Seethakka: సీతక్క జీవిత కథతో సినిమా!
సీతక్క.. పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ నాయకురాలు కాదు.. నాయకురాలు ఈమె ! తోటి వాడి కష్టం.. మనదే అనుకొని కష్టపడే వ్యక్తిత్వం. అన్యాయాన్ని ఎదురించే నైజం.
ఆ గుణమే అడవిలోకి వెళ్లేలా చేసింది. అడవి నుంచి బయటకు వచ్చాక.. జనాలకు దగ్గర చేసింది. తొంగిచూడాలే కానీ.. సినిమాకు సరిపడా ఎమోషన్స్ ఉంటాయ్ సీతక్క జీవితంలో! చిన్న వయస్సులోనే పోరుబాట పట్టిన వీరవనిత సీతక్క. సీతక్క అసలు పేరు అనసూయ. ఆమె అడవిలోకి వెళ్లిన తర్వాత సీతక్కగా మారారు. ఆ తర్వాత ప్రజా జీవనంలోకి వచ్చిన ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జూలై 9న సీతక్క బర్త్‌డే. చంద్రబాబుతో సహా రాజకీయ ప్రముఖులంతా.. ఆమెకు విషెస్ చెప్పారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా.. సీతక్కకు బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. అంతే కాదు అందరూ ఆశ్చర్యపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు.
సీతక్కకు విషెస్ చెప్తూ బండ్ల చేసిన పోస్టింగ్‌కు.. ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దానికి బండ్ల ఇచ్చిన రియాక్షన్ హాట్‌టాపిక్ అవుతోంది. అడవిలో అన్న, లీడర్ సినిమాలి కలిపితే నిజజీవితంలో సీతక్క సినిమా అవుతుందని.. మీరు తప్పకుండా సినిమా తీయాలని నెటిజన్ కామెంట్ చేయగా.. వెంటనే స్పందించిన బండ్ల అద్భుతమైన సలహా తమ్ముడు.. తప్పకుండ ఆలోచిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. రాజకీయాలు దూరంగా ఉంటానని ఆ మధ్య ప్రకటించిన బండ్ల గణేష్.. మళ్లీ కాంగ్రెస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతిలో చేయేసి అని ఈ మధ్యే ట్వీట్ చేశాడు ఒకటి. పాదయాత్రలో ఉన్న సమయంలో భట్టి విక్రమార్కను కూడా ప్రత్యేకంగా కలిశారు. ఇప్పుడు సీతక్క జీవిత కథతో సినిమా అంటున్నారు. కాంగ్రెస్ నేతలను మచ్చిక చేసుకునేందుకు గట్టి ప్లానే వేస్తున్నావ్ మైక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.