయాన్ని వెచ్చించిన వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. నేను, నా జీవితం, నా ప్రేమ, మరియు వివాహం గురించి ఈ NetFlix డాక్యుమెంటరీలో సినిమా పరిశ్రమలో శ్రేయోభిలాషులు, దయతో సహకరించిన చాలా మందికి సంబంధించిన క్లిప్ లు, అనేక సినిమాల నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.

కానీ పాపం నానుమ్ రౌడీ ధాన్ అనే అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన సినిమా ఇందులో లేదు. రెండు సంవత్సరాల పాటు NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం మీతో పోరాడిన తర్వాత, మా NetFlix డాక్యుమెంటరీ విడుదల కోసం మీ అనుమతి కోసం… వేచి చూసిన తర్వాత, మీరు అనుమతి నిరాకరించడంతో మేము చివరకు వదులుకోవాలని, డాక్యుమెంటరినీ మళ్ళీ రీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నానుమ్ రౌడీ ధాన్ పాటలు లేదా విజువల్ కట్‌లను వాడుకోవడానికి ఎన్నో సార్లు అడిగినా… వినియోగించింది చాలా తక్కువ మాత్రమే.

నానుమ్ రౌడీ ధాన్ పాటలు ఇప్పటి వరకు ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. మంచి సాహిత్యం, ఎమోషన్స్ నుంచి వచ్చిన పాటలు అవి. మా డాక్యుమెంటరీలో మేము ఉపయోగించడానికి మంచి మ్యూజిక్ లేదు. ఆ పాటలను ఉపయోగించుకునే అవకాశం మాకు ఇవ్వడానికి మీరు నిరాకరించారు. సాహిత్యం కూడా డాక్యుమెంటరిలో వాడుకోవడానికి అభ్యంతరం తెలపడంతో నా గుండె పగిలింది.

మీ నిర్ణయం వెనుక కారణాలు… వ్యాపార లేదంటే ఆర్ధిక సమస్యలు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయం మాపై మీ వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మాత్రమేనని మరియు మీరు ఉద్దేశపూర్వకంగానే చేసిందే అని అర్ధం కావడం బాధగా ఉంది.

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైన తర్వాత మీరు చట్టపరమైన నోటీసులు పంపడం మరింత షాకింగ్ విషయం. మా వ్యక్తిగత గ్యాడ్జేట్స్ లో షూట్ చేసిన కొన్ని వీడియోలు కేవలం 3 సెకన్లు వాడడాన్ని మీరు ప్రశ్నించిన విధానం చూసి, వాడిన పదాలు చూసి మేము ఆశ్చర్యపోయాము. అది కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పబ్లిక్‌గా ఉన్న BTS విజువల్స్ మాత్రమే. వాటి నష్టపరిహారం రూ.10 కోట్లు మీరు క్లెయిమ్ చేసారు. ఇది మీ స్థాయికి తక్కువ మొత్తమే అయినా… మీ వ్యక్తిత్వం గురించి స్పష్టంగా చెప్తుంది.

మీ అమాయక అభిమానుల సమక్షంలో నిర్వహించే ఆడియో లాంచ్‌ వేదికలపై మీరు కేవలం నటిస్తారు అనేది అర్ధమైంది. కానీ స్పష్టంగా చెప్పాలంటే మీరు చెప్పే మాటలను పాటించరు. ఇది కేవలం మా ఇద్దరి విషయంలో మాత్రమే కాదు. సెట్‌లోని వ్యక్తులందరి జీవితాలను, స్వేచ్ఛను నియంత్రించే నిర్మాత చక్రవర్తి అవుతాడా? చక్రవర్తి చట్టాలను శాసిస్తాడా…? నేను మీ చట్టపరమైన నోటీసును అందుకుంటున్నాను. మేము చట్టబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే తగిన విధంగా రెస్పాండ్ అవుతాము. మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నానుమ్ రౌడీ ధాన్ ఎలిమెంట్‌లను ఉపయోగించేందుకు మీరు NOC ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణం నుంచి మీరు న్యాయస్థానాల ముందు సమర్ధించుకోవచ్చు. అయితే దీనికి నైతిక కోణం ఉందని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దానిని మనం సమర్ధించాలి. దేవుడే న్యాయ నిర్ణేత.

