Megastar Chiranjeevi : పద్మశ్రీలు.. పద్మవిభూషణలు సరే? చిరంజీవిలో నటుడు ఎక్కడ?

హీరో చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్ (Padmavibhushan) రావడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. హీరోగా, సామాజిక స్పృహ.. సేవ తత్పరత ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించి కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. అవార్డులు చిరంజీవికి కొత్త కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 08:43 AMLast Updated on: Feb 02, 2024 | 8:43 AM

Padma Shri Padmavibhushan Ok Where Is Chiranjeevi Actor

హీరో చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్ (Padmavibhushan) రావడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. హీరోగా, సామాజిక స్పృహ.. సేవ తత్పరత ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించి కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. అవార్డులు చిరంజీవికి కొత్త కాదు. ఇంతకుముందే పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా అందుకున్నారు చిరంజీవి. అయితే ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే… చిరంజీవి లో నటుడు ఎప్పుడో ఆగిపోయాడు. ఇప్పుడు చిరులో మిగిలింది కేవలం స్టార్ హీరో మాత్రమే. పద్మశ్రీలు, పద్మ విభూషణలు… ఇతరత్రా అవార్డులు చిరంజీవికి ఎందుకు ఇస్తున్నారు. ఏం చూసి ఇస్తున్నారో, అర్థం కావడం లేదు. బ్లడ్ బ్యాంకు పెట్టి తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఆయనకు అవార్డు ఇస్తే అందరూ సంతోషించవచ్చు. నటుడిగా మాత్రం చిరంజీవికి పద్మ విభూషణ్ శుద్ధ దండగ. ఢిల్లీ స్థాయిలో ఉన్న సత్సంబంధాలు వల్లే చిరంజీవికి ఈ అవార్డులు, పిలుపులు తప్ప నటుడిగా ఇరవై యేళ్లలో పొడిచింది ఏమీ లేదు. 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఆరోగ్యంగా కొనసాగడం, ఒక లాంగ్ జర్నీ చేయడం వల్ల పద్మ విభూషణ్ ఇచ్చినట్లు ఉంది. ఈ మాట చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవరికీ ధైర్యం లేకపోయి ఉండొచ్చు. కానీ ఇది వాస్తవం.

చిరంజీవి అనగానే ఒక గొప్ప నటన… వెంటనే గుర్తొచ్చే పాత్ర ఏమైనా ఉన్నాయా? తెలుగు వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే చిరస్మరణీయ పాత్ర ఏమైనా చిరంజీవి ఒక్కటైనా వేశారా? చిరంజీవి తప్ప ఈరోజు మనకు ఎవ్వరూ చేయలేరు అనే నటన , పాత్ర ఆయన జీవితంలో ఒక్కటైనా ఉందా? ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, ఏఎన్ఆర్ దేవదాసు, కృష్ణ అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraj) లాంటి ఒక ల్యాండ్ మార్క్ పాత్ర చిరంజీవి ఇప్పటి వరకు చేయలేదు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి ఆయన నటన ప్రారంభించిన తర్వాత వచ్చిన నాలుగైదు సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ హిట్టు లేదు… గుర్తుపెట్టుకునే పాత్రలు లేవు. కేవలం చిరంజీవి వ్యక్తిత్వం, అందరితోనూ మంచిగా ఉండే ఆయన ప్రవర్తన, విపరీతమైన ప్రజా సంబంధాలు చిరంజీవికి అవార్డులు తెచ్చిపెడుతున్నాయే తప్ప ఒక గొప్ప నటుడిగా అవార్డులు అందుకునే స్థాయిలో ఆయన లేరు. ఇప్పటికీ చిరంజీవి ఇమేజ్ చట్రంలోనే ఇరుక్కుపోయారు. డాన్సులు స్టెప్పులు, ఫైట్లు, హీరోయిన్ల ముందు వెకిలి చేష్టలు, తప్ప గడచిన 20 ఏళ్లలో చిరంజీవి అద్భుతంగా నటించిన ఒక పాత్ర గాని, సినిమా గాని లేదు. విభిన్నమైన పాత్ర ఒకటీ లేదు.

