Popcorn Prices: సినిమాను చంపేస్తున్న పాప్‌కార్న్? ఇప్పటికైనా ఇండస్ట్రీ మేల్కొంటుందా? ప్రేక్షకుడి గోడు పట్టదా?
సినిమాలు బాగానే ఆడుతున్నాయి. మంచి సినిమాలు పడితే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నిజంగా సినిమాలను దెబ్బకొట్టేది టీవీలు, ఓటీటీలు కాదు.. పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్. వీటి ధరలే ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి అని చెప్పారు దర్శకుడు తేజ.
Popcorn Prices: మూడేళ్లక్రితం కోవిడ్ సందర్భంగా థియేటర్లు నెలలపాటు మూతపడ్డాయి. ఈ సమయంలో ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఇతర భాషా కంటెంట్ కూడా చూడ్డం మొదలుపెట్టారు. తర్వాత కోవిడ్ తగ్గింది. నెమ్మదిగా థియేటర్స్ ప్రారంభమయ్యాయి. కానీ, ప్రేక్షకులు రావడం తగ్గించేశారు. దీంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా కంగారుపడిపోయింది. సినిమా పరిశ్రమకేమైంది? ఇకపై థియేటర్లకు ప్రేక్షకులు రారా? ఓటీటీల్లోనే సినిమాలు చూస్తారా? ఇలాగైతే థియేటర్లు మూసేయాల్సిందేనా? అంటూ అనేక సందేహాలు తలెత్తాయి. కానీ, తర్వాత మెల్లిగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. కొన్ని సినిమాలకు కనక వర్షం కురిసింది. బాక్సాఫీసులు బద్ధలయ్యాయి. అందరూ అనుకున్నట్లు ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేయలేదు. ఓటీటీ వల్ల ఇండస్ట్రీకి నష్టం జరగలేదు అని అర్థమైంది. అయితే, ఇప్పటికీ ప్రేక్షుకుల్ని థియేటర్లుకు రాకుండా చేసే అంశం ఒకటుంది. అదే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు. ఇవే సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయంటున్నారు ప్రముఖ దర్శకులు తేజ.
దాదాపు వంద ఏళ్లకుపైగా దేశంలో సినిమా ఇండస్ట్రీ నడుస్తోంది. ఒకప్పుడు నాటకం ప్రజలకు వినోదాన్ని పంచగా.. ఆ తర్వాత ఈ స్థానాన్ని సినిమా ఆక్రమించింది. క్రమంగా భారతీయులు సినిమాలకు అలవాటుపడ్డారు. సినిమాల్ని విపరీతగా ఇష్టపడటం మొదలెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లకు టీవీలు వచ్చాయి. ప్రేక్షకులు టీవీలు చూడటానికి ఇష్టపడ్డారు. టీవీల రాకతో సినిమా ఇండస్ట్రీ కనుమరుగవుతుందేమో అని అంతా భావించారు. కానీ అదేమీ జరగలేదు. సినిమా ఇండస్ట్రీ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఓటీటీలు వచ్చాయి. వీటివల్ల కూడా ఇండస్ట్రీ పని అయిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, సినిమాలు బాగానే ఆడుతున్నాయి. మంచి సినిమాలు పడితే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నిజంగా సినిమాలను దెబ్బకొట్టేది టీవీలు, ఓటీటీలు కాదు.. పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్. వీటి ధరలే ప్రేక్షకుల్ని థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి అని చెప్పారు దర్శకుడు తేజ. పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలపై ప్రేక్షకులు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాతో పాటు పాప్‌కార్న్
సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు థియేటర్లోనే సగటున మూడు గంటలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మధ్యలో కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ వంటివి కావాలనుకుంటారు. పాప్‌కార్న్, సమోసా వంటి శ్నాక్స్ తింటూ.. కూల్ డ్రింక్స్ తాగుతూ మూవీని ఎంజాయ్ చేస్తాడు. అది థియేటర్లోనే దొరికే ఎక్స్‌పీరియెన్స్. కొందరికి ఇవి లేకుండా సినిమా చూస్తే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అక్కడే వచ్చింది చిక్కు. సినిమా టిక్కెట్ ధరలకంటే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ ధరలే ఎక్కువుంటున్నాయి. ఈ ధరలు భరించడం సామాన్యుడికి కష్టమవుతోంది. అలాగని కొనకుండా, తినకుండా ఉండలేని పరిస్థితి. సింగిల్‌గా వెళ్తే పర్లేదు. కానీ ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనే వెళ్లినప్పుడు కచ్చితంగా కొని తీరాల్సిందే. ముఖ్యంగా పిల్లలు అడిగితే పేరెంట్స్ కాదనలేరు. దీంతో సినిమాకు వెళ్లిన ప్రతిసారీ జేబుకు చిల్లుపడుతోంది. అందుకే ఫ్యామిలీతో సినిమాకు వెళ్దామనుకున్న వాళ్లు సింగిల్‌గా సినిమా చూస్తున్నారు. అంటే ఫ్యామిలీ మొత్తానికి తెగాల్సిన సినిమా టిక్కెట్లు.. ఒకరో, ఇద్దరితోనే ఆగిపోతున్నాయి. ఇది ఆ సినిమాకు నష్టమే కదా.