సినిమా విడుదలై దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ప్రపంచం ముందు ముసుగు వేసుకుని ఎవరైనా ఇంత నీచంగా చాలా కాలం పాటు కొనసాగడం చాలా కష్టం. నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్‌ లో ఒకటిగా నిలిచిన సినిమా గురించి, నేటికీ అందరూ ఇష్టపడే సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలన్నీ నేను మర్చిపోలేదు. విడుదలకు ముందు మీరు చెప్పిన మాటలు మాకు ఇప్పటికే మానిపోని గాయాలుగానే మిగిల్చాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీ ఇగో బాగా దెబ్బ తిన్నదని ఫిల్మ్ సర్కిల్స్ ద్వారా తెలుసుకున్నాను. ఈ చిత్రం 2016 ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకున్నప్పుడు… అవార్డు ఫంక్షన్ లో ఈ విజయంపై మీ అసంతృప్తి సామాన్యులకు కూడా కనిపిస్తుంది.

వ్యాపార పోటీని పక్కన పెడితే, ప్రజా జీవితంలో ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా ఇతరుల వ్యక్తిగత జీవితాలను తారుమారు చేయరని నేను నమ్ముతున్నాను. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం వంటి విషయాలలో పెద్దలు మనస్పూర్తిగా ఉండటం అనేది తప్పనిసరి. తమిళనాడు ప్రజలు, లేదా సరైన మనస్సాక్షి ఉన్న ఎవరైనా ఇలాంటి దౌర్జన్యాన్ని సమర్ధించరు అని నేను నమ్ముతున్నాను, అది కూడా మీలాంటి గొప్ప వ్యక్తి గురించి వచ్చినా సరే.

ఈ లేఖ ద్వారా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. గతంలో విజయం సాధించిన వ్యక్తులను చూసి మీ మనసులో శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ప్రపంచం అనేది ఒక పెద్ద ప్రదేశం, ఇది అందరి కోసం ఉంటుంది. మీకు తెలిసిన వ్యక్తులు మాత్రమే జీవితంలో పైకి రావాలి అనుకోవడం సరైంది కాదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇవి చేస్తే ఓకే. కొంతమంది సంబంధాలు పెట్టుకుని సంతోషంగా ఉంటే ఫర్వాలేదు. కాని ఇది మీ జీవితంలో ఒక మరక.

ఇది ప్రజల ఆశీర్వాదం, ప్రజలకు ఇది ఒక సినిమా మాత్రమే. మీరు కొన్ని నకిలీ కథనాలను తయారు చేసి… పంచ్ లైన్లతో ప్యాక్ చేసి, మీ తర్వాతి ఆడియో లాంచ్‌లో కూడా మాట్లాడవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. నేను మీ గురించి… జర్మన్ పదాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను, “schadenfreude” (స్కాడెన్‌ఫ్రూడ్). మీరు ఇకపై మాతోనే కాదు… ఎవరి భాగ్వోద్వేగాలతో ఆడుకోకుండా ఉండాలి. నిజంగా, ఈ ప్రపంచంలో మనుషులను తక్కువగా చూడటం చాలా సులభం. ఇతరుల ఆనందాలలో కూడా ఆనందం ఉంది. ఇతరుల ఆనందాన్ని చూడటంలో ఆనందం ఉంటుంది. మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వెనుక అదే కారణం. మీరు కూడా దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. బహుశా అది మీ మనసు మారుస్తుంది అనుకుంటున్నాను. ప్రేమను పంచడం చాలా ముఖ్యం. ఏదో ఒక రోజు మీరు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను, ప్రార్ధిస్తున్నాను.

ఓం నమః శివాయ