విశాల్‌తో పెళ్లి అన్నారు.. మరొకరితో సైలెంట్‌గా ఆ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్..!

ఇండస్ట్రీలో ఓ వైపు విడాకుల పర్వంతో పాటు.. మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. పెళ్లి చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు.. విడిపోయేవాళ్లు విడిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 06:50 PMLast Updated on: Mar 11, 2025 | 6:50 PM

She Said She Would Marry Vishal But The Heroine Is Silently Engaged To Someone Else

ఇండస్ట్రీలో ఓ వైపు విడాకుల పర్వంతో పాటు.. మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. పెళ్లి చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు.. విడిపోయేవాళ్లు విడిపోతున్నారు. పెళ్లి, విడాకుల పోలిక వినడానికి చెండాలంగా అనిపించినా.. నడుస్తున్న ట్రెండ్ అయితే ఇదే ఇప్పుడు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్ళి పీటలెక్కబోతుంది. ఎప్పట్నుంచో తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోయిన్ ఆమె. అందరికీ బాగా పరిచయం ఉన్న అమ్మాయే.. అయితే ఆ హీరోయిన్ అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమెకు చెవులు వినిపించవు.. మాటలు రావు.. మూగ చెవుడు అయినా కూడా సినిమాల్లో ఉండి తన సత్తా చూపిస్తూ ఎన్నో సినిమాల్లో నటించి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా..?

యస్.. మీ ఊహ నిజమే.. అభినయ పెళ్లి సెట్ అయిందిప్పుడు. శంభో శివ శంభోతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మాయి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మాయ చేసింది. ఆ తర్వాత దమ్ము, ఢమరుకం, గామి ఇలా చాలా సినిమాల్లో నటించింది అభినయ. మూగ చెవుడు ఉన్నా కూడా తన అభినయంతోనే అందరినీ అలరించింది. ఆమె నటన చూస్తే తను మూగమ్మాయనే భావన ఎక్కడా రాదు. కేవలం సైగలతోనే తాను చెప్పాలనుకున్నది ఇంటర్వ్యూలలో చెప్తుంది అభినయ. తాజాగా ఈమె ఒక స్వీట్ న్యూస్ చెప్పింది. తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అభినయ. తమది 15 ఏళ్ల బంధం అని కూడా ఆమె తెలిపింది. తనకు కాబోయే వరుడితో కలిసి గుడి గంట కొడుతున్న నిశ్చితార్థం ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అభినయ.

అందులో చేతులకు ఉన్న రింగులు, గంట మాత్రమే కనిపిస్తున్నాయి. పెళ్లి కొడుకు ఎవరనేది ఇంకా చెప్పలేదు అభినయ. పెళ్లి సమయానికి ఫొటోలు బయటికి వస్తాయేమో మరి చూడాలి. అయితే అభినయ గతంలో హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని అభినయ ఖండించింది. విశాల్ కూడా తనకు అభినయ మంచి స్నేహితురాలు అని చెప్పాడు. అయినా మీడియాలో వీళ్ళిద్దరి గురించి న్యూస్ అయితే ఆగలేదు. ఇప్పుడు తన పెళ్లితో విశాల్ మ్యాటర్‌ను పూర్తిగా పక్కనబెట్టేసింది అభినయ. ఈ అమ్మాయికి అంతా మంచే జరిగాలి అని కోరుకుంటున్నారు అభిమానులు. మనం కూడా అదే కోరుకుందాం..!