TV Serials: సీరియళ్లకు కాలం చెల్లిందా..? తగ్గిపోతున్న టీఆర్పీ రేటింగ్స్.. ఓటీటీలే కారణమా..?
సీరియల్స్ చూసే వాళ్ల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం.. సీరియల్స్ క్వాలిటీ తగ్గడం కాదు. ఓటీటీలు. సినిమాలే కాదు.. ఓటీటీల దెబ్బకు టీవీ రంగం.. అందులోనూ సీరియల్స్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
TV serials: టీవీ సీరియళ్లకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. క్రమంగా టీవీ చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. దీంతో సీరియళ్లకు రేటింగ్స్ పడిపోతున్నాయి. ఈ కారణంగా అనేక సీరియల్స్ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఫలితంగా సీరియల్స్‌పై ఆధారపడ్డ వారి జీవితాలు ఇరకాటంలో పడుతున్నాయి.
టీవీ సీరియళ్లను జీడిపాకంతో పోల్చేవాళ్లు. ఎందుకంటే ఇవి ఏళ్ల తరబడి సాగుతుండేవి. అవే పాత్రలు, అదే కథ, కథనాలు.. కానీ, ప్రేక్షకులు వాటిని ఆదరించే వాళ్లు. బోర్ అనేదే లేకుండా ఎంతకాలమైనా సీరియల్స్ చూసేవాళ్లు. వాటికి ఆదరణ దక్కేది. ఎందరికో ఉపాధి దొరికేది. అదిరిపోయే రేటింగ్స్ నమోదవుతుండటంతో నిర్మాతలకు, ఛానెల్స్ వారికి కాసుల పంట పండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సీరియల్స్ చూసే వాళ్ల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం.. సీరియల్స్ క్వాలిటీ తగ్గడం కాదు. ఓటీటీలు. సినిమాలే కాదు.. ఓటీటీల దెబ్బకు టీవీ రంగం.. అందులోనూ సీరియల్స్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఎనిమిదేళ్ల క్రితం 80 శాతం సీరియల్స్ ఏడాదికిపైగా ప్రసారమయ్యేవి. కొంచెం ఆదరణ ఉన్న సీరియల్స్ కూడా నాలుగైదేళ్లు.. సూపర్ సక్సెస్ అయితే పదేళ్లపాటు నడిచిన సీరియల్స్ కూడా ఉన్నాయి. దీనికోసం ముందుగానే సీరియల్స్ నిర్మాతలు ఛానెల్ వారితో నాలగైదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంటారు. కానీ, ఇప్పుడు చాలా సీరియల్స్ ఏడాది కూడా ప్రసారం కావడం లేదు. రేటింగ్స్ తగ్గుతున్న కారణంగా చాలా వాటిని ఏడాదిలోపే ముగించాల్సి వస్తోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సీరియల్‌కు సగటున 5 కంటే ఎక్కువ టీఆర్పీ వచ్చేది. ఇప్పుడు మాత్రం 2.5 రావడమే కష్టమైపోతోంది. నిర్మాతలు తమ సీరియల్ స్థాయిని బట్టి ఒక ఎపిసోడ్‌కు హిందీలో రూ.5-7 లక్షల వరకు బడ్జెట్ కేటాయించేవాళ్లు. కొందరు ఏడాదికి 260 ఎపిసోడ్లకుగాను రూ.2 కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించేవాళ్లు. సీరియల్ హిట్టైతే వంద ఎపిసోడ్ల తర్వాత నుంచి లాభాలొస్తాయి. కొన్ని సీరియళ్లకు 160 రోజుల నుంచి లాభాలొచ్చేవి. అంటే ఆ తర్వాత ప్రసారమయ్యే మిగతా 100 ఎపిసోడ్లకు వచ్చే డబ్బులన్నీ లాభాలే. కానీ, ఇప్పుడు కొన్ని సీరియల్స్ వంద ఎపిసోడ్స్‌కే ఆగిపోతున్నాయి. దీనివల్ల చాలా నష్టం వస్తోంది. ఇంకొన్ని 160 ఎపిసోడ్లకు ఆపేయాల్సి వస్తోంది. ఈ సందర్భాల్లో లాభాలు ఉండటం లేదని నిర్మాతలు చెబుతున్నారు.
టీవీ సీరియళ్లలో ఒక ఎపిసోడ్‌కు అయ్యే ఖర్చుతో ఓటీటీ (టీవీ+) సిరీస్‌లు 25 వరకు తీసేస్తున్నారు. మొత్తంగా 25-100 ఎపిసోడ్ల సిరీస్‌లు మాత్రమే తీసి కొందరు నిర్మాతలు లాభాలు పొందుతున్నారు. దీంతో టీవీ సీరియళ్లకు ఖర్చు పెరిగిపోయి, రేటింగ్స్ తగ్గిపోయి ఆదాయం ఉండటం లేదు. గతంలో అనేక సీరియల్స్ వెయ్యి ఎపిసోడ్లకుపైగా ప్రసారమైతే.. ఇటీవలి కాలంలో ఏడాదిపాటు ప్రసారం కావడమే గొప్ప అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితి కొత్త సీరియళ్లకే ఉందనుకుంటే పొరపాటే.. ఏళ్ల తరబడి ప్రేక్షకులు మెచ్చిన సీరియల్స్ కూడా ఇటీవలికాలంలో ఆగిపోతున్నాయి. వరుసగా టీవీ ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్స్, షోస్ కూడా నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం 60 శాతం సీరియల్స్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.
టీవీ + కంటెంట్‌తోనే సమస్య
టీవీ+ లేదా ఓటీటీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ వల్లే టీవీ రంగానికి దెబ్బ పడుతోంది. ఇవి ముందుగానే 25/50/100 ఎపిసోడ్లుగా రిలీజవుతున్నాయి. వీటి బడ్జెట్ రూ.30-50 లక్షలలోపే ఉంటోంది. ఇవి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. సోనీ లివ్, జియో సినిమా వంటి ఓటీటీలు ఈ తరహా సిరీస్‌లను హిందీలో ప్రోత్సహిస్తున్నాయి. గుల్లాక్, లఖాన్ లీలీ భార్గవ్ (ఎల్ఎల్‌బీ) వంటి సక్సెస్‌ఫుల్ సిరీస్‌లు ఇందుకు మంచి ఉదాహరణలు. సీరియళ్లతో పోలిస్తే వీటికి బడ్జెట్ తక్కువ. సీరియల్స్ షూట్ చేసేందుకు చాలా ఖర్చవుతోంది. టీవీ సిరీస్‌లను మాత్రం లైవ్ లొకేషన్స్‌లో, సెట్స్‌తో పని లేకుండా తీస్తూ లాభాలు పొందుతున్నారు నిర్మాతలు. అందుకే వాటికి ఆదరణ పెరిగి లాభాలొస్తుంటే.. సీరియల్స్‌కు తగ్గుతూ వస్తోంది. ఓటీటీల దెబ్బకు టీవీ రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని విశ్లేషకులు అంటున్నారు.