Ram Charan: టాలీవుడ్ మగధీరుడు.. హ్యాపీ బర్త్ డే చెర్రీ..!
‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు రామ్ చరణ్.
Ram Charan: రామ్ చరణ్.. చిరుతలా దూసుకొచ్చి మెగాఅభిమానులకు నాయక్ లా మారిన మగధీరుడు. డైనమిక్ డాన్స్ లతో, స్టన్నింగ్ స్టంట్స్ తో సాలిడ్ హిట్స్ కొడుతున్నాడు మెగాపవర్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి షార్ట్ టైంలోనే టాప్ హీరో అయిపోయాడు. ఇక.. ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా మారిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు రామ్ చరణ్. నిర్మాతగా మారి ఆ రంగంలోనూ అదరగొడుతున్నాడు. మెగాస్టార్ వారసుడు అనే మాటను ఎప్పుడో మర్చిపోయేలా చేసి.. ఇప్పుడు తనకంటూ ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు.
చిరు వారసుడిగా ఎంట్రీ..
చిరంజీవి వారసుడుగా సులువుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్ అనుకున్నారు చాలామంది. కానీ మెగా వారసుడిగా అతని ఎంట్రీ సులువుగానే ఉండొచ్చు. కానీ అంతకు మించిన బరువు కూడా ఉంది. ఆ బరువును తొలి సినిమాకే మాగ్జిమం దింపేసుకున్నాడు చరణ్. ఫస్ట్ మూవీకి బెస్ట్ అనిపించుకోకున్నా మెగాస్టార్ వారసుడుగా నిలబడతాడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ తనయుడు వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా..? అలాంటి భారీ అంచనాలు, అంతకు మించిన ఒత్తిడి మధ్యే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చిరుతలా వచ్చాడు. ‘చిరుత’ ఆశించినంత బిగ్గెస్ట్ హిట్ కాకపోయినా మెగాస్టార్ కు సరైన వారసుడుగా నిలిచే సత్తా ఉన్న వాడిగా చరణ్ ను ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. వారి అంచనాలు ఏ మాత్రం తప్పు కాదని రెండో సినిమాకే ప్రూవ్ చేశాడీ మెగా పవర్ స్టార్. రామ్ చరణ్ కు రెండో సినిమాకే బ్రేక్ వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘మగధీర’లో రామ్ చరణ్ ధీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మగధీర.. సంచలనం..
మగధీర’ తెలుగు సినిమాకు సంబంధించిన సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. కష్టం రాజమౌళిదే అయినా అతని నమ్మకాన్ని వెండితెరపై నిలబెట్టింది రామ్ చరణ్. ఓ మాస్ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ నూ చూపించి తెలుగు సినిమాపై తనదైన జెండా ఎగురవేశాడు రామ్ చరణ్. ‘మగధీర’లో అతని నటనకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ గా సత్కరించింది. హిస్టారికల్ ఫిక్షన్ ఫిల్మ్ మగధీరతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, తర్వాత ‘ఆరెంజ్’తో కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. మగధీర వంటి హిట్ తర్వాత రావడం.. అప్పటికి కొత్త తరహా కథలకు తెలుగులో ఆదరణ లేకపోవడంతో ఫలితం తేడా కొట్టింది. ‘ఆరెంజ్’ ఫ్లాప్ తో మళ్లీ మాస్ జానర్ లో ఉండటమే సేఫ్ అన్న విషయం అర్థమైంది. అప్పటికి ఓ చిన్న సినిమా తీసిన సంపత్ నంది కథ నచ్చి చేసిన ‘రచ్చ’ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత అప్పటి మాసివ్ డైరెక్టర్ వివి వినాయక్ తో ‘నాయక్’లో రెండు పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్ కు డబుల్ డోస్ ఇచ్చాడు.
జంజీర్.. ఓ పాఠం..
