ఎన్టీఆర్ ఏంటి స్వామి ఇలా ఉన్నాడు..? షేక్ అవుతున్న సోషల్ మీడియా..
ఒకప్పుడు తెలుగు సినిమాలకు మార్కెట్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే.. అది దాటితే మన సినిమాలను ఎవరూ చూసేవాళ్లు కూడా కాదు.

ఒకప్పుడు తెలుగు సినిమాలకు మార్కెట్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే.. అది దాటితే మన సినిమాలను ఎవరూ చూసేవాళ్లు కూడా కాదు. అంతెందుకు తమిళ సినిమాలను మనం అంతగా నెత్తిన పెట్టుకుంటాం కానీ అరవోళ్లు మాత్రం మన సినిమాలను అస్సలు చూడరు. కానీ మెల్లగా ఈ పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఈ రోజు టాలీవుడ్‌కు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే.. ఓవర్సీస్ బోనస్. అక్కడ్నుంచి కూడా అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఒకప్పుడు 10 కోట్లు, 20 కోట్లు వస్తే గొప్ప అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ఓవర్సీస్ నుంచే మన భారీ సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి. బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప 2 లాంటి సినిమాలు ఓవర్సీస్ నుంచే 150 కోట్లకు పైగా వసూలు చేసి చూపించాయి. ఇప్పుడు చాప కింద నీరులా మన తెలుగు సినిమాకు ఓవర్సీస్‌కు తోడు జపాన్ మార్కెట్ కూడా తోడైంది. తెలియకుండానే తెలుగు సినిమాకు జపాన్ సెకండ్ హోమ్ అవుతుంది. అందుకే మన హీరోలు కూడా జపాన్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నారు.
బాహుబలి, సలార్ లాంటి సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే అక్కడ మంచి స్టార్ అయిపోయాడు. ఈయన కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ జపనీయులకు బాగా చేరువయ్యాడు. అక్కడ తారక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ట్రిపుల్ ఆర్‌తో జపాన్‌లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది జూనియర్‌కు. దానికంటే ముందే టెంపర్, బాద్షా లాంటి సినిమాలు జపాన్‌లో విడుదలయ్యాయి. ఇక ట్రిపుల్ ఆర్ 30 ఏళ్ళుగా ముత్తు పేరు మీదున్న రికార్డులను సైతం కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా హెల్ప్ అయింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ తాజాగా దేవర సినిమాను జపాన్‌లో భారీగా విడుదల చేస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లాడు ఎన్టీఆర్. అక్కడి మీడియాతో కలవడమే కాదు.. అభిమానులను కూడా కలుసుకుంటున్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా డాన్సులు కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయిప్పుడు.
అన్నింటికీ మించి ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ట్రెండ్ అవుతుందిప్పుడు. రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలన్నట్లు.. జపాన్‌లో ఉన్నపుడు వాళ్ల స్టైల్‌నే ఫాలో అవుతున్నాడు తారక్. అసలు ఎన్టీఆర్ న్యూ లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంట్రా బాబూ ఇంత బాగున్నాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా గంగిరెడ్డి ఎట్టున్నాడు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. దేవర జపాన్‌లో వర్కవుట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడీయన. ఆయనతో పాటు కొరటాల కూడా అక్కడే ఉన్నాడు. వారం రోజుల పాటు జపాన్ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసారు దేవర టీం. మొత్తానికి దేవర జపాన్‌లో ఆడుతుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/jrntr/?hl=en