Samantha: సమంత కోసం గుడి కడుతున్న అభిమాని.. ఎందుకింత అభిమానమంటే?
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించటంలో సమంత చూపిన చొరవ సందీప్‌ని ఆకట్టుకుంది. సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె కోలుకోవాలని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కులు కూడా చెల్లించుకున్నాడు.

Samantha: చుండూరు మండలం అలపాడు గ్రామానికి చెందిన తెనాలి సందీప్‌కు సినీ నటి సమంత అంటే పిచ్చి అభిమానం. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా సందీప్ పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించటంలో సమంత చూపిన చొరవ సందీప్‌ని ఆకట్టుకుంది.
సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె కోలుకోవాలని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కులు కూడా చెల్లించుకున్నాడు. ఇప్పుడు ఆమె కొలుకోవటంతో చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం రెట్టింపైందని సందీప్ చెబుతున్నాడు. సమంతపై వీరాభిమానంతో ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించాడు. తన ఇంటి ప్రాంగణంలో చిన్నపాటి గుడి కట్టిస్తున్నాడు. విగ్రహాన్ని కూడా తెనాలిలోనే తయారు చేయించాడు.
గురువారం తెనాలి నుంచి సమంత విగ్రహాన్ని ఆలపాడుకు తీసుకువెళ్లి, అక్కడ ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నాడు. శుక్రవారం 28వ తేదీన సమంత పుట్టిన రోజు కావడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ సమంతను నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతో ఈ గుడి కట్టానని సందీప్ చెప్పారు.