సక్సెస్ ఎప్పుడూ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఆ నమ్మకంలో ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. రామ్ చరణ్ విషయంలోనూ అదే జరిగింది. తక్కువ టైమ్‌లోనే మాస్ హీరోగా ఎలివేట్ అయిన చరణ్‌ను బాలీవుడ్‌కు పంపాలన్న ఆలోచన ఎవరిదో గానీ.. అది ఓ బ్యాడ్ డెసిషన్ అని తెలియడానికి ‘జంజీర్’ వంటి డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ చేసిన ‘జంజీర్’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ ‘తుఫాన్’గా వచ్చింది. కానీ రెండు చోట్లా డిజాస్టర్. దీంతో ఇక ప్రయోగాలు చేయకూడదన్న విషయం తేలిపోయింది. అలాగే మళ్లీ తనదైన స్టైల్లో ఓ మాస్ సినిమా చేస్తే కానీ సెట్ కాదనుకున్నాడు. అయితే మాస్ తో పాటు మరో ఎక్స్‌పెరిమెం కూడా చేశాడు. అదే ‘ఎవడు’. అల్లు అర్జున్ ఓకీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అంతకు ముందు లేని విధంగా చాలా ఎగ్రెసివ్ గా కనిపిస్తాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ‘ఎవడు’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఎన్.ఆర్.ఐ. గా అలరించిన చెర్రీ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ సినిమాలోనూ వైవిధ్యభరిత పాత్రలో నటించాడు. కానీ.. సీనియర్ డైరెక్టర్స్ కృష్ణవంశీ, శ్రీను వైట్ల చెర్రీకి భారీ హిట్స్ అందించలేకపోయారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తనీ ఒరువన్’ను తెలుగులో ‘ధృవ’గా రీమేక్ చేసి తనూ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీతో చరణ్ కెరీర్ కొత్త టర్న్ ఇచ్చుకుంది. అంటే తనూ ప్రయోగాలు చేయొచ్చు అనే నమ్మకాన్ని పెంచింది.
రంగస్థలం.. ఓ మలుపు..
‘ధృవ’తో రామ్ చరణ్ ను ఆడియన్స్ కూడా కొత్తగా చూశారు. అప్పటి వరకూ వచ్చిన చాలా విమర్శలకు ఈ సినిమా సమాధానం చెప్పింది. అదే అతన్ని రంగస్థలం వంటి ప్రయోగాత్మక సినిమాకు ప్రిపేర్ చేసింది. లేదంటే చరణ్ లాంటి స్టార్ హీరో చెవిటి యువకుడి పాత్రలో కనిపిస్తాడా.. అది కూడా పూర్తి స్థాయి గ్రామీణ యువకుడి పాత్ర. సినిమా రిలీజయ్యాక రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్ తో ‘రంగస్థలం’ యునానిమస్ సూపర్ హిట్ టాక్ తో 200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. అన్ డౌటెడ్‌లీ ‘రంగస్థలం’లో రామ్ చరణ్ చేసిన పాత్ర ప్రతి హీరో డ్రీమ్ రోల్. ఇలాంటి పాత్ర కెరీర్‌లో ఒక్కసారైనా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. చిట్టిబాబు అనే పాత్రలో తనను తప్ప మరెవరినీ ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక.. ‘రంగస్థలం’ వంటి స్వీట్ హిట్ తర్వాత ‘వినయవిధేయ రామ’ వంటి చేదు గుళిక తిన్నాడు. అయినప్పటికీ రంగస్థలంతో వచ్చిన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.
ఆర్ఆర్ఆర్.. ఇమేజ్ ఆకాశానికి
‘మగధీర’ తర్వాత మళ్ళీ పదేళ్ళకు రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది చరణ్ కి. అది కూడా మల్టిస్టారర్. ఎన్టీఆర్ మరో హీరోగా రామ్ చరణ్ చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టింది. ఈ సినిమాతో సరికొత్త గ్లోబల్ స్టార్ గా అవతరించాడు చరణ్. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి విమర్శకులు ప్రశంసలు అందుకుంటున్నాడు. సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు శంకర్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వీటితో పాటు ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా.. సుకుమార్ డైరెక్షన్ లో మరొకటి లైన్లో పెట్టాడు చెర్రీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న మెగాధీరుడు మరిన్ని బర్త్ డేలు జరుపుకోవాలని కోరుకుందాం.