రాబిన్ హుడ్ లంగా స్టెప్ ఎగిరిపోయింది.. థియేటర్ కోసం ఏం చేశారో తెలుసా..!
నిజం చెప్పాలంటే నితిన్ రాబిన్ హుడ్ సినిమాకు ప్రమోషన్ మొదలైంది అదిదా సర్ప్రైజ్ పాట విడుదలైన తర్వాతే. దానికి ముందు కూడా ఈ సినిమా ప్రమోషన్ చేశారు కానీ.. పుంజుకున్నది మాత్రం ఆ పాట నుంచే. ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒక స్టెప్పు గురించి మహిళా సంఘాలు ఏకంగా కంప్లైంట్ ఇచ్చేవరకు వెళ్లాయి

నిజం చెప్పాలంటే నితిన్ రాబిన్ హుడ్ సినిమాకు ప్రమోషన్ మొదలైంది అదిదా సర్ప్రైజ్ పాట విడుదలైన తర్వాతే. దానికి ముందు కూడా ఈ సినిమా ప్రమోషన్ చేశారు కానీ.. పుంజుకున్నది మాత్రం ఆ పాట నుంచే. ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒక స్టెప్పు గురించి మహిళా సంఘాలు ఏకంగా కంప్లైంట్ ఇచ్చేవరకు వెళ్లాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు శేఖర్ మాస్టర్ దొరికితే ఖచ్చితంగా ఎందుకు ఇలాంటి స్టెప్ కంపోజ్ చేశావని గట్టిగానే అడిగేలా ఉన్నారు మహిళా సంఘాలు. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజుల నుంచి శేఖర్ మాస్టర్ బయట కనిపించడం లేదు. రాబిన్ హుడ్ అదిదా సర్ప్రైజ్ పాట కంపోజ్ చేసిన తర్వాత.. అది ఆయన కెరీర్ కు అంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని ఆయన కూడా ఊహించి ఉండడు. క్రియేటివిటీ అని ఆయన అనుకున్నాడు కానీ దాన్ని ఆడియన్స్ మరోలా తీసుకున్నారు.
ఆ లంగా స్టెప్ ఎలా కంపోజ్ చేయాలి అనిపించింది అంటూ చాలామంది శేఖర్ మాస్టర్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేశారు. ఆయనను అడిగితే పర్లేదు.. మీడియా ముందుకు ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా ఈ స్టెప్ గురించి అడుగుతున్నారు. అదేదో సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటే మేమెందుకు దానిమీద స్పందించాలి అంటూ మిగతా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ దాటుకొని సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా కూడా సెన్సార్ వరకు వచ్చింది. అయితే అందరి కళ్ళు కప్పిన సెన్సార్ వాళ్ళ కళ్ళు మాత్రం అసలు కప్పలేరు దర్శక నిర్మాతలు. అందుకే ఆ లంగా స్టెప్పు సెన్సార్ బోర్డు దెబ్బకు ఎగిరిపోయింది. మొన్న ప్రెస్ మీట్ లో కూడా వెంకీ కుడుములను మీడియా ఇదే క్వశ్చన్ అడిగింది. అంత కాంట్రవర్సీ అయినా స్టెప్ సినిమాలో ఉంటుందా లేదా అని అడిగితే ఆయన వెండితెర మీద చూడండి అదిదా సర్ప్రైజ్ అన్నాడు. తాజాగా విడుదలైన తర్వాత చూస్తే నిజంగానే ఆ స్టెప్పు సినిమాలో కనిపించలేదు. కంపోజ్ చేసిన స్టెప్ అలాగే ఉంది.. కాకపోతే అది కనిపించకుండా జూమ్ చేశారు మేకర్స్. అలా అయితేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తాము అని బోర్డు చెప్పడంతో దర్శక నిర్మాతలకు మరో ఆప్షన్ కూడా లేకపోయింది.
స్టెప్పు ఉన్నట్టే ఉంటుంది కానీ కనిపించదు.. దీని మీద దర్శకుడు వెంకి కుడుముల కూడా ఇదే చెప్పాడు. సినిమాలో ఈ స్టెప్పు ఉంటుంది కానీ కాంట్రవర్సీ అయినా ఆ లంగా స్టెప్ మాత్రం కనిపించదు అని చెప్పాడు. అనుకున్నట్టుగానే స్క్రీన్ జూమ్ చేసి చూపించారు. స్టెప్పు తీసేయకుండా.. అలాగని సెన్సార్ వాళ్లను, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ మనోభావాలు మళ్లీ దెబ్బ తినకుండా సింపుల్ గా స్టెప్పు కనిపించకుండా కవర్ చేశారు. పోనీ ఇంత చేసిన సినిమాకు ఏమైనా హెల్ప్ అయిందా అంటే లేదు.. మొదటిరోజు కనీసం ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకు వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ రాబిన్ హుడ్ సినిమా మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. చలో, భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వెంకీ కుడుముల నుంచి వస్తున్న సినిమా అయినా.. శ్రీలీలా లాంటి స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నా.. అన్నింటికీ మించి మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. విడుదల తర్వాత కూడా ఈ పరిస్థితి పెద్దగా మారినట్టు కనిపించడం లేదు. ఎలా చూసుకున్నా కూడా నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయేలా కనిపిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న లంగా స్టెప్పు కూడా థియేటర్లో కనిపించకుండా పోయింది. మొత్తానికి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది రాబిన్ హుడ్ పరిస్థితి. ఎప్పుడో 90ల్లో తీయాల్సిన సినిమా ఇప్పుడు తీస్తే ఇలాగే ఉంటుంది అంటూ దీనిమీద మీమ్స్ కూడా బాగానే పేలుతున్నాయి.