Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. అతిథులకు ఆహ్వానాలు పంపుతున్న జంట!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే, ఈ అంశంపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, ప్రచారం జరుగుతున్నట్లుగా త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది.

Parineeti Chopra: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిది ముంబై.. ఇంకొకరిది ఢిల్లీ. కానీ, ఈ ఇద్దరూ అనేక చోట్ల మీడియాకు చిక్కారు. పలుసార్లు రెస్టారెంట్లలో డేటింగ్‌కు వెళ్తూ మీడియాకు దొరికిపోయారు. అప్పటినుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల కూడా ఒక రెస్టారెంట్ వద్ద ఇద్దరూ జంటగా కనిపించారు.
అయితే, ఈ అంశంపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, ప్రచారం జరుగుతున్నట్లుగా త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. ఈ నెల 13న పరిణీతి, రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో జంట తలమునకలై ఉంది. కొద్ది మంది అతిథులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించబోతున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులతోపాటు, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఒకరిది సినీ నేపథ్యం.. మరొకరిది రాజకీయ రంగం కావడంతో రెండు రంగాలకు చెందిన ప్రముఖలు ఈ నిశ్చితార్థానికి హాజరవుతారు. మొత్తంగా 150 మంది అతిథులకు ఆహ్వానం పంపబోతున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత తమ బంధంపై ఈ జంట అధికారిక ప్రకటన చేయబోతుంది.
పరిణీతి చోప్రా బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రియాంక చోప్రా పరిణీతి చోప్రాకు వరుసకు సోదరి అవుతుంది. రాఘవ్ చద్దా గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పనితీరు నచ్చడంతో పార్లమెంటులో ఆప్ తరఫున ప్రతినిధిగా ఉంచాలని కేజ్రీవాల్ భావించారు. దీంతో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీంతో రాఘవ్ రాజ్యసభ ఎంపీ అయ్యారు.