కాంట్రవర్సీ కొరియోగ్రఫీతో శేఖర్ మాస్టర్ కెరీర్ పై ఎఫెక్ట్.. స్టార్స్ దూరమవుతున్నారా..?
పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా శేఖర్ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా శేఖర్ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య కొన్ని సినిమాలలో ఆయన కంపోజ్ చేస్తున్న స్టెప్పులే దీనికి కారణం. నచ్చిందే రంభ అన్నట్టు.. నాకు వచ్చింది స్టెప్పు అంటూ దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్. టైం బాగున్నప్పుడు ఈయన ఏ స్టెప్ కంపోజ్ చేసినా కూడా సూపర్ పాపులర్ అయింది. కానీ అదే టైం ఒక్కసారి రివర్స్ అయింది అంటే మాత్రం అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినా.. కాంట్రవర్సీలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఉన్న సిచువేషన్ ఇదే. ఒకేసారి 10 సినిమాలకు పని చేస్తాడు ఈయన.. అందులో 9 సినిమాలకు ఖతర్నాక్ స్టెప్స్ కంపోజ్ చేస్తాడు.. కానీ ఆ మిగిలిన ఒక్క సినిమాలో ఏదో ఒక విచిత్రమైన స్టెప్పు ప్రయత్నించాలని ట్రై చేసి కాంట్రవర్సీ పాలు అవుతున్నాడు ఈ టాప్ కొరియోగ్రాఫర్.
ఆ స్టెప్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇది వైరల్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడు తప్ప.. వివాదాస్పదం అవుతుందని ఆలోచించలేకపోతున్నాడు ఈయన. అలాంటి డేంజరస్ స్టెప్పులు హీరోయిన్లతో వేయిస్తే.. అది తన కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని చిన్న లాజిక్ మరిచిపోతున్నాడు శేఖర్ మాస్టర్. గతంలో మాదిరి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు శేఖర్ వైపు చూడడం లేదు అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పుడు సినిమాలో ఆరు పాటలు ఉంటే అన్ని ఆయనే కంపోజ్ చేసేవాడు. అంతెందుకు మహేష్ బాబు లాంటి హీరో కూడా తనకు శేఖర్ మాస్టర్ కావాలి అంటూ సరిలేరు నీకెవరు నుంచి వరుసగా అతనితోనే పని చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకు శేఖర్ మాస్టర్ బాగా కావాల్సినవాడు. అయితే ఎందుకో తెలియదు గాని ఈమధ్య శేఖర్ కంటే బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ వైపు అడుగులు వేస్తున్నారు మన స్టార్ హీరోలు.
గణేష్ ఆచార్య, బాస్కో సీజర్ లాంటి బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ మన దగ్గర ఎక్కువగా పాటలు కంపోజ్ చేస్తున్నారు. దీనికి ఒక కారణం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీ స్టెప్పులు రావడమే అని వాదన కూడా జరుగుతుంది. మొన్నటికి మొన్న పుష్ప 2 సినిమాలోని ఫీలింగ్స్ పాటలో వచ్చే కొన్ని స్టెప్పుల మీద సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. అందుకే స్టార్ హీరోలు ఈ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే మునపటిలా కాకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలలో తన మీద మారిన ఈ అభిప్రాయాన్ని గమనించి.. తన కొరియోగ్రఫీలో ఏదైనా మార్పులు చేస్తాడేమో చూడాలి..!