Rakesh Master: రాకేశ్ మాస్టర్‌కు విగ్రహం.. పుల్లయ్యలా ఉందంటూ సెటైర్లు..
రాకేశ్ మాస్టర్‌కు గుర్తుగా ఆయన శిష్యులంతా కలిసి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. విగ్రహం ఎలా ఉందో చెప్పండి అటూ వీడియో పోస్ట్ చేయగా.. రకరకాల కామెంట్లు వస్తున్నాయ్.
Rakesh Master: రాకేశ్ మాస్టర్ ఆకస్మిక మరణం.. టాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. బతికి ఉన్నప్పుడు ఆయనను కమెడియన్‌లాగా చూసినా.. రాకేశ్ మాస్టర్ పాత వీడియోలు ఇప్పుడు చూస్తుంటే.. ఆయన గొప్పదనం ఏంటో తెలుస్తుంది జనాలకు! రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్‌లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడున్న చాలామంది టాప్ హీరోలకు.. ఒకప్పుడు స్టెప్పులు నేర్పించిది రాకేశ్ మాస్టరే!
హీరో వేణు నుంచి ప్రభాస్ వరకు.. చాలామంది హీరోలు.. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. దాదాపు 15వందల పాటలకు కొరియోగ్రఫీ చేసిన ఆయన.. టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా వెలుగు వెలిగారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్.. గత జూన్ 18న చనిపోయాడు. మాస్టర్‌కు గుర్తుగా ఆయన శిష్యులంతా కలిసి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న శిష్యుడు ఈ విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు.
ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు. విగ్రహం ఎలా ఉందో చెప్పండి అటూ వీడియో పోస్ట్ చేయగా.. రకరకాల కామెంట్లు వస్తున్నాయ్. చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లుగా అనిపించడం లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు… పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది.. మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా.. అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియో పోస్ట్ చేశాడు బషీర్.