Rajanikanth Jailer: మొరగని కుక్క లేదు.. అర్థమైందా రాజా..! వైసీపీ నేతలపై రజనీకాంత్ ఘాటు వ్యాఖ్యలు
జైలర్ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సంచలనంగా మారింది. సూపర్ స్టార్ తనదైన పంచ్ డైలాగ్ ను పేల్చాడు. రాజకీయ నాయకులకు ఇది బాగా తగిలింది అని చెప్పాలి.
పంచ్ పడింది.. అది కూడా అలాంటి ఇలాంటి పంచ్ కాదు.. బాషాను ఒక్కసారి తిడితే.. వందరెట్లు పంచ్ పడింది.. రాజకీయ విమర్శలపై సాధారణంగా ఆచితూచి స్పందించే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి కొంచెం ఘాటుగానే స్పందించారు. ఎవరికైతే తగలాలో వాళ్లకు తగిలేలా.. పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. ఎవరు ఏం మాట్లాడినా మన దారిలో మనం పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా.. ఇది తలైవా విసిరిన పంచ్.. పైకి చూస్తే ఇది సినిమా డైలాగ్‌లాగే కనిపిస్తుంది.. సినిమాలో ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ రజినీకాంత్ చెప్పిన సందర్భమే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ చర్చనీయాంశంగా మారింది.
జైలర్ మూవీ ఆడియో ఈవెంట్‌లో పాల్గొన్న రజినీకాంత్.. చాలాకాలం తర్వాత సుధీర్ఘంగా మాట్లాడారు. ఏం మాట్లాడినా.. వాటికి పెడార్థాలు తీసే మీడియా, సోషల్ సోషల్ మీడియాకు సుతిమెత్తగా చురకుల అంచించారు. అదే సమయంలో మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండూ జరగని ఊరు లేదు అంటూ పంచ్ డైలాగులు కొట్టారు. ఈ హైఓల్ట్ మాటలను పీక్ స్టేజ్‌కి తీసుకెళ్తూ.. అర్థమైందా రాజా అంటూ తెలుగులో నవ్వుతూ ముక్తాయించారు. తమిళనాట జైలర్ తమిళ వర్షన్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పూర్తిగా తమిళంలోనే మాట్లాడిన రజినీకాంత్ చివర్లో మాత్రం అర్థమైందా రాజా అంటూ విసిరిన ఆ లాస్ట్ పంచ్ మాత్రం ఏపీలో ఈ మధ్య తనను విమర్శించిన వైసీపీ నేతల కోసమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆ విమర్శలే రజినీ పంచ్ డైలాగులకు కారణమా ?
ఇటీవల రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ తో అనుబంధమున్న మొన్న నిన్న నేటి తరం సినీ, రాజకీయ నేతలెందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ వేదికపై నుంచి రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. హైదరాబాద్, అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గురించి చెబుతూ పాజిటివ్ గా తనమనసులో ఉన్న నాలుగు డైలాగులు చెప్పారు. అంతే మరుసటి రోజే.. వైసీపీ నేతలు సూపర్ స్టార్ పై విరుచుకుపడ్డారు. రోజా నుంచి కొడాలి నాని వరకు బాద్‌షాపై పొలిటికల్ విమర్శలు చేశారు. రజినీకాంత్‌కు టీడీపీకి ముడిపెడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కూడా రజినీకాంత్‌ను ఓ ఆట ఆడుకుంది. అప్పుడు వాళ్లు చేసిన విమర్శలకు కౌంటర్ గానే రజినీకాంత్ ఇప్పుడు పరోక్షంగా విమర్శలు గుప్పించారన్న చర్చ జరుగుతోంది.
ఆ మాటల వెనుక భావం చాలానే ఉంది
ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. మన వెనుక, ముందు మొరిగేవాళ్లు ఎక్కడైనా ఉంటారు.. అలాలేని వాళ్లు ఉన్న ఊరంటూ లేదు.. అందుకే ఎవరేమన్నా.. మన దారిలో మనం వెళ్తూ ఉండాలి.. సూపర్ స్టార్ తన నోటితో చెప్పింది ఈ నాలుగు డైలాగ్‌లే అయినా.. వాటి వెనుక అర్థం మాత్రం చాలానే కనిపిస్తుంది.. మొరిగే వాళ్లను చూసి తానెప్పుడూ భయపడనని.. తనదారి ఎప్పటికీ రహదారే అన్న భావన వచ్చేలా.. రజినీ తనపై విమర్శలు గుప్పించేవాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. అర్థమైందా రాజా అన్న డైలాగ్ చెబుతూ.. రజినీ వ్యంగ్యంగా నవ్విన తీరు, ఆయన హావభావాలు కూడా గమనిస్తే.. కచ్చితంగా తనపై విమర్శలు గుప్పించేవాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ లా కనిపిస్తోంది. రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి.. ఎన్టీఆర్ వేడుకల్లో పాల్గొని.. వైసీపీ నేతలు విమర్శలు చేసి చాలా కాలమే అయ్యింది.. కానీ జైలర్ ఆడియో వేడుకను వేదికగా చేసుకున్న తలైవా.. విమర్శలు చేసే వాళ్లకు అదే రేంజ్ లో సమాధానం మిచ్చారు.. లాగి చెంపమీద కొట్టినట్టు తలైవా చెప్పిన డైలాగులు.. అర్థంకావాల్సిన వాళ్లకు అర్థమై ఉంటాయా..! ఏమో..అర్థమైందా.. రాజా..!