Hollywood: హాలీవుడ్‌లో సమ్మె సైరన్..15 ఏళ్ల తర్వాత ప్రొడక్షన్ బంద్..ఇక బొమ్మ పడదా ?

నెట్‌ఫ్లిక్స్‌లో మీరు చూస్తున్న వెబ్ సిరీస్ ఆగిపోవచ్చు.. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావాల్సిన కొత్త సినిమాకు బ్రేక్ పడొచ్చు.. HBOలో యాక్షన్ మూవీ సిరీస్‌ ప్రసారం కాకపోవచ్చు.. ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఆగిపోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్‌లో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈ యూనియన్ పరిధిలో ఉన్న 11500 మంది స్క్రీన్ రైటర్స్ విధులు బహిష్కరించారు. దీంతో సినిమా, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన స్క్రిప్టింగ్ వర్క్ మొత్తం నిలిచిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2023 | 08:45 PMLast Updated on: May 02, 2023 | 8:45 PM

Ott Platform Movies And Entertainment Will Stop

ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ద్వారా లాభాలు ఆర్జిస్తున్న మూవీ , టీవీ సంస్థలు తమకిచ్చే పారితోషకాలను మాత్రం పెంచడం లేదని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా ఆరోపిస్తోంది. డిస్నీ, పారామౌంట్, నెట్‌ఫ్లిక్స్, అమెజనా, యాపిల్ వంటి సంస్థల తీరుకు నిరసనగా సమ్మెకు దిగాయి.

సమ్మె చేసేంత పరిస్థితులు ఎందుకొచ్చాయి ?

అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే చాలా పెద్దది. హాలీవుడ్ సినిమాలకు, టీవీ షోలకు, వెబ్‌సీరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే చాలా కాలంగా హాలీవుడ్ రైటర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం.. 40 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నా..మాంద్యం పరిస్థితులు వెంటాడుతున్నా తమకిచ్చే వేతనాల్లో ఎలాంటి మార్పు లేకపోవడంపై రచయితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా ప్రొడక్షన్ కంటే..వీళ్ల ఆగ్రహం మొత్తం.. టీవీ, ఓటీటీలపైనే ఉంది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ వంటి OTT ప్లాట్‌ఫామ్స్ లో హాలీవుడ్ కంటెంట్ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత రైటర్స్ కష్టాలు పెరిగిపోయాయి. రైటర్స్ ‌తో కేవలం తక్కువ సమయం కోసమే ఒప్పందం చేసుకోవడంతో వాళ్లకు పూర్తి స్థాయిలో ఉపాధి లేకుండా పోయింది.

ప్రస్తుతం వేలమంది అమెరికన్ రైటర్స్.. అతి తక్కువ వేతనాలకే స్క్రిప్ట్ అందిస్తున్నారు. కానీ OTT సంస్థలు మాత్రం భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో తమకు కనీస గౌరవం లేకుండా పోయిందని అమెరికన్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్క్రిప్ట్ రైటింగ్‌కు కేవలం ఫ్రీలాన్స్ జాబ్స్ గా స్టూడియోలు చూస్తున్నాయని రైటర్స్ విమర్శిస్తున్నారు. మరోవైపు స్ట్రీమింగ్‌ షోస్ కోసం ఇచ్చే వేతనాల విషయంలోనూ రచయితలు సంతృప్తిగా లేరు. రచయితలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను రీయూజ్ చేసిన ప్రతిసారి వారికి కొంత ఆదాయం వస్తూ ఉంటుంది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతుంది. అయితే స్ట్రీమింగ్ రైటర్స్‌కు వేతనాన్ని ముందే ఫిక్స్ చేసేస్తున్నారు. దానికి మించి ఒక్క డాలర్ ‌కూడా ఇవ్వడం లేదు.

రైటర్స్‌ను ముంచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

కృత్రిమ మేథస్సుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..వాటికి మించిన విపరిణామాలు కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైటర్స్ ‌తో సంబంధం లేకుండానే స్క్రిప్ట్స్ జనరేట్ చేయవచ్చు. కొన్ని సంస్థలను హ్యూమన్ రీసోర్స్‌ను ఉపయోగించుకోకుండా AIపై ఆధారపడుతూ రైటర్స్ పొట్టగొడుతున్నాయి. తమ ఉద్యోగాలకు పొగ పెడుతున్న చాట్ జీపీటీ వంటి సర్వీసులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్న వారిలో ఇప్పుడు హాలీవుడ్ రైటర్స్ కూడా చేరారు. సాహిత్యానికి సంబంధించిన మెటీరియల్‌ను రాసేందుకు, రీ రైట్ చేసేందుకు AIని ఉపయోగించవద్దని హాలీవుడ్ రైటర్స్ డిమాండ్ చేస్తున్నారు.

స్టూడియోలు, OTTల వాదనేంటి ?

మోషన్ పిక్సర్చ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ సమాఖ్య రైటర్స్ వాదనను ఖండిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌లో స్ట్రీమింగ్ కంటెంట్ పెరగడం వల్ల రచయితలకు గతంలో ఎప్పుడూ లేనంత వేతనాలు అందుతున్నాయని చెబుతోంది. 2021లో అత్యధికంగా రైటర్స్ కు 494 మిలియన్ డాలర్లు చెల్లించినట్టు లెక్కలు తీస్తోంది. ఇప్పటికీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటోంది.

హాలీవుడ్‌పై సమ్మె ప్రభావం ఎంత ?

కేవలం రచయితలు మాత్రమే సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం పెద్దగా ఉండదని అనుకోవడానికి వీలులేదు. 2007లో హాలీవుడ్ రచయితలు 100 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీకి 200 కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. గతంలో పోల్చితే ఈసారి రైటర్స్ మేజర్ న్యూస్ ప్రొడక్షన్ స్టూడియోలతో ఢీ కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న కంటెంట్ మొత్తం ఆగిపోయే ప్రమాదముంది. సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ఆ ప్రభావం నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ వంటి OTT సంస్థల ఆదాయాన్ని కూడా దెబ్బతీయవచ్చు. 2007 పరిస్థితులు పునరావడం కాకుండా చూడాలని హాలీవుడ్ ఇండస్ట్రీ కోరుకుంటోంది. అయితే రైటర్స్ గిల్డ్ కు ఇతర సంఘాల నుంచి కూడా మద్దతు రావడంతో సమ్మె ఎక్కువ రోజులు కొనసాగే ప్రమాదముందని ప్రొడక్షన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త కంటెంట్ ప్రొడక్షన్ ఆగిపోతే మాత్రం హాలీవుడ్ ఇండస్ట్రీకి ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుంది.