రష్మిక మందన్న నీ అంతు చూస్తాం.. మాస్ వార్నింగ్ ఇచ్చిన MLA..!
రష్మిక మందన్న సినిమాలు చేయడం ఏమో గానీ ఎప్పుడూ వివాదాల్లో మాత్రం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరో కాదు.. ఆమె సొంత ఇండస్ట్రీనే ఎప్పుడూ రష్మికను విలన్‌గా చూపిస్తుంటారు.

రష్మిక మందన్న సినిమాలు చేయడం ఏమో గానీ ఎప్పుడూ వివాదాల్లో మాత్రం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరో కాదు.. ఆమె సొంత ఇండస్ట్రీనే ఎప్పుడూ రష్మికను విలన్‌గా చూపిస్తుంటారు. కన్నడిగులకు ఈ భామను చూస్తుంటేనే మంటెత్తిపోతుంది. నువ్వు దేశానికి నేషనల్ క్రష్ అవుతావేమో గానీ మాకు మాత్రం కాదంటూ రష్మికపై మండి పడుతూనే ఉంటారు కన్నడిగులు. అంతగా ఆమె ఏం చేసిందబ్బా అనుకోవచ్చు..? కానీ రష్మిక వాళ్ల ఆత్మాభిమానంపై కొట్టింది. ప్రాణంగా చూసుకునే కన్నడ భాషను, ఇండస్ట్రీని అవమానించింది అనేది వాళ్ల భావన. ప్యాన్ ఇండియన్ వైడ్‌గా దుమ్ము దులిపేస్తున్న రష్మిక మందన్న.. తన సొంత ఇండస్ట్రీ కన్నడను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు అనేది వాళ్ల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. తాజాగా ఓ వివాదం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం రష్మిక తీరుపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. తన కెరీర్ ప్రారంభించడానికి అవకాశం ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని రష్మిక గౌరవించడం లేదని.. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావడానికి నిరాకరించిందని ఆయన ఆరోపించారు. రష్మిక పొగరును అణచాలని.. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలంటూ మండిపడ్డాడు ఎమ్మెల్యే రవి. నిజానికి ఇదే విషయంపై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సెలబ్రిటీ కూడా తమ రాష్ట్రంలో జరుగుతున్న 16వ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావట్లేదని అసహనం వ్యక్తం చేసారాయన. మార్చి 1 నుంచి 8 వరకు ఈ ఈవెంట్ బెంగళూరులో భారీగానే జరుగుతుంది.
ఓపెనింగ్ సెర్మనీలో కన్నడ నటీనటులు పాల్గొనకపోవడంపై ఈ క్రమంలోనే మండ్యా కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. మరీ ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న రష్మిక మందన్నపైనే ఫైర్ అయ్యాడాయన. ఫిలిం ఫెస్టివల్‌కు ఇన్వైట్ చేయడానికి 10-12 సార్లు వెళ్లినా.. రానని ఖరాకండిగా చెప్పిందని ఎమ్మెల్యే తీవ్రవ్యాఖ్యలు చేసాడు. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతోనే రష్మిక హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడాయన. అంతేకాదు.. కర్ణాటక రావడానికి తనకు టైం లేదని.. తాను రాలేనని చెప్పిందన్నాడు రవి. తన ఇల్లు హైదరాబాద్‌లో ఉంది.. కర్ణాటక ఎక్కడో కూడా తనకు తెలియదన్నట్లు ఆమె మాట్లాడిందంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యాడు.
ఈ మధ్యే ఛావా సినిమా ప్రమోషన్స్‌లో కూడా తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా చెప్పడంపై కన్నడిగులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసారు. అది మరిచిపోక ముందే ఇప్పుడేకంగా ఒక ఎమ్మెల్యే రష్మికపై విమర్శలు చేయడం సంచలనంగా మారుతుంది. ఈ వివాదంలో రష్మికకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. రాజ్యాంగం ఆమెతో సహా ప్రతి పౌరుడికి హక్కులు కల్పించిందని.. ఒకరి స్వేచ్ఛను మనం హరించకూడదంటూ వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి తెలిసి చేసినా.. తెలియక చేసినా రష్మిక మాత్రం కన్నడిగుల చేతిలో బలైపోతూనే ఉంది.