Pawan Kalyan: అంబటిని మాత్రమే కాదు.. జగన్‌ను కూడా వదల్లే కదా బ్రో..
వైసీపీ మీద పవన్ కసి మీద ఉన్నారని తెలుసు కానీ.. ఈ రేంజ్‌లో కోపంగా ఉన్నారని.. బ్రో మూవీ రిలీజ్ తర్వాత అర్థం అవుతోంది అందరికీ ! పవన్ సినిమాల్లో, సినిమా చుట్టూ రాజకీయాలు కనిపించడం కొత్త కాదు. జనాలను ఆకట్టుకునేలా మాత్రమే ఇన్నాళ్లు పవన్ సినిమాల్లో డైలాగులు వినిపించేవి. ఇప్పుడు మాత్రం డోస్ పెంచారు. బ్రో సినిమా ద్వారా.. జగన్ సర్కార్‌ను డైరెక్ట్ టార్గెట్ చేశారు.
తనను, తన పార్టీని విమర్శించిన వారిపై.. సెటైర్లు గుప్పించడంతో పాటు.. డైలాగులతో చిన్నపాటి వార్నింగ్‌లు ఇచ్చారు. వారాహి యాత్రలో ఎలాంటి జోష్ మీద డైలాగులు వదిలారో.. సినిమాలోనూ అలాంటి డైలాగులే వినిపించాయ్. ఇప్పటికే అంబటి రాంబాబులాంటి శ్యాంబాబు పాత్ర చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సంక్రాంతి సంబరాలు డ్యాన్సుల మీద పేరడి సీన్లు కనిపించాయ్ బ్రో సినిమాలో! అంబటి రాంబాబును ఒకరకంగా ర్యాగింగ్ చేశారు. సెక్స్ అని అర్థం వచ్చేలా ఒకసారి.. కళలు, లలిత కళలు అంటూ మరోసారి.. రాంబాబుకు ఇంకో పని లేదా అని శ్యాంబాబు అనే పాత్ర ద్వారా పరోక్షంగా సెటైర్లు గుప్పించారు పవన్. ఐతే ఇది జస్ట్ పీస్ మాత్రమే.
సినిమాను సరిగ్గా చూడాలే కానీ.. అంబటి మాత్రమే కాదు వైసీపీ మొత్తాన్ని టార్గెట్ చేసినట్లు డైలాగులు వినిపిస్తున్నాయ్. దీంతో సినిమా నిండా.. పొలిటికల్ పంచ్‌లే పంచ్‌లు కనిపిస్తున్నాయ్. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని.. కబ్జాలు పెరిగిపోయాయని పొలిటికల్ మీటింగ్‌లో పదేపదే చెప్పే పవన్.. సినిమాలోనూ ఇలాంటి డైలాగులే సంధించారు. ముఖ్యంగా జగన్‌ను టార్గెట్ చేస్తూ వదిలిన డైలాగులు.. రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తున్నాయ్. ఇక్కడ ఎవడూ శాశ్వతం కాదు.. పెట్టి పుట్టాం, దోచేసుకుంటాం, ఎత్తుకుపోతాం.. ఇదంతా మాది అనుకుంటే చిటికెలో మాయం అవుతారు అంటూ బ్రో మూవీలో ఓ సీన్‌లో ఓ డైలాగ్.. వైసీపీని టార్గెట్ చేస్తూ చెప్పిందే అని ఈజీగా చెప్పేయొచ్చు.
దీంతో ఈ రచ్చ.. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. సినిమా ఎలా ఉంది.. ఎన్ని కలెక్షన్లు రాబడుతుంది అన్న సంగతి పక్కనపెడితే.. బ్రో మూవీని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రో రేపిన మంటలు.. రాజకీయంగా ఎలాంటి చిచ్చు రాజేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రమే మూవీ మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు జగన్‌ను టార్గెట్ చేస్తున్న డైలాగులు విని.. వైసీపీ నేతలు ఎలాంటి స్పందిస్తారో చూడాలి మరి.