రాబిన్ హుడ్ రివ్యూ.. నితిన్ ఏంటి భయ్యా ఇంత రాడ్ దించాడు..! ఇలాగైతే కష్టమే..

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2025 | 04:32 PMLast Updated on: Mar 28, 2025 | 4:32 PM

Robin Hood Review

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి రాబిన్ హుడ్ ఎలా ఉన్నాడు నిజంగానే ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..కథ విషయానికి వస్తే చాలా సింపుల్.. టైటిల్ లో చెప్పినట్టే మన హీరో రాబిన్ హుడ్. అనాధ కావడంతో చిన్నప్పటినుంచి అనాధాశ్రమంలో పెరుగుతాడు. కాకపోతే ఆశ్రమాలలో నడపడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు నిర్వాహకులు. వాటికి సాయం చేస్తున్నట్టు నటించి చాలామంది అక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో మన హీరో నితిన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు.. పెద్దవాళ్ళని దోచేసి పేదవాళ్ళకు పెట్టాలి అని రాబిన్ హుడ్ అయిపోతాడు.

అలా ఎన్నో కోట్ల రూపాయలు దోచుకుని అనాధ ఆశ్రమాలకు ఇస్తూ ఉంటాడు. మరి దొంగ ఉన్నప్పుడు పోలీస్ కూడా రావాలి కదా.. అలా మన దసరా విలన్ షైన్ టామ్ చాకో రంగంలోకి దిగుతాడు. మనోడు వచ్చిన తర్వాత హీరో కాస్త వెనక్కి తగ్గి ఆ రాబిన్ హుడ్ పనులు మానేస్తాడు. అంతలోనే ఆస్ట్రేలియా నుంచి హీరోయిన్ దిగుతుంది. ఈమె కోసం సెక్యూరిటీగా జాయిన్ అవుతాడు నితిన్. కానీ హీరోయిన్ చుట్టూ అనుకోకుండా విలన్ మనుషులు తిరుగుతూ ఉంటారు. మరోవైపు రుద్ర కొండ అనే ఊర్లో గంజాయి పండిస్తుంటాడు విలన్ దేవదత్త. ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతుండగా అనుకోకుండా విలన్ లైఫ్ లోకి హీరో ఎంటర్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం విషయానికి వస్తే.. రాబిన్ హుడ్ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చిన్నప్పటి టైటిల్ పెట్టినప్పుడే అర్థం చేసుకోవాలి ఇది ఎప్పుడో రావాల్సిన సినిమా అని. కేవలం టైటిల్ మాత్రమే కాదు కథ కూడా 90స్ లోనే ఆగిపోయింది. పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే రాబిన్ హుడ్ కథలు తెలుగులో ఎన్నో వచ్చాయి. ఇది కూడా అలాంటి కథే. ఇంకా చెప్పాలంటే 15 ఏళ్ల కింద రవితేజ నటించిన కిక్ సినిమా లైన్ ఇందులో సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో చాలా వరకు మనకు కిక్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దొంగ, పోలీస్ మధ్య మైండ్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఈ సీన్స్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు. శ్రీలీలా వచ్చిన తర్వాత వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.

ఫస్టాఫ్ ఏదో అలా సోసోగా వెళ్లిపోయిన తర్వాత.. సెకండాఫ్ మెయిన్ కథలోకి వెళ్తాడు డైరెక్టర్. అయితే అందులో చెప్పుకోవడానికి పెద్దగా కథ లేకపోవడంతో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. హీరో విలన్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు వెంకీ కుడుముల. ఈ దర్శకుడు బలం కామెడీ.. చలో, భీష్మ సినిమాలలో రొటీన్ కథలతోనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వెంకీ.. ఈసారి మాత్రం విఫలమయ్యాడు. పాత కథ రాసుకోవడమే కాదు స్క్రీన్ ప్లే కూడా అంతకంటే పాతగా రాసుకున్నాడు. దాంతో ఎక్కడా కూడా రాబిన్ హుడ్ మనకు నచ్చుతున్నట్టు అనిపించదు. పాతకాలం సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. పాపం నితిన్ ఏ క్యారెక్టర్ ఇచ్చిన కూడా శక్తి వంచన లేకుండా నటిస్తూ ఉంటాడు. ఈ సినిమాకు కూడా అదే చేశాడు. శ్రీలీల ఈసారి పాటలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఆమె క్యారెక్టర్ చెప్పుకోదగ్గ విధంగా డిజైన్ చేయలేదు డైరెక్టర్. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ఉన్నంతలో కాస్త నవ్వించారు. మలయాళం నటుడు లాల్ కీలకపాత్రలో పర్లేదు అనిపించాడు. ఇక విలన్ దేవదత్త నాగే జస్ట్ ఓకే. సినిమా చివర్లో డేవిడ్ వార్నర్ అలా మెరిసి మాయమయ్యాడు. ఈయన పాత్ర మనం ఊహించుకున్న రేంజ్ లో అయితే ఉండదు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పెద్దగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా వీక్. చాలా సన్నివేశాలు ఎందుకు ఉంచారో కూడా అర్థం కాలేదు. కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి ఎడిటర్ ను తప్పు పట్టలేము. దర్శకుడు వెంకీ కుడుముల ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. అటు రైటింగ్, ఇటు డైరెక్షన్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా సినిమా నిర్మించారు.