Posani Krishna Murali: నంది అవార్డులు పంచుకున్నారు.. సినిమా పరిశ్రమలో డబ్బు డామినేషనే ఉంది: పోసాని కృష్ణ మురళి ఆరోపణ

నంది అవార్డులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి. నంది అవార్డుల విషయంలో చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. అవార్డుల్ని గ్రూపులు, కులాలవారీగా పంచుకునేవాళ్లని విమర్శించారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2023 | 04:34 PMLast Updated on: Apr 07, 2023 | 4:35 PM

Posani Krishna Murali Alleges That Nandi Awards Are Shared Money Dominates Film Industry

Posani Krishna Murali: గతంలో ప్రభుత్వం అందించే నంది అవార్డుల్ని పంచుకునే వాళ్లని ఆరోపించారు రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి. నంది అవార్డులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫైబర్ నెట్ ద్వారా అందుబాటులోకి రానున్న ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రారంభం సందర్భంగా పోసాని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన అవార్డులపై వ్యాఖ్యానించారు.

”నంది అవార్డుల విషయంలో చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. అవార్డుల్ని గ్రూపులు, కులాలవారీగా పంచుకునేవాళ్లు. చంద్రబాబు నాయుడు హయాంలో అవార్డుల పంపకాలు ఇలాగే జరిగేవి. నంది అవార్డులు పంచుకునే విషయంలో చాలా మంది దర్శక, నిర్మాతలు నష్టపోయారు. ఇక్కడ కమ్మ, కాపు డామినేషన్ ఏమీ లేదు. కేవలం డబ్బు డామినేషన్ మాత్రమే ఉంటుంది. టెంపర్ చిత్రానికి నాకు నంది అవార్డు వచ్చింది. తప్పదు అని ఇచ్చారు. కానీ, నేను ఆ నంది అవార్డును తిరస్కరించాను. అయితే, తప్పక వెళ్లి తీసుకున్నా. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయో అని చూస్తే ఒక విషయం అర్థమైంది.

అవార్డుల కమిటీలో ఒక వర్గానికి చెందిన వాళ్లే 11 మంది ఉన్నారు. దీంతో అవార్డులు వచ్చిన విధానం నాకు నచ్చలేదు. అందుకే నాకు వచ్చిన అవార్డును వద్దని చెప్పా. కులాలు, మతాలకు సంబంధం లేకుండా అవార్డు ఇవ్వాలి. తెలుగు సినిమా పరిశ్రమను కులాలు, మతాలు కాదు.. డబ్బు మాత్రమే శాసిస్తుంది. ఏపీలో నంది అవార్డులు ఇచ్చే విషయంపై అన్నీ చర్చించి, నిర్ణయం తీసుకుంటాం” అని పోసాని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాలకు సంబంధించి వివిధ విభాగాల్లో ఉత్తమ చిత్రాలు, నిపుణులు, నటీనటుల్ని ఎంపిక చేసి నంది అవార్డులు ఇచ్చేవాళ్లు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఈ అవార్డులపై ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. కాగా, పోసాని ఆరోపణలపై తెలుగు సినిమా పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.