తెలుగులో మళ్లీ ‘బిగ్‌బాస్’ సందడి మొదలవ్వబోతుంది. ఇప్పటికే ‘బిగ్‌బాస్’ 7 సీజన్లుగా ప్రసారమయ్యింది. తొలి సీజన్ ను తనదైన వ్యాఖ్యానంతో సూపర్ డూపర్ హిట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ తర్వాత రెండో సీజన్ కోసం హోస్ట్ గా నేచురల్ స్టార్ నాని రంగంలోకి దిగాడు. ఇక.. తెలుగు ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకూ నాగ్ ఐదు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే.. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం హోస్ట్ విషయంలో మేజర్ ఛేంజెస్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట ‘బిగ్‌బాస్’ నిర్వహకులు. అది కూడా.. ‘బిగ్‌బాస్ 7’ కంటెస్టెంట్ గా పాల్గొన్న శివాజీని హోస్ట్ గా చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ప్రతీ సంవత్సరం జూలై లేదా సెప్టెంబర్ నుంచి ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్ మొదలవుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా జూలై చివరిలో కానీ.. సెప్టెంబర్ మొదటి వారంలో కానీ.. ‘బిగ్‌బాస్’ని షురూ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక.. ‘బిగ్‌బాస్-7’లో కంటెస్టెంట్ గా ఎంటరై.. 105 రోజుల పాటు హౌజ్ లో ఉండి.. టాప్-3లో ఒకడిగా నిలిచాడు శివాజీ. బుల్లితెరతో పాటు చిత్ర పరిశ్రమలో సుధీర్ఘ అనుభవం ఉన్న శివాజీ మంచి మాటకారి. పైగా.. ఇతరుల తప్పొప్పులను ఎంచడంలో నేర్పరి. ఈ క్వాలిటీసే ‘బిగ్‌బాస్’ హోస్ట్ కి కావాల్సినవి. అందుకే.. శివాజీని ‘బిగ్‌బాస్-8’కి వ్యాఖ్యాతగా చేయాలనేది నిర్వహకుల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. ‘బిగ్‌బాస్-8’ హోస్ట్, కంటెస్టెంట్స్ వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.