మల్టీప్లెక్సుల్లోనే దోపిడీ
దర్శకుడు తేజ చెప్పినట్లు సినిమాలకు ప్రేక్షకుల్ని దూరం చేస్తున్నవి కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, సమోసా ధరలే. నిజానికి సినిమా టిక్కెట్లు సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు ధరలు పెంచినా.. ఎక్కువ సినిమాలకు రీజనబల్ రేట్లే ఉంటున్నాయి. అందులోనూ సింగిల్ స్క్రీన్లలో కొన్ని మినహా ఎక్కువ థియేటర్లలో టిక్కెట్ల ధరలు, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, సమోసా వంటివి అందుబాటులోనే ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్సుల్లోనే ఈ ధరలు ప్రేక్షకుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, సమోసా వంటి వాటి ధరలు రూ.25-రూ.50 వరకు ఉంటున్నాయి. కొన్ని స్క్రీన్లలో మాత్రం రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. అయితే, మల్టీప్లెక్సులు మాత్రం వీటికి రూ.250-రూ.330 వరకు వసూలు చేస్తున్నాయి. ఒక్క కూల్ డ్రింక్ లేదా పాప్‌కార్న్ రెగ్యులర్ లేదా స్మాల్ సైజ్ ధర రూ.290, రూ.300గా ఉంటోంది. లార్జ్ టబ్ పాప్‌కార్న్ అయితే రూ.330 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.20కి దొరికే వాటర్ బాటిల్ మల్టీప్లెక్సులో అయితే రూ.50, సమోసా రూ.100, వెజ్ శాండ్విచ్ రూ.220, కాఫీ రూ.100, రెండు కూల్ డ్రింక్స్, ఒక పాప్‌కార్న్ కాంబో రూ.930, ఒక కూల్ డ్రింక్, ఒక పాప్‌కార్న్ కాంబో రూ.480 వరకు ఉంటున్నాయంటే అక్కడి ధరలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రేక్షకులు ఇంత ధరలు పెట్టలేకపోతున్నారు. దీంతో సినిమా థియేటర్లవైపు రావాలంటే భయపడుతున్నారు. ఎక్కువ సినిమాలు చూడాలని ఉన్నా.. ఈ ధరలు చూసి సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలకెళ్తున్నారు. పైగా ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. అందులోనూ పిల్లలుంటే ఇంక ఖర్చు గురించి టెన్షన్ తప్పదు. మల్టీప్లెక్సులు మాత్రమే కాదు.. కొన్ని సింగిల్ స్క్రీన్లు కూడా ఇలాంటి ధరలే వసూలు చేస్తున్నాయి. ఈ ధరలు కచ్చితంగా ప్రేక్షకుడిని దోపిడీ చేయడమే.
ఇండస్ట్రీకి నష్టమే..
మల్టీప్లెక్సుల తీరుతో సినిమా ఇండస్ట్రీకి నష్టమే. కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్, సమోసా ధరల వల్ల ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారు. ఎక్కువ సినిమాలు చూడాలనుకున్న ప్రేక్షకుడు కొన్ని సినిమాలు మాత్రమే చూస్తున్నాడు. దీనివల్ల సినిమా పరిశ్రమకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వారికి ఎలాంటి అదనపు ఉపయోగం లేదు. కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ వల్ల వచ్చే ఆదాయం మల్టీప్లెక్సులకే చేరుతుంది. ఇవి వారికి అదనంగా ఆదాయం సమకూర్చి పెడుతున్నప్పటికీ, సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. కాబట్టి ఇండస్ట్రీకి నష్టం కలిగించే ఈ అంశంపై పరిశ్రమ దృష్టిపెట్టాలి. ఈ అంశంలో అనేకసార్లు సినిమా పెద్దలు, మల్టీప్లెక్సుల మధ్య చర్చలు జరిపినా ప్రేక్షకుడికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. చివరకు ఈ అంశం కోర్టు వరకు వెళ్లినా ధరలు మాత్రం తగ్గలేవు. వీటి ధరల్ని నిర్ణయించే అధికారం మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు వదిలేసింది. అందువల్లే మల్టీప్లెక్సులు అధిక ధరలు నిర్ణయిస్తున్నా అడిగేవాళ్లు లేరు. ప్రభుత్వమైనా జోక్యం చేసుకుని ధరల్ని అదుపు చేసి, వీటి దోపిడీని అడ్డుకోవాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. వీటి ధరల్ని అదుపు చేస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీ మరింత లాభపడుతుంది. కచ్చితంగా సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ప్రేక్షకుడు సినిమాను మరింతగా ఆస్వాదిస్తాడు.