రాజేంద్ర ప్రసాద్ గారు.. నీ వయసు ఏంటి.. ఆ మాటలు ఏంటి.. చూసుకోవాలి కదా సార్..!

ఒక మనిషి స్థాయిని డిసైడ్ చేసేది అతని దగ్గర ఉన్న డబ్బు, హోదా కాదు.. అతని మాట తీరు. అవతలి వాళ్లతో అతను ఎలా మాట్లాడుతున్నాడు.. తనకంటే చిన్నవాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేదానితోనే మనం ఏంటి అనేది ప్రపంచం చూస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 05:00 PMLast Updated on: Mar 25, 2025 | 5:00 PM

Rajendra Prasad Garu How Old Are You What Are Those Words You Should Take Care Sir

ఒక మనిషి స్థాయిని డిసైడ్ చేసేది అతని దగ్గర ఉన్న డబ్బు, హోదా కాదు.. అతని మాట తీరు. అవతలి వాళ్లతో అతను ఎలా మాట్లాడుతున్నాడు.. తనకంటే చిన్నవాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేదానితోనే మనం ఏంటి అనేది ప్రపంచం చూస్తుంది. మాట సరిగ్గా ఉంటే మన మీద గౌరవం కూడా అలాగే ఉంటుంది. అలా కాకుండా ఆ మాటలు ఏదైనా తేడా వస్తే మాత్రం కచ్చితంగా వయసు కూడా చూడకుండా చివాట్లు తినాల్సి వస్తుంది. తాజాగా రాజేంద్రప్రసాద్ విషయంలో ఇదే జరుగుతుంది. ఎన్నో వందల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్.. ఈ మధ్య కాలంలో ఎందుకో మరి నోరు బాగా జారుతున్నారు. ఆయన మాటలతో సినిమాలు బలైపోతున్నాయి. ముందు వెనక చూసుకోకుండా ఎవరిని ఏమంటున్నాడో కూడా తెలియకుండా ఆయన నోరు జారడం కొందరిని బాగా ఇబ్బంది పెడుతుంది. సరదా కోసం చేశాడు అనుకోవచ్చు కానీ ప్రపంచం చూస్తున్నప్పుడు అలాంటి కామెంట్స్ చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

తాజాగా రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దొంగ ముండా కొడుకు.. ఒరేయ్ వార్నర్ నీకు వార్నింగ్.. ఇలాంటి పద ప్రయోగాలు చేస్తూ రాజేంద్రుడి స్పీచ్ సాగింది. అక్కడున్న వాళ్లను నవ్వించడానికి ఇలా మాట్లాడాడు అని కవర్ చేయొచ్చు కానీ.. దేశం కానీ దేశం వచ్చి భాష రాని చోట నటించిన ఒక లెజెండరీ క్రికెటర్ గురించి అలా మాట్లాడటం మాత్రం నిజంగా తప్పు అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ చేసింది తప్పే అని డంకా బజాయించి చెప్తున్నారు. ఎంత నవ్వించడానికి చెప్పినా కూడా అలా దొంగ ముండాకొడుకు అనడం మాత్రం తప్పు అనే వాదన వినిపిస్తుంది. అంతేకాదు వార్నర్ ను ఇమిటేట్ చేస్తూ నట కిరీటి చేసిన విధానంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకు భాష రాదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి..? తర్వాత కూడా డేవిడ్ వార్నర్ కు ఎవరో ఒకరు జరిగిన విషయం చెప్తారు కదా.. అప్పుడు ఆయన తెలుగు సినిమా గురించి ఏమనుకుంటాడు అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. కారణం ఏదైనా అయి ఉండొచ్చు.. అలాంటి ఒక లెజెండరీ క్రికెటర్ ను అలా అవమానించడం మాత్రం తప్పు అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు జారడం ఇది మొదటిసారి కాదు.

ఆ మధ్య ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే నా కొడుకులు హీరోలు అయిపోతున్నారు ఈ మధ్య అంటూ మాట్లాడాడు. అప్పటికి పుష్ప 2 రిలీజ్ అయ్యే కేవలం వారం రోజులు కూడా కాలేదు. దాంతో ఆటోమేటిక్ గా అందరూ ఆయన అన్నది అల్లు అర్జున్ నే అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను అన్నది అల్లు అర్జున్ ను కాదని క్లారిటీ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. అంతకుముందు కూడా కొన్ని ఈవెంట్స్ లో కాస్త లిబర్టీ తీసుకుని ఎక్కువగానే మాట్లాడారు ఈ సీనియర్ నటుడు. ఇండస్ట్రీలో ఆయన అంటే ఒక రకమైన గౌరవం ఉంది కాబట్టి ఏం మాట్లాడినా కూడా ఎవరూ ఏమీ అనడం లేదు. అలాగని ఏం మాట్లాడినా ఎవరూ ఏమీ అనరు అనీ.. ఏది పడితే అది మాట్లాడితే ఉన్న గౌరవం కూడా పోతుంది అనే వాళ్ళు లేకపోలేదు. ఏదేమైనా నోరు కాస్త అదుపులో ఉంటే అందరికీ మంచిది. ఆ నోటి నుంచి వచ్చే మాట వల్ల ప్రశంసలు వస్తాయి.. కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనమే కాస్త చూసుకొని మాట్లాడితే బెటర్.