Rakesh Master: చనిపోయినా రాకేశ్ మాస్టర్‌కు అవమానమే మిగిలిందా ?
రాకేశ్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీ.. ముఖ్యంగా డ్యాన్సర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయ్. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్లు అంతా.. ఒకప్పుడు ఆయన శిష్యులే కావడం.. వాళ్లంతా రాకేశ్ మాస్టర్‌ను కడసారి చూసేందుకు రావడం.. తెలియకుండానే మనసు పట్టినట్లు అవుతోంది ఇవన్నీ చూస్తుంటే.
కొద్దిరోజులుగా రక్త విరేచనాలతో బాధపడుతున్న రాకేశ్ మాస్టర్.. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. రాకేశ్ మాస్టర్ మరణానికి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐతే రాకేష్ మాస్టర్ చనిపోయినా.. సినీ పరిశ్రమనుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం.. కొత్త చర్చకు కారణం అయింది. ఒక్క సినీ ప్రముఖుడు కూడా రాకేష్ మాస్టర్ మరణంపై సంతాపం తెలపలేదు.
బతికున్నపుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. చాలా అవమానించారని.. చివరికి చనిపోయాక కూడా పట్టించుకోరా.. ఇంతలా అవమానించాలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా పగ సాధిస్తున్నారని మండిపడుతున్నారు. తన ముక్కు సూటితనంతో ఇండస్ట్రీకి రాకేష్ మాస్టర్ దూరం అయ్యారు. కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయన తన డ్యాన్స్ స్కూల్ ద్వారా జీవనం సాగిస్తున్నారు.
ఒకప్పుడు కాస్ట్‌లీ కార్లలో తిరిగిన ఆయన అద్దెంట్లో బతికే స్థితికి చేరుకున్నారు. యూట్యూబ్‌లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రక్తవాంతులు అయ్యి చనిపోయే స్థితిలోకి వెళ్లినా.. అనాథలా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినా.. ఇండస్ట్రీలో ఒక్కరి మనసు కూడా కదలలేదా.. మోసేవాడికే ఇండస్ట్రీలో వ్యాల్యూ ఉంటుందా.. మనిషికి విలువ ఉండదా.. ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.