జానీ మాస్టర్‌లు ఇండస్ట్రీలో ఎందరో.. కామాంధులకు ఎండ్‌ కార్డ్ పడేది ఎప్పుడు..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నది.. ఎవరూ కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునే వారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు. సినిమాల్లో మహిళల గొప్పతనం గురించి గుక్కతిప్పకుండా హీరోలు భారీ డైలాగులు చెబుతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2024 | 05:11 PMLast Updated on: Sep 18, 2024 | 5:11 PM

Rapists In Movie Industry

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నది.. ఎవరూ కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునే వారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు. సినిమాల్లో మహిళల గొప్పతనం గురించి గుక్కతిప్పకుండా హీరోలు భారీ డైలాగులు చెబుతారు. ఐతే అదంతా ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే. ఆఫ్‌ స్క్రీన్‌లో బాబులు చాలా డేంజర్‌. సినిమా సెట్‌లో లైట్‌ ఆఫ్‌ అవ్వగానే వారిలోని అసలు రూపం బయటపడుతుంది. టాలీవుడ్‌లో మరోసారి కాస్టింగ్ కౌచ్ చర్చకు వచ్చింది. దీనికి కారణం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అలియాస్ షేక్‌ జానీ. ఓ డ్యాన్స్‌ షోలో కంటెస్టెంట్‌గా చేసే యువతికి.. తన దగ్గర అసిస్టెంట్‌గా చేరమని జానీ ఆఫర్ చేశాడు.

స్టార్‌ కొరియోగ్రాఫర్‌ దగ్గర అవకాశం… ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆ యువతి జానీ మాస్టర్‌తో అసిస్టెంట్‌గా చేరింది. తక్కువ టైంలోనో స్టార్‌ హీరోలతో పనిచేసే ఛాన్స్‌ దొరికింది. అసిస్టెంట్‌గా సత్తా చాటుతున్న యువతిపై జానీ మాస్టర్‌ వక్రబుద్ధి చూపించాడు. ఓ ప్రాజెక్ట్‌ నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు.. జానీ మాస్టర్‌తోపాటు యువతి కూడా వెళ్లింది. ముంబైలోని హోటల్‌ రూమ్‌లో జానీ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది యువతి. బెదిరించి.. భయబ్రాంతులకు గురిచేసి.. బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్తోంది యువతి. విషయం ఎవరికైనా చెప్తే.. కెరీర్‌ లేకుండా చేస్తానని బెదిరించినట్లు చెప్తోంది.

షూటింగ్‌ సమయంలో క్యారవాన్‌లో ఉండగా.. క్యారవాన్‌ లోపలికి వచ్చి తన ప్యాంట్‌ జిప్‌ విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని… సెక్స్‌ కోసం వేధించాడని చెప్తోంది యువతి. అడ్డుకోబోతే.. జుట్టుపట్టి అద్దానికేసి కొట్టాడని.. ఎన్నోసార్లు శారీరకంగానూ హింసించాడని ఆరోపిస్తోంది. జానీ మాస్టర్‌ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్తోంది. జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటకి వెళ్లి పనిచేసుకుంటుంటే.. అతడితో పాటు అతడి భార్య కూడా ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేడు. ఇక అటు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్‌ వ్యవహారం చర్చ జరుగుతున్న సమయంలో… త్రివిక్రమ్‌ పేరు ప్రస్తావించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు త్రివిక్రమ్‌పై గతంలోనే ఫిర్యాదు చేశానంటూ పూనమ్ సంచలన విషయం బయటపెట్టింది.

ఒకవేళ వారు ఆ ఫిర్యాదును సీరియస్‍గా తీసుకొని ఉంటే తనకు రాజకీయ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని ట్వీట్‌ చేసింది. సినిమా ఇండస్ట్రీ అనేక అవలక్షణాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వాటిని బయట పెట్టేందుకు మాత్రం ఎవరూ సాహసం చేయట్లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కలల ప్రపంచం. అందులోకి వెళ్లాలని.. ప్రేక్షకులను అలరించాలని.. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఎంతోమంది కలలు కంటుంటారు. అయితే అక్కడికి వెళ్లాకే లోతెంతో తెలుస్తుంది. కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్లాక బయటకు రాలేని పరిస్థితి. బయటకు వచ్చి నోరు తెరిస్తే.. అంతటితో కెరీర్ ఖతం. అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి. అయితే అందరూ తమకు జరిగిన అవమానాలను, తాము ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడకుండా ఉండలేరు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి.