కమలహాసన్(Kamala Haasan), అమితాబచ్చన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, చియాన్ విక్రమ్ లాంటి వాళ్ళు కమర్షియల్ సినిమాలు చేస్తూనే తమలో నటుడిని ఎక్కడో చోట ఎస్టాబ్లిష్ చేస్తూ విభిన్న పాత్రలు వేస్తున్నారు. 60లు దాటిన తర్వాత కూడా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. చిన్న, పెద్ద సినిమా అని చూడకుండా… పాత్రను దృష్టిలో పెట్టుకొని రాణిస్తున్నారు. కానీ చిరంజీవి జుట్టు నల్లబడకుండా… గడ్డం నెరవకుండా.. ఇప్పటికీ 67 ఏళ్ల వయసులో డాన్సులు, స్టెప్పులు హీరోయిన్లతో చిల్లర కామెడీలు, సినిమా చివర్లో ఫైట్లు ఇదే మాస్ ఫార్ములా తో నడిపించేస్తున్నాడు. కుర్ర హీరోలతో పోటీపడి 100 కోట్లు సాధించాలి, 200 కోట్లు సంపాదించాలి అన్న తపన తప్ప… జనం గుర్తు పెట్టుకునే ఒక మంచి పాత్ర చేయాలి అని చిరంజీవికి ఎందుకు అనిపించడం లేదో. చిరంజీవిలో గొప్ప నటుడున్నాడు… హీరో ఇమేజ్ లో చిరులో నటన చనిపోయింది.

కలెక్షన్లు.. ప్రశంసలు… అవార్డులు ఇవి మాత్రమే చిరంజీవి ప్రపంచం అయిపోయింది. రెమ్యూనరేషన్, కలెక్షను, ఇమేజ్ పక్కనపెట్టి ఒక గొప్ప పాత్ర చిరంజీవి చేసిన విషయం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా గుర్తుందా? అందుకే చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినా కూడా జనంలో పెద్దగా స్పందన లేదు. ఏడు…8 ఏళ్లుగా చిరంజీవి సినిమాల సంఖ్య తగ్గించుకొని ప్రజా సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయనకు తెర వెనుక బలమైన పీఆర్ పనిచేస్తోంది. ఇండస్ట్రీలో కూడా దాసరి చనిపోయిన తర్వాత చిరంజీవి పెద్దమనిషి పాత్రలోకి వచ్చేసారు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిత్వం, మంచిగా వ్యవహరించే మనస్తత్వం వల్ల చిరు అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు.

కానీ నటన విషయంలో మాత్రం ఒక్క శాతం కూడా ఎదగుదలలేదు. మార్పు లేదు. చిరంజీవిపై ఒక మంచి ఆర్టికల్ రాయడానికి మ్యాటర్ కూడా దొరకదు. చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అయినట్లు… తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటులు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పటికీ చిరు హీరోగానే కొనసాగుతున్నారు. చిరంజీవి హీరోగా వేల కోట్లు సంపాదించారు. ఇండస్ట్రీకి ఒక మంచి వారసుడి ఇచ్చారు. ఇప్పుడైనా మంచి పాత్రలు ఎందుకు చేయకూడదు. చిరంజీవి కన్నా డాన్సులు స్టెప్పులు వేసే హీరోలు చాలా మంది ఉన్నారు. ఫైట్లు కూడా చిరంజీవి కన్నా అందరూ బాగానే చేస్తున్నారు. చిరంజీవిలో గొప్ప నటుడున్నాడు. ఇప్పుడైనా నటుని బయటికి తీసి ఒక పది మంచి పాత్రలు చేస్తే అవార్డులకు అర్థం ఉంటుంది. జనంలో చిరస్థాయిగా మిగిలిపోతాడు. వీలైతే మమ్ముట్టి, మోహన్ లాల్, అమితాబచ్చన్, ప్రకాష్ రాజ్ అలాంటి వాళ్ళు చేస్తున్న సినిమాలు, ప్రయోగాలు, ఓటీటీలో వస్తున్న విభిన్న చిత్రాలు చిరంజీవి చూస్తే మంచిది.