Razakar Review: అంత హైప్ లేదమ్మా.. రజాకార్ మారణహోమం..!

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే 'రజాకార్'. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 12:52 PMLast Updated on: Mar 15, 2024 | 12:52 PM

Razakar Review A Bold Attempt To Delve Into A Sensitive Period Action Thriller

Razakar Review: వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా వచ్చిన తాజా చిత్రమే ‘రజాకార్’. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఇందులో చూపించిన వాస్తవాలు ఎంత.. అనేది రివ్యూలో తెలుసుకుందాం.

స్టోరీ లైన్ విషయానికి వస్తే..
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్య్రం రాలేదు. అతను హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యం ‘తుర్కిస్తాన్’గా మార్చాలని ప్రయత్నిస్తాడు. దానికోసం ఖాసిం రజ్వీ నేతృత్వంలో నడిచే రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపుతాడు. వారు ప్రజలను చిత్ర హింసలకు గురి చేయడం, మాన ప్రాణాలు తీయడం, బలవంతపు మత మార్పిడులు చేయడం, మాతృభాషలను అణచివేయడం ఇలా ఎన్నో దారుణాల‌కు ఒడిగ‌డ‌తారు.

ఈ క్రమంలో కొందరు ప్రజలు వారి ప్రాణాలకు తెగించి నిజాంకి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడతారు. మరోవైపు అప్పటి భారత ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపే దిశగా ప్రయత్నాలు మొదలుపెడతారు. దీనికోసం ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీస్ చర్యను చేపడతారు. అయితే భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, హైదరాబాద్ విమోచనానికి 1948 సెప్టెంబర్ 17 వరకు ఎందుకు సమయం పట్టింది? నిజాం రాజుకి భారత ప్రభుత్వం ఏడాది గడువు ఎందుకు ఇచ్చింది? వంటి అంశాలను చూపిస్తూ ఈ చిత్రం నడిచింది.

Devara: గోవాలో ల్యాండింగ్.. బాహుబలి బాటలో దేవర..

పర్పామెన్స్ విషయానికి వస్తే..
సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో తేజ్ సప్రూ చక్కగా రాణించాడు. ఆయన ఆహార్యం, హావభావాలు నిజంగా పటేల్ నే చూస్తున్నామా అనే భావన కలిగిస్తాయి. నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాత్రలో మకరంద్ దేశ్‌పాండే సునాయాసంగా ఒదిగిపోయాడు. ఇక రజాకార్ల చీఫ్ ఖాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ జీవించాడు అని చెప్పవచ్చు. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, పోచమ్మగా అనసూయ భరధ్వాజ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ కూడా తమ మార్క్ చూపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఆమె రౌద్ర రూపం హైలైట్ గా నిలిచింది. తలైవాసల్ విజయ్, అనిష్క త్రిపాఠి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ విషయానికి వస్తే..
యాట సత్యనారాయణలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది సన్నివేశాల చిత్రీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఐలమ్మ ఇంట్రో, ఇంటర్వెల్ సన్నివేశం, రాజిరెడ్డి పోరాటం వంటి సన్నివేశాలు కట్టిపడేశాయి. అయితే సన్నివేశాలను అద్భుతంగా రాసుకొని, వాటిని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తే సరిపోదు. ఆ సన్నివేశాలను కలుపుతూ కథని నడిపించే సరైన కథనం ఉండాలి. అప్పుడే కథ అయినా, అందులోని సన్నివేశాలైనా ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని ఆయన గుర్తించినట్లయితే.. రజాకార్లు చిత్రం మరోస్థాయిలో ఉండేది. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆకట్టుకుంది. పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం విషయంలో సత్తా చాటాడు. తన సంగీతంతో చాలా సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లాడు. నిజాం కాలం నాటి పరిస్థితులను క్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయింది. కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. తనదైన ఫ్రేమింగ్, లైటింగ్ తో అప్పటి పరిస్థితులను చక్కగా చూపించాడు. బడ్జెట్ పరిమితుల కారణంగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు తేలిపోయాయి.
ఫైనల్ గా..
కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మరికొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కానీ ఈ ‘రజాకార్’ చూస్తుంటే.. సినిమా చూస్తున్న భావన కలగదు. కొన్ని సన్నివేశాలనో లేక కొన్ని ఎపిసోడ్ లనో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.హింసాత్మక సన్నివేశాల దృష్ట్యా సున్నిత మనస్కులు ఈ సినిమా చూడకపోవడమే బెటర్.