ఇప్పుడు జానీ మాస్టర్‌ వ్యవహారం బయటపడింది. ఇంతకుముందు కొందరు నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు బయటికొచ్చాయి. కానీ జరిగిందేంటీ..? ఒక్క నటుడిపై అయినా చర్యలు తీసుకున్నారా.. ఒక్క దర్శకుడినైనా అరెస్ట్‌ చేయించగలిగారా.. ఒక్క నిర్మాత అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడా.. మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం రేపింది. ఆ రిపోర్ట్‌ బయటపడిన తర్వాత మిగిలిన ఇండస్ట్రీలు ఉలిక్కిపడ్డాయి. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లైంగిక వేధింపులపై కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అది నివేదిక కూడా ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఆ నివేదిక ఎందుకు బయటకు రాలేదు.. దీని వెనుక ఎవరున్నారు.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పై తారల మాటేంటి.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తకాదు. ఎంతోకాలంగా దీనిపై చర్చ జరుగుతున్నా.. బయట పెట్టేందుకు చాలామంది దైర్యం చేయడంలేదు. మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో .. టాలీవుడ్ కమిటీ నివేదికను కూడా బయటపెట్టాలనే డిమాండ్ మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సబ్ కమిటీ రిపోర్టును విడుదల చేయాలని స్టార్‌ హీరోయిన్‌ విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన కొందరు చాలాకాలంగా క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్నారు. సింగర్‌ చిన్మయి శ్రీపాద ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. తమిళ లిరిసిస్ట్‌ వైరముత్తు విషయంలో చిన్మయి అలుపెరుగని పోరాటం చేస్తోంది. మలయాళ స్టార్‌ దిలీప్‌ను జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది భావన. 2017లో దిలీప్‌పై సంచలన ఆరోపణలు చేశారు భావన.

తనను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు దిలీప్‌పై కేసు పెట్టింది భావన. ఈ కేసులో అతడు అరెస్టయ్యాడు. నానా పాటేకర్‌ విషయంలో తనుశ్రీ దత్తా చేస్తున్న ఫైట్‌ను అప్రిషియేట్‌ చేయాల్సిందే. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది కాదనలేని నిజం. కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబరుచుకునే వారు చాలామంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు. కొందరు వీటికి కమిట్ అయితే, మరికొందరు మాత్రం ఛీ కొడతారు. సొంత టాలెంట్‌నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతుంటారు. ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు, కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను షేర్ చేసుకుంటారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఆ కాలంలో మీడియా డెవలప్మెంట్ లేకపోవడం వల్లే ఇండస్ట్రీలో చాలామంది సర్దుకుపోయేవారు. అదే సమయంలో ఆ అడ్జస్ట్మెంట్ కి తగ్గట్టు ఇమడలేక సినిమాల నుంచి తప్పకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సినిమా, టీవీ పరిశ్రమల్లో చాలామంది మహిళలు లైంగిక వేధింపులను ఏదో ఒక రకంగా ఎదుర్కొని ఉంటారు.

అయితే ఎక్కువ మంది ఈ అంశంపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సహజమని సర్దుకుపోతున్నారు. ఒకవేళ బయటపడితే తామెక్కడ టార్గెట్‌ అవుతామేమో… తమకు అవకాశాలు దక్కకుండా పోతాయేమో అనే భయం వారిని వెంటాడుతోంది. నేరుగా ఎవరూ తమతో గడపాలని కోరరు. మేనేజర్ల ద్వారా మెసేజ్‌ పంపిస్తారు. వాళ్లకు ఎస్ చెప్తే ఒకలా.. నో చెప్తే మరోలా ట్రీట్ చేస్తారు. నో చెప్పిన వాళ్ల గురించి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్‌గా ప్రచారం చేస్తారు. ఆమెకు పొగరెక్కువ.. నటించడం రాదు.. టైమ్‌కి రాదు.. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో ఓ ముద్ర వేసేస్తారు. దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోతాయి. ఫేడ్‌ అవుట్‌ అయిపోతారు. ఇలా అవకాశాలు కోల్పోయిన వాళ్లెంతో మంది ఉన్నారు. పోరాడితే పోయేదేముంది. ఈ విషయం ఇప్పుడిప్పుడే కొందరికి అర్థమవుతోంది. చాలామంది నిర్భయంగా తమ గొంతు వినిపించగలుగుతున్నారు. తమకు అవకాశాలు దక్కకపోయినా పర్వాలేదు కానీ… ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదనుకున్నవారు… ధైర్యంగా బయటకు వస్తున్నారు. అందరు ఆ బాటలోకి వచ్చినప్పుడు.. లైంగిక వేధింపులపై ఎదురు తిరగగలిగినప్పుడే క్యాస్టింగ్‌ కౌచ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడుతుంది. ఎవరికివారు నోరు మూసుకుని కూర్చుంటే మళ్లీ పాత పద్దతులే కొనసాగుతాయి.