పవన్ కళ్యాణ్ రాయని డైరీ
ఏదేమైనా మా సినిమా వాళ్ళే చాలా మంచోళ్ళు. ప్యాకప్ చెప్పి కేరవాన్ లో కూర్చుంటే నేను పిలిచే వరకు అసలు రారు. డైరెక్టర్, నిర్మాత ఎవరైనా సరే నేను విశ్రాంతి తీసుకుంటున్నా అంటే ఆ చుట్టు పక్కలకు కూడా ఎవరిని రానివ్వరు. కాని అధికారంలో అంతా భిన్నంగా ఉంది. రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు ఉన్నా సరే నాకు సరిపోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ రూమ్ లో కూర్చుని కూర్చుని ఒక్కడ్నే కాసేపు గడిపే సమయం లేకుండా పోతుంది నాకు. ప్రజలు నన్ను గెలిపించారు.
ఇప్పుడు నాపై పెద్ద బాధ్యత పెట్టారు. ఈ 5 ఏళ్ళు నేను బాగా పని చేస్తేనే మళ్ళీ నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. జనసేన పార్టీకి అయినా నాకు అయినా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అందుకే నాకు విసుగు రావడం లేదు. పాలన కొత్త కాబట్టి… కొందరు అధికారులు నాకు అన్నీ చెప్తున్నారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఒక షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. సినిమా షూటింగ్ అయితే నాకు నచ్చినప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు. కాని అలా లేదు ఇక్కడ. ఆదమరిచి ఉండటానికి కూడా లేదు. షూటింగ్ లో డైరెక్టర్ చెప్తాడు ఏ సీన్ చేయాలో… ఇక్కడ అధికారులు మనకి తెలియకపోతే గైడ్ చేస్తారు. కాని అన్నీ మనమే నేర్చుకోవాలి. మొన్న 12 గంటల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగితే చంద్రబాబు నన్ను కూడా పిలిచారు.
అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నత చదువులు చదివిన అధికారులు. దశాబ్దాల తరబడి పాలనలో అనుభవం ఉన్న సీనియర్ అధికారులు. చంద్రబాబు గారికి పాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. నాకు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది నేర్చుకోవడానికి. అందుకే 12 గంటలు కదలకుండా కూర్చుని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం అకీరా ఫోన్ చేసి… నాన్న ఎలా ఉంది ఈ రోజు అనుభవం అని అడిగాడు, బాగుందిరా అన్నాను… భోజనం చేసారా అని అడిగాడు, ఇంతలో ఎవరో అధికారి నన్ను కలవడానికి వచ్చారని పిఏ చెప్పాడు.
అకీరా ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తానని రెండు రోజుల తర్వాత చేసాను… ఉదయం లేచిన దగ్గరి నుంచి అధికారులతోనే సరిపోతుంది, ఈ మధ్యలో జనసేన నేతల పంచాయితీలు, పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలో చేరే దొరబాబు గారికి, వర్మ గారికి గొడవ… ప్రజల సమస్యల పరిష్కారం, ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి… బయటకు చెప్పుకోలేని కొత్త అనుభవం. లోపల తెలియని గర్వం. సినిమా అంటే ఏముంటుంది… చిన్న చిన్న నటులు, వాళ్ళ దగ్గర మనం హీరో. కాని ప్రజా జీవితంలో అంతా భిన్నంగా ఉంటుంది. అధికారంలో మరింత భిన్నంగా ఉంటుంది.
అధికారంలో ఉండే శక్తి చాలా బలాన్ని ఇస్తుంది మనకు. నేను ఒంటరిగా కాసేపు కూర్చోలేకపోతున్నా అనే బాధ తప్పా నాలో అలుపు ఎక్కడా లేదు. మొన్న అమ్మ ఫోన్ చేసింది. నాకు ఇష్టమైన కూర వండుతాను ఇంటికి రమ్మని పిలిచింది. అమ్మ అలా అడిగితే ఏ కొడుకుకు అయినా ఎలా ఉంటుంది…? నాకు వెళ్లాలని ఉంది, అమ్మ ఒడిలో కాసేపు తల పెట్టుకుని పడుకోవాలని ఉంది. కాని అధికారంలో ఉన్నప్పుడు మనం వ్యక్తిగత ఇష్టాలను కష్టపడకుండా వదులుకోవడం లో సంతోషం ఉంటుంది. అలా చాలా విషయాలు వదిలేసుకున్నాను.
