Rajadhani Files Review: ఆవేదనకి సాక్ష్యం.. రాజధాని ఫైల్స్.. రైతుల కన్నీటి గాథ
ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పెట్టి నటించారు. రైతు నాయకుడిగా వినోద్ కుమార్ నటన కట్టిపడేసింది. ఇప్పటిదాకా ఆయన పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ కూడా మెప్పించారు.
Rajadhani Files Review: ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా అనే అభిప్రాయాన్ని ట్రైలర్‌తోనే కలిగించింది రాజధాని ఫైల్స్. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ..
అరుణప్రదేశ్ రాష్ట్రంలోని అయిరావతి ప్రాంతం ఏడాదికి రెండు మూడు పంటలు పండే అద్భుతమైన వ్యవసాయ భూమిని కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటం, అన్నింటికీ అనువైన ప్రాంతం కావడంతో.. ప్రభుత్వం అయిరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేస్తుంది. తరతరాలుగా ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు.. తమ భూములు ఇవ్వడం ఇష్టంలేనప్పటికీ.. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్ కోసం.. త్యాగానికి సిద్ధపడతారు. విశ్వనగరం లాంటి రాజధాని నిర్మాణం జరిగితే.. ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువత భవిష్యత్ బాగుంటుందని ఎంతో సంతోషంగా భూములు త్యాగం చేస్తారు రైతులు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో, తాము కలలు కన్న రాజధానిని త్వరలోనే చూసుకోబోతున్నామని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. కొత్త ప్రభుత్వం వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లుతుంది. వారి త్యాగాన్ని వృథా చేస్తుంది. అయిరావతి రాజధానిగా ఉంటే గత ముఖ్యమంత్రి పేరే చరిత్రలో నిలిచిపోతుంది, నీకు ఎలాంటి పేరు రాదని తన పొలిటికల్ అనలిస్ట్ చెప్పిన మాటలతో.. నూతన ముఖ్యమంత్రి నాలుగు రాజధానుల రాగాన్ని ఎత్తుకుంటాడు. దీంతో అయిరావతి రైతులు అహింస మార్గంలో ఉద్యమానికి దిగుతారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి సీఎం, అతని అనుచరగణం చేయని దుర్మార్గం ఉండదు. ఆ దుర్మార్గాలను తట్టుకొని రైతులు ఎలా పోరాడారు? ఆ పోరాట ఫలితంగా అయిరావతే రాజధానిగా ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
CHIRANJEEVI: ‘అల్లు’కి దూరంగా.. మెగా హీరోలు..
నటీనటుల పర్పామెన్స్
ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పెట్టి నటించారు. రైతు నాయకుడిగా వినోద్ కుమార్ నటన కట్టిపడేసింది. ఇప్పటిదాకా ఆయన పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఇక రైతుల కోసం పోరాడే యువకుడి పాత్రలో అఖిలన్ నటన గుర్తుండిపోతుంది. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వీణ, పవన్, విశాల్, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అంకిత ఠాకూర్ తదితరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ‘ఏరువాక’ పాటలో అమృత చౌదరి నృత్యం ఆకట్టుకుంది.
సాంకేతిక విభాగం
యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను దర్శకుడు భాను ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సినిమాని ఆయన ఎత్తుకున్న విధానం, కథలోకి తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే, కమర్షియల్ అంశాలను కూడా జోడించి సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా మలిచారు. అన్ని విభాగాల పనితీరు అద్భుతంగా ఉంది. దర్శకుడు భాను.. కథాకథనాలతో పాటు తనదైన మేకింగ్‌తో మెప్పించాడు. మణిశర్మని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటారో మరోసారి రుజువైంది. పాటలతో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశారు. ఏరువాక సాంగ్‌తో పాటు, థీమ్ సాంగ్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఇక నేపథ్య సంగీతంతో అయితే సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ కథలో ఎంత నిజాయితీ ఉందో.. రమేష్ కెమెరా పనితనం అంత సహజంగా ఉంది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా రైతుల ఆవేదనను కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన అనుభవంతో సినిమాని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అనిల్ అచ్చుగట్ల సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
YASH-PRABHAS: యష్, ప్రభాస్.. 2024లో ఊహించని కాంబినేషన్లతో సెన్సేషన్?
నచ్చుతుందా..?
వినోదాన్ని పంచే సినిమాలు రెగ్యులర్‌గా వస్తాయి. కానీ, వాస్తవాన్ని చూపిస్తూ ఆలోచన రేకెత్తించే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమానే ‘రాజధాని ఫైల్స్’. ఇది ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందిన సినిమా కాదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా.. అందరినీ కదిలించే రైతుల త్యాగానికి, వారి ఆవేదనకి సాక్ష్యం ఈ చిత్రం.