మామిడి తోటలోకి వెళ్ళాలి, కాసేపు నా గిత్తలతో సమయం గడపాలి, వాటిని సరిగా చూసుకుంటున్నారో లేదో అనే భయం నాది. కాని అకీరా వెళ్లి అప్పుడప్పుడు నాకు వీడియోలు తీసి పంపిస్తూ ఉంటాడు. మొన్న ఆధ్యా మెసేజ్ పెట్టింది… నాన్న మీతో నాకు ఉండాలనుంది అని, అందుకే ఇండిపెండెన్స్ డే కి నాతో పాటు కాకినాడ తీసుకెళ్ళాను… అప్పటి వరకు నాతో సినిమా షూటింగ్ కి కూడా రాని నా కూతురు… అలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అంత మంది పోలీసుల గౌరవ వందనం, పక్కన నా కూతురు చూస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది… మాటల్లో చెప్పలేను. మనసు పొంగిపోతుంది లోపల.
నా సెక్యూరిటీ వాళ్లకు అసలు మానవత్వం ఉండదు. సినిమా షూట్ లో చాలా ఫ్రీ గా ఉండేది. ఎవరైనా వస్తే… బౌన్సర్ లు ఆపితే వదలండి అంటే వదిలేసేవారు. కాని ఇక్కడ నా మాట కూడా వినరు. వాళ్ళ రూల్ బుక్ నేను మార్చకూడదు. నేను పవన్ కళ్యాణ్ కాదు… ఇంకెవరు అయినా సరే… వాళ్లకు నేను మంత్రిని అంతే… కాబట్టి నా మాట వాళ్ళు వినాలనే పట్టుదల నాకు లేదు. నా భద్రత వాళ్లకు ముఖ్యం. నా మీద ఈగ వాలినా వాళ్లకి చెడ్డ పేరు వస్తుంది. పై అధికారులకు నివేదిక పంపాలి. ఆ తలనొప్పి అంతా ఎందుకు. ఇక మీడియా వాళ్ళు… నేను ఒకప్పుడు ఏది మాట్లాడినా మీడియా హైలెట్ చేసేది.
ఇప్పుడు నేను ఏ తప్పులు చేస్తానా అని ఎదురు చూస్తున్నారు. క్రమశిక్షణలో ఏ తేడా వచ్చినా ప్రజల్లో అల్లరి చేస్తారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు… ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఫిలిం నగర్ లో మన ప్రవర్తనకు సచివాలయంలో మన ప్రవర్తనకు చాలా మార్పు ఉండాలి. కారు ఎక్కినా దిగినా, హుందాగా ఉండాలి. సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తే చాలు. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నటించాల్సి వస్తోంది. కాని ఎప్పుడు నటించాలో ఇంకా నేను నేర్చుకోలేదు. నా భార్య అన్నాతో అసలు మాట్లాడే టైం కూడా కుదరడం లేదు. పిల్లలతో ఆడుకోలేకపోతున్నాను… వచ్చే నెల నుంచి షూట్ కి వెళ్ళాలి.
అప్పుడు మళ్ళీ పార్ట్ టైం మంత్రి అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. వాటికి కూడా సమాధానం చెప్పాలి. ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళు కూడా నా వృత్తిని తప్పుబడితే కోపం రాకుండా సమాధానం చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ మొన్న ఫోన్ చేసి మామా నేను అమరావతి వస్తా అన్నాడు. టైం చూసుకుని చెప్తారా అన్నాను… కాని కుదరడం లేదు. అధికారం సంబరం కాదు, అధికారం గౌరవం. కాపాడుకోవాలి. అప్పుడే నిజంగా గెలిచినట్టు. నేను గెలుస్తాను, నిలబెట్టుకుంటాను.